Mechanical Engineering Career: మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? బెస్ట్ కాలేజ్ ఎలా ఎంచుకోవాలి?
ఇంజనీరింగ్ క్లాసులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే అడ్మీషన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోర్ సబ్జెక్ట్ అయిన మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే భవిష్యత్‌లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? కళాశాల ఎంపికలో ఎలాంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి అన్న వివరాలపై సీబీఐటీ (CBIT) మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డా. పల్లెర్ల ప్రభాకర్ రెడ్డి మాటల్లోనే తెలుసుకుందాం.
కళాశాల ఎంపిక
ఉన్నతవిద్యను అభ్యసించడానికి అనువైన,అనుకూలమైనటువంటి కాలేజీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కళాశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, వనరులు, భోదన, బోధనేతర సిబ్బంది, ప్రామాణిక ప్రయోగశాలలు, ప్రముఖ సంస్థల గుర్తింపులు, అక్రిడిటేషన్లు, భోదనాపద్ధతులు, కొత్త సాంకేతిక సదుపాయాలను కల్పించడం, పరిశ్రమల అవసరాలకు అనుకూలమైనటువంటి పాఠ్యప్రణాళిక, ప్రాంగణ నియామకాలు, శిక్షణ, కౌన్సిలింగ్, ప్రొఫెషనల్ సొసైటీస్, క్లబ్స్ మొదలైన అంశాలను బేరీజు వేసుకొని కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజ్ వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా లేదా సీనియర్ విద్యార్థులను సంప్రదించి వివరాలను తెలుసుకోవచ్చు. సరైన కాలేజీ ఎంచుకుంటే స్టూడెంట్ ఎంచుకున్న వృత్తిలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది.
మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లో బోధించే అంశాలు :
మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లో బోధించే అంశాలను నాలుగు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చు.
డిజైన్ ఇంజనీరింగ్: ఏదైనా యంత్రాన్ని గాని, దాని యొక్క పరికరాలను గాని తయారు చేసేముందు వివిధములైన సాంకేతిక అంశాలను, ఉపయోగించే సమయంలో తలెత్తే సవాళ్లు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపకల్పన చేయవలసి ఉంటుంది.
మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్: రూప కల్పన చేసిన వాటి ఆధారంగా సరైన అందుబాటులో ఉన్న ఉత్పత్తి వ్యవస్థను, యంత్రాలను, ఉపకరణాలను వినియోగించుకుని ఉత్పత్తి చేయవలసి వస్తుంది.
థర్మల్ ఇంజనీరింగ్: వివిధ వినియోగాలలో ఉపయోగించే పరికరాలు, యంత్రాలు శీతోష్ణాలకు గురవుతాయి. మరి వాటిని తట్టుకొని వినియోగానికి అనువైన పనిని చేయటానికి ఉపయోగించే అంశాలను దీనిలో భాగంగా బోధించడం జరుగుతుంది.
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ : పరిశ్రమలలో ఉపయోగించే వివిధ పరికరాలు, ముడి సరుకుల ఎంపిక, ఉపయోగించడం, ఉత్పత్తిని పెంపొందించడం, ఉత్పాదకతను వృద్ధి చేయడం వంటి అంశాలను ఇక్కడ బోధిస్తారు.
వీటికి అనుసంధానంగా మరికొన్ని అదనపు అంశాలను కూడా ప్రాధాన్యతతో బోధించడం జరుగుతుంది. ఆటోమేషన్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, మెటీరియల్స్, మోడలింగ్, సిమ్యులేషన్, అనాలసిస్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ మొదలైన ఎన్నో అంశాలను బోధిస్తారు. నేర్చుకున్న అన్నింటిని క్రోడీకరించుకొని, విద్యార్ధులు మినీ ప్రాజెక్టులు, మేజర్ ప్రోజెక్టులు కూడా చేస్తారు. ఈ క్రమంలో విద్యార్ధి యొక్క నిగూఢ అవగాహన, నిశిత పరిశీలన, వినూత్న పరిష్కారాల సామర్ధ్యం, మానవాళి అవసరాలకు సరిపడే ఉత్పత్తుల రూపకల్పనం, సామాజికాభివృద్ధి దిశలో తనదైన ప్రత్యేక శైలితో పాటుపడటం సాధ్యమవుతుంది.
మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత.. అవకాశాలు ఇలా ఉంటాయి..
మెకానికల్ ఇంజనీరింగ్ అనంతరం విద్యార్థికి అవకాశాలు అపారంగా ఉంటాయి. అంటే మౌలిక అంశాలు, మెరుగైన నైపుణ్యత, మంచి నడత కలిగిన మెకానికల్ గ్రాడ్యుయేట్స్ కు అవకాశాలు వాటి అంతట అవే వస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా ఉన్నత చదువులు, పరిశోధన , ప్రాంగణ నియామకాలు, వ్యవస్థాపకత, సంస్థ స్థాపన మొదలైన అవకాశాలు మెండుగా ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ వృత్తిలో ఉంటూనే ఇంకా లోతుగా, పరిశోధనా దిశలో కొనసాగాలని ఆసక్తి ఉంటే ఏదైనా అనువైన ప్రత్యేకమైన మెకానికల్ ఉప విభాగంలో ఏదైనా ప్రామాణిక విద్యాసంస్థలలో ఉన్నత విద్య అభ్యసించవచ్చు.
అవసరమైన అనుభవము, నైపుణ్యత, నెట్వర్కింగ్ సంపాదించుకొని అంకుర సంస్థలు కూడా స్థాపించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం కూడా ఇటువంటి ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు ఉత్సాహాన్ని కల్పిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది. కోర్ ఇంజనీర్ విద్యార్దులను ప్రోత్సహించడానికి ఏఐసిటిఈ యశస్వి పేరు తో స్కాలర్షిప్ ను కూడా అందిస్తోంది. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలలో, పరిశ్రమలలో కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి.
కంప్యూటర్ ఆధారిత లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కోర్సులు - ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అదనపు అర్హతను సంపాదించి,ఆయా సంబంధిత మెళకువలను మేళవింపు గావించుకొని ఇంకామరెన్నో విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునే ఆస్కారం కూడా మెండుగా ఉంటుంది. ఇటువంటి అవకాశాలను ఇంకా విస్తృత పరుచుకోవాలంటే, కొన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క అటానమస్ గుర్తింపు ఉన్న ప్రముఖ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ తో పాటు కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రాంలలో కూడా అదనపు మైనర్ ఇంజనీరింగ్ లేదా హానర్స్ ఇంజనీరింగ్ పట్టాలను పొందే అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చు.
- డా|| పల్లెర్ల ప్రభాకర్ రెడ్డి
మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి
సీబీఐటీ, హైదరాబాద్