AP Job Mela: యువతకు ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యం
ఎమ్మిగనూరు టౌన్: చదువుకున్న యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు.
మంగళవారం పట్టణంలోని రావూస్ డిగ్రీ కళాశాలలో ఆ విద్యాసంస్థ యాజమాన్యం, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా మెగా జాబ్‌మేళా నిర్వహించాయి. ఈ మేళాను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, పార్టీ నాయకుడు ఎరర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కేఎస్ రఘుతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం యువతీ, యువకులనుద్దేశించి వారు మాట్లాడారు.
పేదల విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన తదితర పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిషు మీడియంతో పాటు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేస్తున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు.
దీంతో పాటు విద్యార్హతను బట్టి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు ఎలాంటి వృతి నైపుణ్య శిక్షణ ఇవ్వకుండా నిధులు కొల్లాగొట్టారని, ఇదే కేసులో ప్రస్తుతం జైలుకు వెళ్లారని చెప్పారు.
కాగా జాబ్‌మేళాకు హాజరైన నిరుద్యోగుల్లో 260 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికై నట్లు రావూస్ కాలేజీ కరస్పాండెంట్ తిరుమల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సీతారామయ్య, డీఆర్‌డీఏ పీడీ నాగలీల, తహసీల్దార్ ఆంజినేయులు, స్కిల్‌డెవలప్‌మెంట్ జిల్లా అధికారి శ్రీకాంత్‌రెడ్డి, వైకేపీ ఏరియాకో ఆర్డినేటర్ శ్రీనివాసులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.