JEE Mains 2024: జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలు ఇవే..
దీని కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జేఈఈ మెయిన్స్ తొలి విడత జనవరి 25న జరిగింది.
ఫలితాలను కూడా వెల్లడించారు. ఈసారి జరిగే రెండో విడత పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది హాజరయ్యే వీలుంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జేఈఈ రెండు విడతల పరీక్షలకు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతలో అర్హత సాధించని వారితో పాటు, మంచి ర్యాంకుకు అవకాశం లేని వారు కూడా ఈ దఫా పరీక్షకు హాజరవుతున్నారు. గతంలో బీఆర్క్(బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్) పరీక్షను ముందే నిర్వహించే వారు. ఈసారి ఈ పరీక్షను ఇంజనీరింగ్ జేఈఈ తర్వాత నిర్వహిస్తున్నారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
రాష్ట్రంలోని 11 నగరాలు, పట్టణాల్లోని కేంద్రాల్లో
జేఈఈ మెయిన్స్–2 పరీక్ష ఏప్రిల్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ జరుగుతుంది. 12న మాత్రం బీఆర్క్, మిగతా రోజుల్లో ఇంజనీరింగ్ జేఈఈ మెయి న్స్ ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, రెండో షిప్ట్ సాయంత్రం 3 నుంచి 6 వరకూ పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. దేశవ్యాప్తంగా 319 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 11 నగరాలు, పట్టణాల్లోని కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
40 ప్రశ్నలకు సరైన జవాబిస్తే అర్హత: జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ పేపర్ల నుంచి 75 ప్రశ్నలిస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా ఆన్సర్ చేస్తే 1 నెగెటివ్ మార్క్ ఉంటుంది. గత పేపర్లను బట్టి చూస్తే విద్యార్థులు మొత్తంగా 40 ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వగలిగితే మెయిన్స్ అర్హత సాధిస్తారని ప్రముఖ గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. 60 ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇస్తే మంచి ర్యాంకు వస్తుందన్నారు. కొన్నేళ్లుగా మేథ్స్ పేపర్ కఠినంగానే ఉంటోందని, సుదీర్ఘ ప్రశ్నలకు జవాబు రాసేప్పుడు సమయం వృధా కాకుండా చూసుకోవాలని సూచించారు.