Skip to main content

ఇన్‌స్టిట్యూట్‌ల ఎంపికలో జాగ్రత్త

‘భారతదేశంలో ఉన్నత విద్య అవకాశాల్లో వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తే, భవిష్యత్తులో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని స్లోఆన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్, ఎంఐటీ-ఇండియా ప్రోగ్రామ్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.పి. కొఠారి సూచిస్తున్నారు. బిట్స్ పిలానీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్, ఐఐఎం-ఎ నుంచి మేనేజ్‌మెంట్ పీజీ, యూనివర్సిటీ ఆఫ్ లోవా నుంచి పీహెచ్‌డీ పూర్తిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్, హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీల వంటి విశ్వవిద్యాలయాల్లో ఎకనామిక్స్, అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో బోధన రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గడించిన ఆయనతో గెస్ట్ కాలమ్...
ఉన్నత విద్య పరంగా, భారతదేశంలో అందరికీ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి. ఐఐఎంలు, ఐఐటీలు ఏర్పడి ఎన్నో సంవత్సరాలైనా.. ఇప్పటికీ అవి కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలమనే భావన ఉంది. ఆయా విశ్వవిద్యాలయాల్లో వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యూనివర్సిటీలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటం లేదు. ముఖ్యంగా.. మహిళల నమోదు పెంచేలా తీసుకునే చర్యలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి.

మార్పు అనివార్యం
విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళల ప్రాధాన్యం పెంపు విషయంలో తల్లిదండ్రుల దృక్పథంలో మార్పురావాలి. తల్లిదండ్రుల్లో పాతుకుపోయిన సంప్రదాయ ఆలోచనా దృక్పథం వల్ల.. విధానపరంగా మహిళల సంఖ్య పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నా, అమల్లో సాధ్యం కావట్లేదు. ఈ కారణంగా ఉన్నత విద్యలో మహిళలు అడుగుపెట్టలేకపోతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు అనివార్యంగా మారింది.

పరిశోధనా దృక్పథం పెంపునకు కృషి
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలోపెట్టుకుంటే.. బిజినెస్ విద్యలో పరిశోధనా దృక్పథానికి ప్రాధాన్యత పెరగాలి. అన్ని విభాగాల్లో పరిశోధనా కార్యకలాపాలు పెరిగేలా చర్యలు చేపట్టాలి. వాస్తవికతకు అనుగుణంగా సమస్యలు ఏర్పడినప్పుడు పరిష్కారాలు కనుగొనడమే ఈ పరిశోధనల లక్ష్యం. ఇలా వాస్తవ పరిస్థితులపై అవగాహన ద్వారా ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుక్కోవచ్చు. దీంతో అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.

అంతర్జాతీయ పరిస్థితుల అవగాహన
విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడే పరిస్థితులపై అవగాహన ఉండటం అనివార్యంగా మారింది. కేవలం ఉద్యోగ సంపాదనే లక్ష్యంగా కాకుండా అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ విషయంలో ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో చర్యలు తీసుకోవడం అభిలషణీయం.

ఎంఐటీ-ఇండియా ప్రోగ్రామ్ ఉద్దేశం
భారతదేశంతోపాటు వివిధ దేశాల్లో అమలు చేసేలా ఎంఐటీ-ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనీషియేటివ్స్ (ఎంఐఎస్‌టీఐ) పేరుతో ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. భారతదేశంలో ఎంఐటీ ఇండియాగా పిలుస్తున్నారు. ఈ ప్రోగ్రాం ప్రకారం భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థలు, కార్పొరేట్స్‌తో ఎంఐటీలోని విద్యార్థులు కొంతకాలం కలిసి పనిచేయాలి. ఈ ప్రోగ్రాం ద్వారా తమ దేశంలోని సంస్థల్లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసే సదుపాయం కల్పిస్తున్నాం. విద్యార్థులు నిర్ణీత అర్హత నిబంధనలను పాటిస్తూ ఎంఐఎస్‌ఐటీ వెబ్‌సైట్ (misti.mit.edu)లో తమ పేరు నమోదు చేసుకోవాలి. దీంతో అంతర్జాతీయ పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన ఏర్పడే అవకాశం లభిస్తుంది. మూక్స్ విధానం కూడా విద్యార్థులకు మేలు చేకూర్చుతుంది. దీంతో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రొఫెసర్ల లెక్చర్లు వినటంతోపాటు సర్టిఫికెట్లు పొందే అవకాశం కూడా లభిస్తుంది.

అర్హతల బేరీజు
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు ఆలోచించి ముందడుగు వేయాలి. తాము ఎంపిక చేసుకున్న కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌లకు తమ అర్హతలు సరితూగుతాయో లేదో బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాతే ఇన్‌స్టిట్యూట్‌లను ఎంపిక చేసుకొని దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి.
Published date : 08 Apr 2016 04:22PM

Photo Stories