Skip to main content

థింకింగ్ మేనేజర్లు కావాలి

మేనేజ్‌మెంట్... ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్. సంప్రదాయ బీఏ/బీకామ్/బీఎస్సీ వంటి కోర్సుల నుంచి ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వరకూ.. డిగ్రీ పూర్తిచేసిన చాలామంది విద్యార్థుల తదుపరి లక్ష్యం.. ఎంబీఏ!
విద్యార్థుల్లో నెలకొన్న క్రేజ్‌ను, మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మేనేజ్‌మెంట్ విద్యను అందిస్తామంటూ.. బిజినెస్ స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాస్తవానికి మన మేనేజ్‌మెంట్ విద్య విధానం సరైన దిశలోనే సాగుతోందా.. మేనేజ్‌మెంట్ విద్యారంగంలో సమస్యలేంటి.. వాటికి పరిష్కారాలేంటి.. ఔత్సాహిక విద్యార్థులు అలవర్చుకోవాల్సిన లక్షణాలు ఏంటి.. తదితర అంశాలపై రాష్ట్రంలో మేనేజ్‌మెంట్ కోర్సులను అందించడంలో మంచి పేరున్న.. ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్‌ఎంటర్‌ప్రైజ్’ డెరైక్టర్ ప్రొఫెసర్ ఆర్.కె.మిశ్రాతో ఇంటర్వ్యూ..

మేనేజ్‌మెంట్ విద్య.. క్రేజ్‌కు కారణం:
లిబరలైజేషన్, ప్రైవేటేజేషన్, గ్లోబలైజేషన్,.. కారణంగా మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీల్లో అవకాశాలు మెరుగవడమే మేనేజ్‌మెంట్ విద్య పట్ల విద్యార్థుల్లో క్రేజ్ పెరగడానికి కారణం. ఆర్థిక సంస్కరణలు.. ప్రపంచం కుగ్రామంగా మారడం.. పలు విదేశీ సంస్థలు మన దేశంలో అడుగుపెట్టడంతో కంపెనీల నిర్వహణకు సుశిక్షితులైన మానవ వనరుల అవసరం పెరిగింది. దాంతో మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేస్తే జాబ్ గ్యారెంటీ అనే భావన నెలకొంది.

ఇన్‌స్టిట్యూట్‌లు.. ఆ స్థాయిలో ఉన్నాయా:
ప్రస్తుతం దేశంలోని మేనేజ్‌మెంట్ విద్యను అందించే బిజినెస్ స్కూల్స్‌ను మూడు కేటగిరీలుగా విభజించొచ్చు.
అవి..

మొదటి కేటగిరీ:
పరిశ్రమ, ప్రభుత్వం, అధ్యాపకులతో నిరంతరం అనుసంధానం కలిగినవి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్ (ఐఐఎంలు)తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపీఈ)వంటివి ఈ కేటగిరిలోకి వస్తాయి.

రెండో కేటగిరీ:
వీటిలో కేవలం ఇన్‌స్టిట్యూట్, విద్యార్థులు, అధ్యాపకుల మధ్యనే సమన్వయం ఉంటుంది. వాస్తవ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు.

మూడో కేటగిరీ:
సమాజంలోని ఏ వర్గాలతోనూ అనుసంధానం లేని ఇన్‌స్టిట్యూట్‌లు.
మన దేశంలో మూడో కేటగిరీ ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్యే అధికంగా ఉంది. మార్కెట్ డిమాండ్ దృష్ట్యా విద్యార్థులను ఆకర్షించి కేవలం లాభాపేక్షతో నెలకొల్పే ఇన్‌స్టిట్యూట్‌లు ఇవి. వీటి విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.

ఐఐఎంలతోపాటు.. స్టేట్ యూనివర్సిటీలకు కూడా:
కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్‌కు మౌలిక సదుపాయాలు, నిధులు, ఇతర విషయాల్లో అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని, ప్రోత్సాహాన్ని.. స్టేట్ యూనివర్సిటీలకు కూడా అందిస్తే బాగుంటుంది. ప్రస్తుతం అనేక స్టేట్ యూనివర్సిటీలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాయి. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఇంతకుముందు పేర్కొన్నట్లు మూడో కేటగిరీ ఇన్‌స్టిట్యూట్‌లు అధిక శాతం స్టేట్ యూనివర్సిటీల పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వాలు తోడ్పాటు అందిస్తే అవి కూడా నాణ్యమైన విద్యనందించే అవకాశం ఉంటుంది.

అవసరాలకు తగ్గట్టు సిలబస్:
వాస్తవానికి మేనేజ్‌మెంట్ కోర్సుల సిలబస్‌ను మార్కెట్ అవసరాలను.. విద్యార్థులు తాము ఎంచుకున్న స్పెషలైజేషన్లకు సంబంధించి ఆయా విభాగాల్లో రాణించే విధంగా ఎండ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి. ఉదాహరణకు బ్యాంకింగ్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. దానికి సంబంధించి సిలబస్ రూపొందించే సమయంలో బ్యాంకుల్లో సాధారణంగా తలెత్తే సమస్యలేంటి? అవసరాలేంటి? ప్రభుత్వ విధానాలేంటి? వినియోగదారులకు ఉత్తమ సేవలందించేందుకు మార్గాలేంటి?అనే అంశాలు పరిగణనలోకి తీసుకొని సిలబస్ రూపొందించాలి. కానీ ప్రస్తుత సిలబస్ ఏళ్ల నాటిదనే చెప్పాలి. దీన్ని మార్చాలి. అంతేకాకుండా.. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు, ముఖ్యంగా కొత్తగా వస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు సిలబస్ విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపకుండా... ఐఐఎంలు లేదా ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల సిలబస్‌నో కాపీ-పేస్ట్ పద్ధతిలో అందిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థి నష్టపోతున్నాడు.

ఇండస్ట్రీ రెడీ స్కిల్స్:
విద్యార్థి కోర్సు పూర్తయ్యే నాటికి ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ సొంతం చేసుకునేలా సిలబస్ రూపొందించాలి. ఈ క్రమంలో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేయాలి. విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకునేలా సిలబస్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

అధ్యాపకుల కొరత:
మన దేశంలో మేనేజ్‌మెంట్ కోర్సుల విషయంలో మరో ప్రధాన సమస్య.. అధ్యాపకుల కొరత. పీహెచ్‌డీ పూర్తి చేసిన అధ్యాపకులు సరిపడినంతగా అందుబాటులో లేరు. మనం ప్రతిష్టాత్మకంగా పేర్కొనే ఐఐఎంలలోనూ ఫ్యాకల్టీ కొరత ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో టీచర్-స్టూడెంట్ రేషియో 1:3; అదేవిధంగా లండన్ బిజినెస్ స్కూల్‌లో 1:5. కానీ మన దగ్గర మాత్రం టీచర్-స్టూడెంట్ రేషియో 1:30, 40 వరకు ఉంటోంది. ఇది అటు విద్యార్థులపైనా, ఇటు అధ్యాపకులపైనా ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా.. పలు ఇన్‌స్టిట్యూట్‌లు విజిటింగ్ ఫ్యాకల్టీపై ఆధారపడి కోర్సులు నిర్వహిస్తుండటం గమనార్హం.

ప్రధాన లోపం.. పరిశోధనల్లో వెనుకంజ:
మన దేశంలో మేనేజ్‌మెంట్ విద్యలో ప్రధాన సమస్య.. పరిశోధనలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం. ప్రతిష్టాత్మక ఐఐఎంలలోనూ ఇదే పరిస్థితి. కానీ దేశ ఆర్థిక ప్రగతి కోణంలో ఆలోచిస్తే.. పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఆ దిశగా యూజీసీ, ఏఐసీటీఈ, ఇతర నియంత్రణ సంస్థలు చర్యలు చేపట్టాలి. అప్పుడే మేనేజ్‌మెంట్ విద్యకు సార్థకత చేకూరుతుంది.

బీటెక్ టు.. మేనేజ్‌మెంట్:
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఎక్కువగా బీటెక్ విద్యార్థులు చేరుతున్నారు. ఐఐఎం వంటి బిజినెస్ స్కూల్స్ ప్రవేశానికి నిర్వహించే క్యాట్ తదితర ప్రవేశ పరీక్షల్లోనూ బీటెక్ విద్యార్థులే ముందుంటున్నారు. దీనిపై నాన్-ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆందోళన సహజమే. అయితే, నా అభిప్రాయం ప్రకారం- బీటెక్ విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడుగుపెట్టడం.. భవిష్యత్తు కోణంలో అభిలషణీయమే! కారణం.. వారు సాంకేతికంగా నిర్దిష్ట ఉత్పత్తికి సంబంధించి కాస్ట్ ఎఫెక్టివ్స్‌పై సముచిత అవగాహన కలిగుంటారు. తద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన వస్తువుల రూపకల్పన, ఉత్పత్తికి మేనేజ్‌మెంట్ విద్య దోహదం చేస్తుంది.

ఇండస్ట్రీ రెడీ కావాలంటే:
దేశంలో ప్రస్తుతం దాదాపు 1400 బి-స్కూల్స్ ఉన్నాయి. వీటి ద్వారా రెగ్యులర్, దూర విద్యావిధానంలో దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఏటా ఎంబీఏ సర్టిఫికెట్లతో జాబ్ మార్కెట్లో అడుగుపెడుతున్నారు. కానీ, వారిలో ఇండస్ట్రీ రెడీ విద్యార్థుల సంఖ్య 35 నుంచి 40 శాతం మధ్యనే ఉంటోంది. దీనికి కారణం.. ముందు చెప్పుకున్నట్లుగానే మన సిలబస్ విధానమే. ఇది అధిక శాతం రీడింగ్ దృక్పథంతో ఉంటోంది. దీంతో విద్యార్థులు పరీక్ష కోణంలో థియరాటికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యమిచ్చి, ప్రాక్టికాలిటీని పక్కన పెడుతున్నారు. కానీ విద్యార్థులు తమను తాము ఇండస్ట్రీ రెడీగా రూపొందించుకోవాలి. ఇందుకోసం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. రిపోర్ట్ రైటింగ్, టీంస్కిల్స్ వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే.. రీడింగ్ కాదు.. థింకింగ్ మేనేజర్లుగా మారాలి అనే దృక్పథం తప్పనిసరి.

కేస్ స్టడీస్ ప్రాధాన్యం:
ప్రాజెక్ట్ వర్క్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. మేనేజ్‌మెంట్ విద్యలో కేస్ స్టడీస్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. అధ్యాపకులు చెప్పకపోయినా.. కేస్ స్టడీస్ విషయంలో విద్యార్థులు సొంతంగా ప్రయత్నాలు సాగించాలి. ఇందుకోసం ఇంటర్న్‌షిప్స్ చేయాలి. లేదా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్‌లలో పాల్పంచుకోవాలి. ఆ సమయంలో ఒక నిర్దిష్ట సమస్యను గుర్తించి దానికి పరిష్కార మార్గాలతో నివేదిక రూపొందించి దాన్ని కేస్‌స్టడీ అనాలిసిస్‌గా మలచుకోవాలి. ప్రతి మేనేజ్‌మెంట్ విద్యార్థి చేయాల్సిన తప్పనిసరి విధి కేస్ స్టడీస్ అనాలిసిస్‌పై అవగాహన పొందడం.

ఏ స్పెషలైజేషన్.. ఎవరికి:
ఎంబీఏలో చేరిన ప్రతి విద్యార్థికి ఎదురయ్యే ప్రశ్న.. తనకు సరిపడే స్పెషలైజేషన్ ఏది? అనేదే. ఇంటర్-పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటే.. మార్కెటింగ్ స్పెషలైజేషన్; న్యూమరిక్స్‌లో ముందంజలో ఉంటే.. ఫైనాన్స్; లిజనింగ్ స్కిల్స్ ఉంటే.. హెచ్‌ఆర్. టెక్నికల్ స్కిల్స్ ఉంటే.. ఐటీ లేదా ప్రొడక్షన్ లేదా ఆపరేషన్స్ రీసెర్చ్ స్పెషలైజేషన్స్ ఎంచుకోవాలి.

మహిళల సంఖ్య తక్కువ.. కారణం:
మేనేజ్‌మెంట్ విద్యలో మన దేశంలో మహిళల సంఖ్య చాలా తక్కువ. మొత్తం మేనేజ్‌మెంట్ విద్యార్థుల్లో మహిళల శాతం రెండు నుంచి అయిదు శాతం మాత్రమే. అదే యూరప్ దేశాల్లో 30 శాతం వరకు ఉంటుంది. ఇందుకు మన దేశంలోని ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొంతవరకు కారణం. విదేశాల్లో మహిళా విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తారు. ఇలాంటి విధానాలను మన దేశంలోనూ అనుసరించాలి.

ప్రస్తుత సంవత్సరం.. ప్లేస్‌మెంట్స్ పరిస్థితి:
ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్ కొంత తిరోగమనంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం జీడీపీ తగ్గుదలని చెప్పొచ్చు. అయినప్పటికీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో 65 నుంచి 70 శాతం విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ అందుకున్నారు. ఎంబీఏ విద్యార్థులకు ఒకటే సలహా... క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ రాలేదని నిరుత్సాహ పడకుండా ఉన్నత విద్యవైపు అడుగులు వేయాలి. ఉద్యోగం తప్పనిసరైన విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్స్ అలూమ్నీలు, ఇంటర్నెట్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్ సహాయంతో ఉద్యోగాన్వేషణ సాగించాలి.

కొత్త కోర్సుల విషయంలో:
మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పలు బి-స్కూల్స్.. కొత్త కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. (ఉదా: హాస్పిటల్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, రిటైల్ మేనేజ్‌మెంట్ తదితర). ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు ముందుగా కొంత పరిశోధన చేయాలి. ఆయా కోర్సులకు భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాటిని అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల ప్రామాణికత ఏ పాటిది? అన్నిటికంటే ముఖ్యంగా తాను చేరదలచుకున్న కోర్సు.. వృత్తిపరంగా అవసరమైన సహజ లక్షణాలు తనలో ఉన్నాయో లేదో పరిశీలించి అడుగుపెట్టాలి. కారణం.. కొన్ని కోర్సులకు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తిగత లక్షణాలు కావాలి. ఉదాహరణకు హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ కోర్సు ఔత్సాహికులకు కేవలం మేనేజ్‌మెంట్ లక్షణాలే కాకుండా.. సేవా దృక్పథం ఉంటే మరింత రాణించగలరు.

విద్యార్థులకు సలహా:
మేనేజ్‌మెంట్ విద్యలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు.. ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టితో, కొత్త కోణంలో ఆలోచించే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. How to Become the Best అని నిరంతరం స్వయంగా ప్రశ్నించుకోవాలి. అలాంటి లక్షణాలు పెంచుకుంటే హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివిన విద్యార్థికి.. హైదరాబాద్‌లోని సాధారణ బి-స్కూల్‌లో చదివిన విద్యార్థికి పెద్దగా తేడా ఉండదు.
ఆల్ ది బెస్ట్!!
Published date : 13 Jun 2013 07:43PM

Photo Stories