Gurukulam: ఐఐటీ, జేఈఈ మెయిన్‌లో గురుకులాల రికార్డు
తాజాగా ఐఐటీ–జేఈఈ మెయిన్ పరీక్షల్లో గిరిజన గురుకులాల విద్యార్థులు గొప్ప విజయాన్ని సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి కె.శ్రీకాంత్ ప్రభాకర్ సెప్టెంబర్ 16న ఓ ప్రకటనలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఎన్ ఐటీ, ఐఐఐటీ సీట్లు పొందేలా గురుకులాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. మొత్తం 194 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షలు రాయగా 168 మంది అడ్వాన్స్ డ్ పరీక్షలకు అర్హత సాధించారని పేర్కొన్నారు. వీరిలో 9 మంది గిరిజన విద్యార్థులు 81 పర్సంటైల్, 37 మంది 71 పర్సంటైల్, 50 మంది విద్యార్థులు 60 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించారని తెలిపారు. కోవిడ్–19 ఇబ్బందుల్లోనూ ప్రత్యేకంగా ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇచ్చి నిరంతర పర్యవేక్షణతో ఈ రికార్డును సాధించారని వివరించారు.
బీసీ కళాశాలల్లో అర్హత సాధించిన 63 మంది..
మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ కళాశాలకు చెందిన 63 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ డ్ కు అర్హత సాధించినట్టు బీసీ సంక్షేమ కార్యదర్శి కృష్ణమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ కళాశాల నుంచి 120 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరుకాగా 63 మంది అడ్వాన్స్ డ్‌కు అర్హత సాధించినట్టు పేర్కొన్నారు. పి.సాయి రోహిత్ అనే విద్యార్థి 98.5 పర్సంటైల్‌తో మొదటి స్థానం, కె.వెంకటేష్ 92.6 పర్సంటైల్‌తో రెండో స్థానం, పి.దేవి 90.3 పర్సంటైల్ సాధించి మూడో స్థానంలో నిలిచారని తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులు అందరికీ ఐఐటీ అడ్వాన్స్ డ్ కోచింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు, శిక్షణ ఇచ్చిన అధ్యాపకులకు కె.శ్రీకాంత్ ప్రభాకర్, కృష్ణమోహన్ అభినందనలు తెలిపారు.
చదవండి:
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్ డ్‌కు దరఖాస్తులు ప్రారంభం... చివరి తేదీ ఇదే!