H-1B Visa: ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్.. హెచ్–1బీ వీసా రెన్యువల్ ఇక అక్కడే!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాలో ఉపాధి పొందిన భారతీయులకు శుభవార్త!. వర్క్ వీసాల రెన్యువల్ కోసం ఆయా వీసాదారులు ఇకపై స్వదేశం(భారత్)కు వెళ్లిరావాల్సిన పనిలేకుండా వారికి అమెరికాలోనే పునరుద్ధరణ సేవలు పొందే సదావకాశం కల్పించాలని అమెరికా సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది భారతీయులకు ఎంతో సమయం, విమాన ఖర్చులు ఆదా అవుతాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారతీయులకు అగ్రరాజ్యం అందిస్తున్న కానుకగా ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు అభివర్ణించారు.
నైపుణ్య ఉద్యోగాల్లో నియామకాల కోసం అమెరికా కంపెనీలు విదేశీయులకు హెచ్–1బీ వీసాలిచ్చి అమెరికాకు రప్పించడం తెల్సిందే. ఇలా హెచ్–1బీ వీసాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం విశేషం. ‘వీసా రెన్యువల్ కోసం సొంత దేశానికి వెళ్లకుండానే అమెరికాలోనే ఆ పని పూర్తయ్యేలా మొదట పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలుచేస్తాం. త్వరలోనే ఇది మొదలుపెడతాం. హెచ్–1, ఎల్ వీసా దారులకు ఇది ఎంతో ఉపయోగకరం’ అని ఆ అధికారి వెల్లడించారు.
చదవండి: విదేశాల్లో ఉద్యోగాలకు రేపు రిజిస్ట్రేషన్లు
2004 ఏడాదికి ముందువరకు నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల్లో కొన్ని విభాగాల వీసాలకు అమెరికాలోనే రెన్యువల్/స్టాంపింగ్ ఉండేది. తర్వాత పద్దతి మార్చారు. హెచ్–1బీ వంటి వీసాదారులు ఖచ్చితంగా సొంత దేశం వెళ్లి వీసా పొడిగింపు సంబంధ స్టాంపింగ్‌ను పాస్‌పోర్ట్‌పై వేయించుకోవాలి. ఈ ప్రయాస తగ్గించాలనే అమెరికా భావిస్తోంది. కాగా, గత కొద్దినెలలుగా వీసాల జారీ ప్రక్రియను అమెరికా ప్రభుత్వం మరింత సరళతరం, వేగవంతం చేయడం విదితమే.