Yes Bank Lays Off Employees: ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాల కోత
దేశంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల కోతలు సర్వసాధారణమై పోతున్నాయి. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రకటించింది. ఫలితంగా 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
వ్యయ నియంత్రణ, సమర్థవంతమైన కార్యకలాపాల నిర్వహణ కోసం యెస్ బ్యాంక్ ఇటీవల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రకటించిన తొలగింపులతోపాటు రానున్న వారాల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత పెడుతుందని భావిస్తున్నారు.
ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. మల్టీనేషనల్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకున్న యెస్ బ్యాంక్ ఆ సంస్థ చేసిన సిఫార్సుల మేరకు తొలగింపులు చేపట్టింది. హోల్‌సేల్, రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభారం పడింది.
ఆపరేషన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు, సిబ్బంది వినియోగాన్ని మెరుగుపరుచుకోవడమే పునర్‌వ్యవస్థీకరణ లక్ష్యంగా బ్యాంక్ పేర్కొంటోంది. అయితే వ్యయ నియంత్రణలో భాగంగానే డిజిటల్ బ్యాంకింగ్ వైపు యెస్ బ్యాంక్ మరింతగా మళ్లుతోందని నివేదికలు చెబుతున్నాయి.