Training for Panchayat Secretaries: 29 నుంచి పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రేడ్–1 నుంచి గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు ఈనెల 29 నుంచి ఆరు రోజుల పాటు రెసిడెన్షియల్ రిఫ్రెషర్ శిక్షణను ఇస్తున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు సంబంధించి స్థానిక జిల్లాపరిషత్‌లోని డీపీఆర్‌సీ భవనాన్ని శుక్రవారం శ్రీకాళహస్తి నుంచి వచ్చిన జిల్లా పరిశీలకులు వెంకటరత్నంతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం తమ చాంబర్‌లో జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజు నాయుడు, జెడ్పీ డిప్యుటీ సీఈఓ వి.వి.సుబ్బారెడ్డితో కలసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పరిపాలన, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరు రోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమాల్లో ఏయే తేదీల్లో ఏయే మండలాలకు సంబంధించిన కార్యదర్శులను ఎంతమందిని శిక్షణకు ఆహ్వానించాలనే అంశంపై సంబంధిత అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో డీపీఆర్‌సీ సిబ్బంది గిడ్డేష్, రాజవర్దన్ తదితరులు పాల్గొన్నారు.