Skip to main content

AP Model Schools: మోడల్‌ స్కూల్‌ టీచర్‌ ఉద్యోగాల పేరిట టోకరా

A person created a model school teacher fake ID card

కురబలకోట : మోడల్‌ స్కూల్‌లో టీచర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బి.ఆంజనేయులు నాయక్‌ పేరుతో ఓ మోసగాడు పలువురిని మోసగించిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఆధార్‌ కార్డును బట్టి ఇతనిది పెద్దమండ్యం మండలం ముసలికుంట ప్రాంతంగా తెలుస్తోంది. బాధితుల కథనం మేరకు.. బి.ఆంజనేయులు నాయక్‌ పేరుతో ఓ వ్యక్తి ఫేక్‌ ఐడీ కార్డు సృష్టించుకున్నారు. ఈఐడీ నంబరు 1155263గా ఉంది. టీజీటీ తెలుగు టీచర్‌గా కురబలకోట మోడల్‌ స్కూల్‌లో పని చేస్తున్నట్లుగా ఐడీ కార్డులో ఉంది. ఎంఈఓగా ఎస్‌ఆర్‌ రెడ్డి అనే సంతకం ఉంది. ఇక్కడ ఎంఈఓగా ద్వారకనాథ్‌ ఉన్నారు. దీన్ని బట్టి పథకం ప్రకారం ఫేక్‌ ఐడీ కార్డు సృష్టించుకుని అభ్యర్థులను మోసం చేసినట్లు వెల్లడవుతోంది. శుక్రవారం తిరుపతి నుంచి ఓ అమ్మాయి టీచర్‌ ఉద్యోగం కోసం నేరుగా కురబలకోట మోడల్‌ స్కూల్‌కు రావడంతో అక్కడి ప్రిన్సిపాల్‌తో సహా టీచర్లు అవాక్కయ్యారు. దీంతో ఈ మోసగాడి బండారం కాస్తా బయటపడింది. తన నుంచి రూ.15 వేలు ఫోన్‌పే వేయించుకున్నట్లు ఆమె చెబుతోంది. మరొకరు రూ.50 వేలు నగదు చేతికి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇతను డబ్బు తీసుకోవడం, లావాదేవీలు చేయడం కూడా మోడల్‌ స్కూల్‌లో నుంచి స్కూటర్‌పై బయటకు వచ్చినట్లుగా బిల్డఫ్‌ ఇచ్చేవాడని బాధితులు చెబుతున్నారు. మోడల్‌ స్కూల్‌ ముందున్న హైవే రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఫోన్‌లో టీచర్‌ పోస్టు కోసం మాట్లాడినట్లు నమ్మించాడని చెబుతున్నారు. ప్రస్తుతానికి మోసపోయిన వారు కొందరే బయటపడుతున్నారు. నిరుద్యోగులకు టీచర్‌ పోస్టు ఇప్పిస్తానంటూ ఇతనే ఫోన్‌ చేసినట్లు వెల్లడవుతోంది. కొందరు మా నెంబరు మీకు ఎలా తెలుసు అని అడిగితే నాకు అంతా తెలుసని చెప్పేవాడని మోసపోయిన వారు చెబుతున్నారు. దీన్ని బట్టి అధ్యాపక రంగానికి చెందిన వ్యక్తే ఇలా మోసం చేస్తుండవచ్చని భావిస్తున్నారు. ఇతని మొబైల్‌ నంబరుకు ఫోన్‌ చేస్తే సమాధానం లేదని చెబుతున్నారు. ఇతని బారిన పడి ఇంకా ఎంత మంది మోసపోయారన్నది విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఇతనిది తంబళ్లపల్లె నియోజకవర్గంలో ముసలికుంట వద్ద బండ్రేవు దగ్గరున్న షేకేనాయక్‌ తండాగా ఆధార్‌ కార్డు ద్వారా తెలుస్తోంది. ఈ విషయమై ఎంఈఓ ద్వారకనాథ్‌ను వివరణ కోరగా.. ఫేక్‌ (నకిలీ)ఐడీ కార్డుతో మోసం చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. ఇతను ఎవరో మోసగాడు.. ఎవ్వరూ నమ్మవద్దని తెలిపారు. ఇదే విషయమై ముదివేడు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ యోజన గాంధీని విచారించగా తమ స్కూల్‌లో ఈపేరుతో ఏ టీచర్‌ లేరన్నారు. మోసగించడానికి తమ స్కూల్‌ పేరు వాడుకున్నాడని వెల్లడించారు. ఇలాంటి వారిని నమ్మవద్దని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

చ‌ద‌వండి: Jobs: నిరుద్యోగులకు తీపి కబురు

Published date : 09 Sep 2023 03:06PM

Photo Stories