Skip to main content

స్కిల్స్ ఉంటే... ఛాన్స్ మీదే!.. కిర ణ్మయి దత్, నోవా సొల్యూషన్స్, వైస్ ఛెర్మన్

ఒక కంపెనీ నిర్వహణలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్‌ఎం) విభాగం పాత్ర కీలకం..ముఖ్యంగా ఐటీ రంగంలో నాణ్యమైన మానవ వనరులే మీదే ఆ సంస్థల గమ్యం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు..గత దశాబ్ద కాలంగా,హైదరాబాద్ ఐటీ హబ్ ఇతర నగరాలతో పోటీ పడి ఎదగడానికి స్కిల్డ్ మ్యాన్‌పవర్ కూడా ఒక కారణం. ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం, అవసరాలకనుగుణంగా శిక్షణ ఇవ్వడం ద్వారానే వ్యక్తుల నైపుణ్యాలు ఉపయోగంలోకి వస్తాయంటున్నారు డాక్టర్ పెండ్యాల కిరణ్మయి దత్.. ప్రస్తుతం ఆమె నోవా సొల్యూషన్స్ వైస్‌ ఛెర్మన్ గా, ప్రముఖ మల్టి నేషనల్ సంస్థ అడ్వాన్స్‌డ్ మైక్రో డివెసైస్ (ఏఎండీ) హెచ్.ఆర్. విభాగ అధిపతిగా వ్యవహ రిస్తున్నారు.. నేడు ప్రతి గ్రాడ్యుయేట్ కలగా ఉన్న కార్పొరేట్ జాబ్ సాధించే క్రమంలో పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు, జాబ్ మార్కెట్ తదితర అంశాలపై కిర ణ్మయి దత్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...

హెచ్‌ఆర్ చాలా కీలకం:
ఒక కంపెనీ/సంస్థ నిర్వహణలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్‌ఎం) విభాగం పాత్ర కీలకంగా ఉంటుంది. చాలా మందికి ఈ విభాగం గురించి సరైన అవగాహన లేకపోడంతో పే-షీట్‌లను రూపొందించడం, ఆర్ధిక అంశాలను పర్యవేక్షించడం వరకే ఈ రంగం పరిమితం అనుకుంటారు. కానీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం, వారి పనితీరును అంచనా వేయడం, అవసరమైన అంశాల్లో శిక్షణనివ్వడం, మెర్జర్స్-ఎక్విజిషన్స్, సంస్థ పని తీరు మెరుగుపరచడం కోసం వ్యూహాలు రూపొందించడం వంటివి కూడా హెచ్‌ఆర్‌ఎం విధుల్లో భాగంగా ఉంటాయి. కాబట్టి కార్పొరేట్ రంగంలో హెచ్‌ఆర్‌ఎం చాలా కీలకం. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల ప్రారంభానికి సన్నాహాకాలు జరుగుతున్న సమయంలో..సిబ్బంది నియామక ప్రక్రియను మొదలు పెట్టాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే..కంపెనీ అవసరాలకనుగుణంగా నైపుణ్యం ఉన్న వారి సంఖ్య 30 శాతం మించలేదు. దీంతో అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఎటువంటి జీతభత్యాలు లేకుండా జాబ్ మార్కెట్‌కనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి 16 వారాలపాటు ఉచితంగా శిక్షణ ఇస్తాం అని ప్రకటించాం. మంచి స్పందన రావటంతో శిక్షణ ప్రారంభించాం. అంచనాలకు భిన్నంగా 8 వారాల్లోనే శిక్షణను పూర్తి చేశాం. నైపుణ్యాలు లేని కారణంగా ఎవర్నైతే అనర్హులుగా భావించారో వారిలో 90 శాతం మంది ఉద్యోగాలను సాధించారు. ఆ విజయం హెచ్‌ఆర్‌ఎం విభాగంపై ఉన్న అపోహలను దూరం చేసింది.. .

ప్రతిభను ఎలా గుర్తిస్తారు?
ఉద్యోగిని నియమించుకునే ముందు ఎన్నో అంశాలను పరిశీలిస్తాం. ముందుగా సంస్థ అవసరాలకనుగుణంగా తగిన నైపుణ్యాలు అతనిలో ఉన్నాయో లేవా అనే అంశాన్ని పరిశీలిస్తాం. ఇందుకోసం ‘బిల్ట్, బై, బారో’ విధానాన్ని అనుసరిస్తాం. కేవలం నైపుణ్యాలే కాదు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం కూడా ముఖ్యమే. ఈ తరహా లక్షణాలు ఉన్న వారిని ఎంపిక చేసుకోవడానికి వెనుకాడం.. .

కొనసాగేలా చూడటం కూడా మరో సవాలు!
కంపెనీ అవసరాలకు తగినట్లు నైపుణ్యం ఉన్నవారిని ఎంపిక చేయడం ఒకటైతే..ఉద్యోగులు అదే సంస్థలో కొనసాగేలా చూడటం కూడా మరో సవాలుగా నిలుస్తుంది. ఇందుకోసం కంపెనీలు పలు విధానాలు అనుసరిస్తున్నాయి. చేస్తున్న ఉద్యోగం, హోదాను బట్టి ఈ విధానాలు మారుతుంటాయి. మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అత్యధిక వేతనాలు అందించడం, ప్రతిభ ఆధారంగా ప్రోత్సాహాకాలు వంటి విధానాలను కొన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు సీనియర్ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును కల్పిస్తుంటే.. కొన్ని సంస్థలు ఉద్యోగుల వ్యక్తిగత పనులను నిర్వర్తించేందుకు సహాయకులను కూడా నియమిస్తున్నాయి. మొత్తం మీద కంపెనీలో పని చేసే ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తిస్తున్నామనే భావనను కలుగజేస్తున్నాయి. . .

తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు:
ఉద్యోగ నియామాకాలకు సంబంధించి టెక్నికల్, మేనేజ్‌మెంట్ విభాగాలకు వేర్వేరు విధానాలను అనుసరిస్తాం. టెక్నాలజీ నాలెడ్జ్ అనేది కేవలం ఇంటర్వ్యూ దశ వరకూ చేర్చే హాల్‌టికెట్ వంటిదే. ఈ విధానంలో నైపుణ్యాలే కీలకం. సాఫ్ట్ స్కిల్స్, బృందంగా పని చేసే నైపుణ్యం, నేర్చుకునే ఉత్సాహం, జిజ్ఞాస, శ్రద్ధ వంటి ప్రాథమిక లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే కంపెనీల్లో పలు విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నిటి కంటే ముఖ్యంగా నేర్చుకునేందుకు సదా సిద్ధంగా ఉండే వారికి మొదటి ప్రాధాన్యం లభిస్తుంది.. .

హైరింగ్ అండ్ ఫైరింగ్ ఏది సరైన విధానం?
ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ఎంత పెద్ద మల్టి నేషనల్ కంపెనీ అయినా ఉద్యోగానికి గ్యారంటీ ఇవ్వదు. ఆదే సమయంలో ఉద్యోగి కూడా ఆ సంస్థలోనే ఎప్పుడూ పని చేస్తాడని ఆశించలేం. రెండు వైపులా సమస్య ఉంది. వ్యాపార దృక్కోణంలో ఆలోచిస్తే సంస్థలు తమ వ్యయం పెరిగినపుడు ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తాయి. అందుకోసం ఉద్యోగులను తగ్గించుకునే మార్గాన్ని అనుసరిస్తాయి. అంతేకాకుండా చేసే పనిలో నాణ్యత లోపించిండంతో ప్రతి ఏటా సంస్థలు 10శాతం ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఒకటి మాత్రం స్పష్టం ఆర్థికంగా, ఇతర ఇబ్బందులు ఎదురైనపుడు మినహా సంస్థలు ఉద్యోగులను తీసేయట్లేదు. తిరిగి పరిస్థితులు చక్కబడ్డాక తీసుకునే విధానం (రీహైరింగ్ కల్చర్) కూడా పెరుగుతోందనే విషయాన్ని కూడా గమనించాలి.. .

కంపెనీల్లో ఎలాంటి వర్క్‌కల్చర్ ఉండాలి?
స్వేచ్ఛగా తన పని తాను చేసుకుపోయేందుకు అనువైన వాతావరణం ఉంటే దాన్ని ఆదర్శవంతమైన సంస్కృతిగా భావించొచ్చు. అదే సమయంలో ఉద్యోగి కూడా తన బాధ్యతను విస్మరించకూడదు. ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సంస్థ రహస్యాలను బయటకు చేరవేయడం వంటి అంశాల జోలికి పోకుండా విలువలకు కట్టుబడి ఉండాలి. అంతేకాకుండా ఇన్ని గంటలు అనే నిబంధన లేకుండా అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేసే స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడిప్పుడే మన దేశంలో ఈ విధానం ఆచరణలోకి వస్తుంది. మన ఇంటి వాతావరణం ఈ తరహా విధానానికి అనుగుణంగా ఉండదు...

ప్రస్తుతం జాబ్ మార్కెట్ ట్రెండ్స్.
గతంతో పోల్చితే ప్రస్తుతం జాబ్ మార్కెట్ అంత ఆశాజనకంగా లేదని చెప్పొచ్చు. జాబ్ మార్కెట్‌లో సప్లయి పెరిగింది. డిమాండ్ తగ్గలేదు. రాజకీయం, ఆర్థిక రంగాల్లోని పరిస్థితుల కారణంగా ఉద్యోగవకాశాల్లోనూ స్తబ్ధత నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. యూరప్‌లో ఆశావాహ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అమెరికా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ..

ఏయే రంగాల్లో?
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిటైల్, ఫార్మా, ఎడ్యుకేషన్ రంగాల్లో హైరింగ్ ఆశాజనకంగా ఉంది. ఇందులో ఫార్మా రంగం ఎవర్‌గ్రీన్ అనే చెప్పాలి. ఐటీ రంగం మాత్రం అనుకున్నతంగా అవకాశాలను కల్పించడం లేదని చెప్పొచ్చు. వచ్చే ఏడాదికి పరిస్థితులు మెరుగుపడొచ్చు...

దేశంలో వర్క్‌ఫోర్స్‌లో మహిళల కంట్రిబ్యూషన్?
సామాజికంగా కొన్ని పరిస్థితులు ఇప్పటికీ మగువల ఎదుగుదలకు ఆటంకంగానే ఉన్నాయని భావించవచ్చు. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లోనూ భిన్నరంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మహిళలు చాలా ముందడుగు వేశారు. అండగా నిలిచి, అనుకూల వాతావరణం కల్పిస్తే అతివలూ అన్నిరంగాల్లోనూ రాణించగలరు. పెళ్లి, పిల్లలు ఇవన్నీ కూడా ఉద్యోగంపై ప్రభావం చూపే అంశాలే. ఉద్యోగం ఇస్తే దూర ప్రాంతాల్లో చేయగ ల్గుతారా? పిల్లలు ఉన్నత చదువులకు చేరే వరకు ఉద్యోగంలో కొనసాగుతారా? వంటి ప్రశ్నలను ఇంటర్వ్యూల్లో మహిళలను ఇప్పటికీ అడుగుతుంటారు. చూడడానికి ఇవి చాలా చిన్నవిగా కనిపించొచ్చు. కానీ ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ..

మహిళలు తమ కెరీర్‌లో పైకి ఎదగడానికి ఏం చేయాలి?
ఉన్నత విద్యనభ్యసించి కెరీర్ పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ.. చిన్న చిన్న అంశాలే వారి ఎదుగుదలకు ఆటంకంగా మారుతున్నాయి. పరిపక్వత లేకపోవడంతో చిన్న విషయాలకే భావోద్వేగానికి గురై ఉద్యోగానికి రాజీనామా చేసేందుకూ కూడా సిద్ధపడుతున్నారు. ఒక మహిళ తన మేనేజర్/బాస్ పురుషుడైనపుడు తన ఇబ్బందులు చెప్పేందుకు బిడియపడుతుంది. ఇవన్నీ అమ్మాయిలు పెరిగిన వాతావరణం కారణంగా సహజంగా వచ్చే లక్షణాలు. వీటిని అధిగమించేలా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించాలి...

మీ సలహా?
అకడమిక్ పరంగా మంచి స్కోరు ఉన్నా ఇంటర్వ్యూ దశను దాటలేదంటే సబ్జెక్టుపై పట్టు లేదనే అర్ధం. రెజ్యూమెలో ఫలానా సబ్జెక్ట్ ఇష్టం అని పేర్కొంటారు. దాన్నుంచి ప్రశ్నలడిగితే 99 శాతం మంది అభ్యర్థులు తెల్లమొహం వేస్తారు. ప్రస్తుతం అవకాశాలు బోలెడు ఉన్నాయి. కానీ కంపెనీలు ఆశించే నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్స్ అందుబాటులో లేరు. అదే సమయంలో కాలేజీల్లోనూ సరైన ఫ్యాకల్టీ కరవయ్యారు. దీంతో విద్యార్థుల దృష్టంతా ఉత్తీర్ణత సాధించటం, మార్క్స్ స్కోరు చేయటంపైనే ఉంటోంది. చదువుకున్న సబ్జెక్ట్‌లో ప్రాథమిక అంశాలపై పట్టు ఉంటే అదనంగా కోర్సులు చేయాల్సిన అవసరం కూడా లేదు. చదివిన సబ్జెక్టును ఎలా అన్వయం చేసుకోవాలి అనే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఉద్యోగం రాగానే అంతా సాధించామనే ధోరణి మంచిది కాదు. ఇలా చేస్త్తే కెరీర్ ఆగిపోయినట్లే. ఎప్పూడు పాజిటివ్ అటిట్యూడ్ కలిగి ఉండాలి. ఎలాంటి సందేహం లేకుండా కెరీర్ పట్ల స్పష్టత ఉన్నపుడే కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థితికి చేరుకోగలరు.
Published date : 27 Aug 2013 04:28PM

Photo Stories