ఉజ్వల భవితకు మార్గం.. సీఏతో సాధ్యం!
మూడు దశలు....
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) సీఏ కోర్సును మొత్తం మూడు దశలుగా నిర్వహిస్తోంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్, ఫైనల్.
ఫౌండేషన్ కోర్సు..
సీఏ కోర్సులోని మొదటి దశ ఫౌండేషన్ కోర్సు. ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ చదివిన విద్యార్థులైనా ఈ ఫౌండేషన్ కోర్సుకు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత నాలుగు నెలలకు ఫౌండేషన్ పరీక్షకు హాజరవ్వొచ్చు. సీఏ ఫౌండేషన్ పరీక్ష నాలుగు పేపర్లుగా.. ఒక్కో పేపర్‌కు వంద మార్కులు చొప్పున మొత్తం 400 మార్కులకు ఉంటుంది. వీటిలో పేపర్–1, పేపర్–2 పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో.. పేపర్–3, పేపర్–4 పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. విద్యార్థులు ప్రతి పేపర్(సబ్జెక్ట్)లో 40 శాతం మార్కులతో.. అన్ని పేపర్లలో కలిపి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే తదుపరి దశ ఇంటర్మీడియెట్‌కు అర్హత లభిస్తుంది. ప్రతి ఏటా రెండుసార్లు(మే, నవంబర్) సీఏ ఫౌండేషన్ పరీక్షను నిర్వహిస్తారు. నవంబర్‌లో పరీక్షకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు జూన్ 30లోపు నమోదు చేసుకోవాలి. ఈ ఏడాది కరోనా కారణంగా నవంబర్ పరీక్షకు రిజిస్ట్రేషన్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు.
రెండో దశ.. ఇంటర్మీడియెట్
ïసీఏ ఇంటర్మీడియెట్‌లో రెండు గ్రూప్‌లుగా పరీక్ష ఉంటుంది. గ్రూప్–1లో నాలుగు పేపర్లు, గ్రూప్–2లో మరో నాలుగు పేపర్లు మొత్తం ఎనిమిది పేపర్లలో 800 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఒక్కో పేపర్‌లో 40 శాతం మార్కులు.. మొత్తం అన్ని పేపర్లలో కలిపి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత సీఏ కోర్సులోని చివరి దశ ఫైనల్‌కు అర్హత లభిస్తుంది. ఒకేసారి రెండు గ్రూప్‌లు లేదా గ్రూప్–1, గ్రూప్–2లకు వేర్వేరుగా హాజరుకావొచ్చు. ఏటా రెండుసార్లు(మే, నవంబర్) సీఏ ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహిస్తారు.
ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి..
సీఏ ఇంటర్మీడియెట్‌లో రెండు గ్రూప్‌ల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. సీఏ కోర్సులోని చివరి దశ ఫైనల్‌కు నమోదు చేసుకోవాలంటే.. ఆర్టికల్‌షిప్‌గా పేర్కొనే ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకోవాలి. మొత్తం మూడేళ్ల వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. రెండున్నరేళ్లు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే.. సీఏ ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఫైనల్‌లో ఎలక్టివ్ పేపర్..
సీఏ ఫైనల్ కూడా రెండు గ్రూప్‌లుగా(గ్రూప్–1, గ్రూప్–2) ఉంటుంది. ఒక్కో గ్రూప్‌లో నాలుగు సబ్జెక్ట్‌లు చొప్పున రెండు గ్రూప్‌లకు కలిపి ఎనిమిది పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు వంద మార్కులు చొప్పున మొత్తం ఎనిమిది వందల మార్కులకు పరీక్షలు జరుగుతాయి. రెండు గ్రూప్‌ల పరీక్షల్లో ఒక్కో పేపర్‌లో 40 శాతం మార్కులతో మొత్తం ఎనిమిది పేపర్లలో కలిపి 50 శాతం మార్కులు సాధించాలి. సీఏ ఫైనల్ పేపర్లలో మరో ముఖ్యమైన అంశం.. గ్రూప్–2లోని ఆరో పేపర్‌ను ఎలక్టివ్ పేపర్‌గా నిర్ణయించారు. ఎలక్టివ్ పేపర్ విధానంలో అభ్యర్థులకు ఆరు సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌ను ఎలక్టివ్ పేపర్‌గా ఎంచుకొని మెరుగైన మార్కులు పొందే వీలుంది. ఫైనల్ పరీక్షను ఏటా రెండుసార్లు (మే, నవంబర్ నెలల్లో) నిర్వహిస్తారు.
కెరీర్ అవకాశాలు..
సీఏ మూడు దశలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కార్పొరేట్ సంస్థల్లో చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్స్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ, ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటార్స్, టెక్నో ఫంక్షనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ట్రస్టీ, అడ్మినిస్ట్రేటర్, వాల్యుయర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్‌లుగానూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా స్వయం ఉపాధి మార్గంలో ప్రాక్టీసింగ్ సీఏగా రాణించొచ్చు.
ఏకాగ్రత, సంకల్పం..
ఏకాగ్రత, సంకల్పం బలంగా ఉంటే సీఏ కోర్సులో విజయం సాధించడం సులువే. ఇంటర్‌లో ఎంపీసీ చదివి నిట్‌లో సీటు వచ్చినా..సీఏపై ఆసక్తితో మాస్టర్‌మైండ్స్‌లో చేరాను. కష్టపడి చదివి సీఏ ఫౌండేషన్‌లో 344 మార్కులతో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. ఐసీఏఐ మెటీరియల్, ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్‌ను ఆసాంతం చదివాను. కష్టమైన సబ్జెక్ట్‌ల విషయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇచ్చాను.
– కె. సాయి శ్రీకర్, సీఏ ఫౌండేషన్ రెండో ర్యాంకు.
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు రాణించగలరు..
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు కష్టపడే తత్వం ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లతో పోల్చితే సీఏలోని కామర్స్, ఎకనామిక్స్ వంటి సబ్జెక్ట్‌లు కొంత సులువుగానే ఉంటాయి. కాబట్టి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు సులభంగానే రాణించగలరు. ఇంజనీరింగ్, మెడిసిన్ ఫీజులతో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చుతో సీఏ కోర్సును పూర్తి చేసుకోవచ్చు. సీఏ పూర్తి చేసుకున్న వారు కార్పొరేట్ సంస్థల్లో కొలువులతోపాటు బోధన వృత్తిలోనూ స్థిరపడే అవకాశముంది.
– ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, మాస్టర్‌మైండ్స్