Skip to main content

సీటు సంపాదించడం కాదు.. స్కిల్స్ అలవర్చుకోవడం ముఖ్యం!!

934 కళాశాలలు.. లక్షకు పైగా సీట్లు.. రాష్ట్రంలో ఎంబీఏ కళాశాలలు, సీట్ల వాస్తవ పరిస్థితి. మరోవైపు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌లో ఉత్తీర్ణుల సంఖ్య లక్షా ఇరవై వేలకు పైమాటే! అంచనా ప్రకారం- ఐసెట్ ఉత్తీర్ణుల్లో 60 నుంచి 70 శాతం వరకు ఎంబీఏ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ గణాంకాలను, అంచనాలను గమనిస్తే.. ఐసెట్ ఉత్తీర్ణతతో ఎంబీఏలో చేరాలనుకునే ప్రతి ఒక్క విద్యార్థికి సీటు ఖాయం. కానీ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ’సీటు సాధించడంతోనే లక్ష్యం నెరవేరినట్లు కాదని.. సంస్థలు కోరుకునే ‘స్కిల్స్ పెంచుకునేలా’ కోర్సును అభ్యసిస్తేనే సార్థకత అంటున్నారు.. ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ అజిత్ రగ్నేకర్. ఐసెట్ కౌన్సెలింగ్ ద్వారా వేల మంది విద్యార్థులు త్వరలో ఎంబీఏలో చేరనున్న నేపథ్యంలో.. బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు, కెరీర్ పరంగా అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలపై అజిత్ రగ్నేకర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...

నవతరం నాయకులు కావాలి:
వేగంగా మారుతున్న వ్యాపార, వాణిజ్య పరిస్థితులు.. పెరుగుతున్న పోటీ.. టెక్నాలజీ పరంగా నిరంతర మార్పు.. సంస్థల శక్తి సామర్థ్యాలు వంటి కారణాలతో.. సమర్థవంతమైన వ్యాపార నిర్వహణ కోసం నవతరం నాయకులు ఎంతో అవసరం. సంస్థను అభివృద్ధిబాటలో నడిపించగలిగే మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల కోసం కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. ఔత్సాహిక ఎంబీఏ విద్యార్థులు వీటన్నిటినీ దృష్టిలోపెట్టుకుని.. భవిష్యత్తులో రాణించే విధంగా.. ఈ రెండేళ్లలో సరిపడా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి.

కాలేజీ ఎంపికలో ఇలా:
ప్రస్తుతం చాలామంది విద్యార్థులు కాలేజీ ఎంపిక విషయంలో ఆయా సంస్థలు నిర్వహించిన సర్వేలు, ర్యాంకింగ్‌లపై ఆధారపడుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. ర్యాంకింగ్ కంటే అందుకోసం అనుసరించిన విధానం(మెథడాలజీ).. ఆ సర్వే నిర్వహించిన సంస్థ విశ్వసనీయత ఏపాటిదనే విషయాలు గమనించాలి. నా అభిప్రాయం ప్రకారం- ఒక కాలేజీలో చేరాలనుకుంటున్న విద్యార్థి సదరు కళాశాలను స్వయంగా పరిశీలించడం మంచిది. అక్కడి మౌలిక వసతులు, ప్లేస్‌మెంట్ తదితర అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటే.. ఆయా కళాశాల ప్రామాణికతపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.

కోర్సులో చేరాక...:
ఎంబీఏ ఔత్సాహికులు కనీసం కొంతకాలం పని అనుభవం గడించాక.. మేనేజ్‌మెంట్ కోర్సులో చేరడం అభిలషణీయమనేది నా అభిప్రాయం. దీనివల్ల ఒక విద్యార్థి అప్పటికే ఉద్యోగ అనుభవంతో నేర్చుకున్న అంశాలను క్లాస్ రూం పరిజ్ఞానానికి అనుసంధానం చేసుకుని.. అకడెమిక్‌గా మరింత మెరుగైన ప్రతిభ చూపగలడు. కోర్సులో చేరిన తర్వాత విద్యార్థులు కేవలం అధ్యాపకులు బోధించే అంశాలతో క్లాస్ రూం లెర్నింగ్‌కే పరిమితం కాకూడదు. దీనికి అదనంగా సహచరులతో గ్రూప్ డిస్కషన్స్, కేస్ స్టడీస్ అనాలిసిస్, గ్రూప్ ప్రాజెక్ట్స్, ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టడం వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. అప్పుడు అన్నికోణాల్లో నైపుణ్యం సొంతమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐఎస్‌బీలో టీచింగ్ విషయంలో సమ్మిళిత సంస్కృతి (మిక్స్‌డ్ కల్చర్) విధానాన్ని అమలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగానే.. వార్టన్ స్కూల్, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, లండన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌ల ఫ్యాకల్టీ సహకారంతో కరిక్యులంను కూడా విభిన్నంగా రూపొందించడం జరిగింది.

కేస్ స్టడీస్ కీలకం:
మేనేజ్‌మెంట్ విద్యార్థుల విషయంలో అత్యంత కీలక అంశం.. కేస్ స్టడీస్, వాటి విశ్లేషణ. సాధారణంగా ఆయా రంగాల్లో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కార సూచనలతో ఈ కేస్ స్టడీస్ విశ్లేషణ సాగుతుంది. వీటిని ఔపోసన పడితే విద్యార్థులకు రియల్ టైం నాలెడ్జ్ సొంతమవుతుంది. ఈ క్రమంలో.. అకడెమిక్ స్థాయిలోనే కేస్ స్టడీస్‌కు, ముఖ్యంగా రియల్ టైం కేస్ స్టడీస్ అనాలిసిస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సదరు సమస్యకు అప్పటికే కనుగొన్న పరిష్కారం ఆధారంగా కేవలం కేస్ స్టడీ రీడింగ్‌కు పరిమితం కాకుండా.. సొంతంగా పరిష్కార మార్గాలు అన్వేషించేలా కసరత్తు చేయాలి. ఈ విషయంలోనూ గ్రూప్ డిస్కషన్స్, ఫ్యాకల్టీ ఇంటరాక్షన్, జర్నల్స్ అధ్యయనం సాధనాలుగా వినియోగించుకోవాలి. ఫలితంగా ఒక సమస్యకు విభిన్న పరిష్కార మార్గాలు లభించడంతోపాటు అన్నింటిలోకి అన్నివిధాలా అనుకూలమైన మార్గం ఏంటి? అనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది. ఎంబీఏలో చేరే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఇది.

అధ్యాపకుల కొరత:
విద్యార్థులు, కంపెనీల అవసరాలకు సరిపడా స్కిల్స్ అందిపుచ్చుకునే విషయంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం. కానీ, ప్రస్తుతం మన దేశంలోని అధిక శాతం బిజినెస్ స్కూల్స్‌లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. మేనేజ్‌మెంట్ స్థాయిలో టీచింగ్ ప్రొఫెషన్ వైభవాన్ని కోల్పోతోంది. దీనికి ప్రధాన కారణం.. గత కొన్నేళ్లుగా రీసెర్చ్, అకడెమిక్స్ వైపు లా విద్యా సంస్థలు, ఇతర వర్గాల నుంచి ప్రోత్సాహం లభించకపోవడమే. స్పష్టంగా చెప్పాలంటే.. మన విద్యా సంస్థలు పరిశోధన కార్యకలాపాలపై ఎక్కువ దృష్టిపెట్టకపోవడమే. విద్యార్థులు రీసెర్చ్ పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి వేతన విధానాలే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయమైన జీతాలు అందిస్తుంటే.. రీసెర్చ్, తద్వారా అకడెమిక్ టీచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునే అధ్యాపకులకు మాత్రం వేతనాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అంతేకాకుండా పరిశోధన అంటే సుదీర్ఘ ప్రక్రియ అనే అభిప్రాయం నాటుకుపోయింది. దాంతో క్రమేణా బోధనకు ఉపకరించే పరిశోధనలకు ప్రాభవం తగ్గిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే.. పరిశోధనల పట్ల ఆసక్తి చూపే ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు పెంచాలి. పరిశ్రమల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థల ఏర్పాటు ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. స్థూలంగా చెప్పాలంటే.. మన మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్ ప్రోగ్రామ్స్‌ను విస్తృతంగా పెంచాలి. అదే విధంగా ప్రపంచస్థాయి ప్రమాణాలు నిర్దేశించడం, మేనేజ్‌మెంట్ విద్యలో నాణ్యతను పెంచే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా పెద్దఎత్తున మద్దతు కావాలి.

పరిశోధన సమస్యకు పరిష్కారాలు:
పరిశోధనల కొరత సమస్యకు సత్వర పరిష్కారం దిశగా.. పరిశోధన విభాగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలి. పరిశోధనలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు పెంచడం.. రీసెర్చ్ ప్రాజెక్ట్స్‌కు నిధుల పరంగా పరిశ్రమల సహకారం కోరడం.. పరిశోధనల దిశగా అడుగులు వేసే వాతావరణాన్ని కల్పించడం.. ఆయా ఫ్యాకల్టీలు కంపెనీలతో కలిసి కన్సల్టెన్సీ ప్రాజెక్టుల్లో పనిచేయడం.. వంటి వాటితో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి పోటీని తట్టుకునేలా విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. అప్పుడు పరిశోధనలు, కెరీర్ పరంగా అకడెమిక్స్‌పై ఆసక్తి పెరుగుతుంది.

విద్యా సంస్థల దృక్పథం మారాలి:
మేనేజ్‌మెంట్ విద్యార్థులు భవిష్యత్తులో పరిశ్రమలకు అవసరమైన రీతిలో రాణించే విషయంలో విద్యా సంస్థల పాత్ర ఎంతో కీలకం. ఈ క్రమంలో నాణ్యత విషయంలో విద్యార్థులు, ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ, ప్రభుత్వం.. ఇలా అన్ని వర్గాలకు నమ్మకం కలిగించేలా వ్యవహరించాలి. అన్ని వర్గాలతో నిరంతర సంప్రదింపులు, విద్యార్థులకున్న లక్ష్యాలు- ప్రస్తుత వాస్తవాలు అర్థమయ్యేలా వివరించడంలో నిజాయితీగా వ్యవహరించడం, బోధనలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం వంటివే ఒక సంస్థ విషయంలో నమ్మకాన్ని కలిగించే సాధనాలు. ఎంబీఏ పట్ల ప్రస్తుతమున్న క్రేజ్ కారణంగా ఏర్పడిన విద్యా సంస్థలు ఈ విషయాలపై మరింత ఎక్కువగా శ్రద్ధ చూపాలి.

నవీకరణ.. అవశ్యం:
ప్రపంచీకరణ నేపథ్యంలో..
స్వదేశీ, విదేశీ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ.. మన మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌ను పురోగమన దిశలో ఉన్న ఆర్థిక వాతావరణానికి సరితూగేలా నవీకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకోసం విద్యా సంస్థలు.. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌కు దరఖాస్తు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించడం.. విదేశీ ఇన్‌స్టిట్యూషన్స్‌తో ఫ్యాకల్టీఎక్స్ఛేంజ్.. పరిశోధనల పరంగా అంతర్జాతీయ ఒప్పందాలు.. వంటి విధానాలు అనుసరించాలి. వీటితోపాటు అంతర్జాతీయంగా సంబంధమున్న కొత్త కోర్సుల రూపకల్పన, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కరిక్యులంను మార్చడం.. నిరంతర ప్రక్రియగా పాటించాలి. విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఒక ఇన్‌స్టిట్యూట్ ప్రముఖ స్థానంలో నిలిచిందంటే అందుకు కారణం అక్కడి విద్యార్థుల ప్రతిభే అని గుర్తించాలి.

ఐఎస్‌బీ.. అన్నిటా వైవిధ్యం:
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీ మేనేజ్‌మెంట్ కోర్సులు ఏడాది వ్యవధిలోనే కొనసాగుతున్నప్పటికీ.. అన్ని అంశాల మధ్య సమతుల్యత పాటిస్తూ.. బోధనలో వైవిధ్యం పాటిస్తోంది. ఏడాది వ్యవధిలోనే క్లాస్ రూం టీచింగ్ + రీసెర్చ్ ఓరియెంటేషన్ కలయికగా కోర్సును రూపొందించాం. ఈ క్రమంలో అకడెమిక్ కరిక్యులంతోపాటు విద్యార్థుల్లో సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కల్పించే దిశగా.. లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ప్లానింగ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ వెంచర్, ఎక్స్‌పెరిమెంటల్ లెర్నింగ్, ఇండిపెండెంట్ స్టడీ ప్రోగ్రామ్, కార్పొరేట్ ఇంటరాక్షన్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వంటి ఎన్నో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. వీటన్నిటి కారణంగా ఒక ఏడాది ఎగ్జిక్యూటివ్ పీజీ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసేనాటికి థియరీ, ప్రాక్టికల్ దృక్పథాలు పూర్తి స్థాయిలో లభించి పరిపూర్ణమైన నాయకత్వ లక్షణాలు సొంతమవుతాయి.

అంతేకాకుండా ఇన్‌స్టిట్యూట్‌లోని కెరీర్ అడ్వాన్స్‌మెంట్ సర్వీసెస్ టీం.. కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల అభిరుచులను, వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతుంది. కోర్సు ఆసాంతం పలు విధానాలుగా విద్యార్థులకు చేయూతనిస్తూ కోర్సు పూర్తయ్యేనాటికి ఇండస్ట్రీ రెడీగా రూపొందేందుకు ఈ టీం సహకరిస్తుంది. ఇలా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ టీంతోపాటు.. అంతర్గతంగానే 13 ప్రొఫెషనల్ క్లబ్స్, కెరీర్ సర్వీసెస్ గ్రూప్ వంటి పలు బృందాల ద్వారా విద్యార్థులకు నిరంతరం క్షేత్రస్థాయి నైపుణ్యాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నాం. ఐఎస్‌బీలో ఏటేటా స్వదేశీ, విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది కాలంలో విదేశీ విద్యార్థుల అప్లికేషన్ల సంఖ్య 20 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇలా 2001లో 126 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఐఎస్‌బీలో ప్రస్తుతం 770 మంది పలు కోర్సులను అభ్యసిస్తున్నారు.

జండర్ ఈక్వాలిటీ (లింగ సమానత్వం) దిశగా:
మరోవైపు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన జండర్ ఈక్వాలిటీ(లింగ సమానత్వం) విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించి అడ్మిషన్లు కల్పిస్తున్నాం. ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన రెండు క్యాంపస్‌ల (హైదరాబాద్, మొహాలీ) లో 216 మంది మహిళా విద్యార్థులున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఇది 28 శాతం. ఇలా మహిళా విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించడంలో దేశంలోనే పెద్ద ఇన్‌స్టిట్యూట్‌గానూ పేరు సొంతం చేసుకున్నాం. భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తాం.

పరిశోధనలకు మరింత ప్రాధాన్యం:
ఐఎస్‌బీ బోధన విధానంలో అత్యంత విశిష్టమైన అంశం పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. ఈ క్రమంలో ఇటీవలే ఫ్యాకల్టీ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో.. అప్పటికే రీసెర్చ్ చేస్తున్న ఫ్యాకల్టీతో కలిసి పనిచేసే అవకాశం తద్వారా శిక్షణ నైపుణ్యాలు మెరుగుపడటం సాధ్యమవుతాయి. దీంతోపాటు ఫెలోప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ పేరుతో డాక్టోరల్ కోర్సును కూడా ప్రారంభించాం.

అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా:
తాజా గ్రాడ్యుయేట్లు మొదలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వరకు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా కొత్త కోర్సులకు రూపకల్పన చేశాం. ఈ క్రమంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కోసం పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్; ఎలాంటి పని అనుభవం లేని తాజా గ్రాడ్యుయేట్ల కోసం.. మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఫర్ ఫ్యామిలీ బిజినెస్ ప్రోగ్రామ్; అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు భవిష్యత్తులో పీజీపీఎం కోర్సులో సీటు ఖరారు చేసే విధంగా యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ వంటి వినూత్న కోర్సులకు రూపకల్పన చేసి అన్ని వర్గాలకు ఐఎస్‌బీని చేరువ చేస్తున్నాం.

వన్ స్కూల్- టు క్యాంపస్ విధానంలో మొహాలీలో:
తొలుత హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఐఎస్‌బీ.. గతేడాది మొహాలీలో నాలుగు కొత్త రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌తో రెండో క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ మరో విశిష్టమైన అంశం కోర్సులు, బోధన పరంగా రెండు క్యాంపస్‌లను అనుసంధానం చేసి.. ప్రపంచంలోనే ఇలాంటి సదుపాయం కలిగిన అతికొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల జాబితాలో ఒకటిగా నిలవడం. ఇలా ‘వన్ స్కూల్- టు క్యాంపస్’విధానం వల్ల రెండు ఇన్‌స్టిట్యూట్‌లలోని విద్యార్థులకు శిక్షణ పరంగా ఎలాంటి తేడా లేకుండా, ఒకే విధమైన బోధన, ప్లేస్‌మెంట్ సదుపాయాలు లభిస్తాయి.

ఐఎస్‌బీ భవిష్యత్తు ప్రణాళికలు:
మా ముఖ్య లక్ష్యం.. ప్రపంచ స్థాయి మేనేజ్‌మెంట్ విద్యను అందించడమే! ఈ క్రమంలో ఫ్యాకల్టీ సంఖ్యను పెంచడం.. అంతర్జాతీయ స్థాయి ప్రముఖ జర్నల్స్‌లో చోటు లభించేలా హై క్వాలిటీ రీసెర్చ్‌ను కొనసాగించడం.. కరిక్యులంను తాజా అవసరాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడేలా రూపొందించడం.. విద్యార్థి బృందంలో వివిధ దేశాల విద్యార్థుల సంఖ్యను పెంచడం.. మౌలిక వసతులు-టెక్నాలజీ మెరుగుపరచడం.. తద్వారా సమాజ అభివృద్ధికి దోహదపడే భవిష్యత్తు మేనేజర్లను రూపొందించడమే మా ప్రధాన లక్ష్యం!!
Published date : 15 Aug 2013 05:44PM

Photo Stories