వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!
సాక్షి,ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్‌కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు మస్క్ ట్విటర్ ద్వారా ప్రకటించారు.
రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపులను మొదలు పెడతామని మస్క్ తెలిపారు. అయితే ధృవీకరించబడిన వినియోగదారులను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నామని మస్క్ స్పష్టం చేశారు. ఈ చెల్లింపుల నిమిత్తం సుమారు రూ. 41.2 కోట్లు (5 మిలియన్ డాలర్లు) కేటాయించినట్టు తెలిపారు. మస్క్ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్ మాదిరిగా ట్వీపుల్ కూడా తమ కంటెంట్‌లో రిప్లై సెక్షన్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు సంపాదించవచ్చు.
కాగా గత ఏడాది అక్టోబర్‌లో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి, ప్రకటనదారులనుంచి పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది ట్విటర్. మరోవైపు ట్విటర్ సీఈవోగా అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ లిండా యాకారినో పదవి చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ప్రకటనల పరిశ్రమలో ఆమెకున్న విస్తృతమైన నేపథ్యం , సరికొత్త వ్యూహాలతో భారీ ఆదాయ సమకూరనుందని అంచనా.