Indian startup: స్టార్టప్స్ విలవిల... ఆరు నెలల్లో 17 వేల మందికి ఉద్వాసన.. రానున్న రాజుల్లో మరింతమంది...
టెక్ దిగ్గజాలే నిధుల కొరతతో ఉద్యోగులను పీకిపారేస్తున్నాయి. ఇక స్టార్టప్‌లైతే ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించాయి.
ప్రధానంగా స్టార్టప్‌లను నిధుల కొరత వేధిస్తోంది. దీనికి తోడు వీటి కార్యకలాపాలూ తగ్గాయి. దీంతో తప్పనిసరిగా వ్యయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఏర్పడింది. ఫలితంగా సిబ్బందిని తగ్గించుకునేందుకు పలు స్టార్టప్‌లు ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో జనవరి-జూన్ మధ్య కాలంలో దాదాపు 70కి పైగా అంకురాలు 17,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కరోనా సమయంలో వినూత్న ఆవిష్కరణలతో వందల సంఖ్యలో స్టార్టప్‌లు ముందుకు వచ్చాయి. ఎడ్యుటెక్, ఇ-కామర్స్, ఫార్మసీ రంగాల్లో ఇది బాగా కనిపించింది. కానీ, కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ రంగాలు మందగించడం మొదలయ్యింది. బ్యాంకింగ్ ఉత్పత్తులు, బ్రోకరేజీ సంస్థలు, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్, చెల్లింపుల పరిష్కారాలు అందించే సంస్థలు, ఆహార, ఔషధ, రవాణా ఇలా అనేక రంగాల్లోని సంస్థలు తమ నిపుణులను తగ్గించుకున్నాయి.
దీంతో ప్రస్తుతానికి స్టార్టప్‌ల నుంచి రిక్రూట్‌మెంట్ పూర్తిగా నిలిచిపోయినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్స్‌లో జాయిన్ కావడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని వారు సూచిస్తున్నారు.