Courses and Jobs: నర్సింగ్ కలేజీలో శిక్షణ.. విదేశాల్లో ఉద్యోగం..!

సాక్షి ఎడ్యుకేషన్: ది ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో ‘నర్సింగ్ విత్ అవుట్ బోర్డర్స్, ఎక్స్‌ప్లోరింగ్ గ్లోబల్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్( ఏపీఎస్‌ఎస్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ డాక్టర్ వి. వినోద్‌కుమార్ మాట్లాడుతూ జర్మనీ, జపాన్ దేశాలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. తద్వారా ఏపీ నుంచి నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు ఆయా దేశాల్లో నర్సులుగా మంచి ఉద్యోగం పొందవచ్చని సూచించారు.
Balkonda Government High School: బడికి వెళ్లాలంటేనే భయం..
విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునేవారికి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 55 నర్సింగ్ కాలేజీలను ఎంపిక చేసుకుని, విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు కావాల్సిన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఎంత మందిని అయినా పంపిస్తామని, నెలకు వేతనం రెండున్నర లక్షలు ఉంటుందని వెల్లడించారు. ఇండియన్ రిసక్షన్ కౌన్సిల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎస్‌సి. చక్రరావు మాట్లాడుతూ బీఎస్సీ, జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యార్థులకు లైఫ్ సేవింగ్ కోర్సులో భాగమైన సీపీఆర్‌పై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నర్సింగ్ సిబ్బంది దీనిని సద్వినియోగం చేసుకుని ప్రాణాలు కాపాడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ తప్పనిసరిగా నేర్చుకోవాలని తెలిపారు. అమెరికా టెక్సాస్ టెక్ హెల్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ డయాలసిస్‌లో నర్సుల పాత్ర చాలా కీలకమని చెప్పారు.
ఏపీ నర్సింగ్ డెప్యూటీ డైరక్టర్ బి.వల్లీ, అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అజినాస్ మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులకు మన దేశంలో, విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఎయిమ్స్ పాట్నా ప్రిన్సిపాల్ డాక్టర్ రతీష్‌నాయర్ విదేశాల్లో నర్సింగ్ అభ్యసించిన వారికి ఉన్న ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ టీటీకె రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ ప్రొఫెసర్ కె.సుశీల, ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సీఆర్ సంషీర్ బేగం, పలు నర్సింగ్ కాలేజీల విద్యార్థులు, యూనియన్ సభ్యులు హాజరయ్యారు. సదస్సు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి.