Skip to main content

ప్రాక్టికల్‌గా... ఫార్మసీ!!

ఫార్మసీ.. ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న కోర్సు!ఫార్మాస్యూటికల్ రంగంలో, హెల్త్‌కేర్ విభాగంలో.. ఉజ్వల కెరీర్‌కు తొలిమెట్టు ఫార్మసీ..!! ఆసక్తితో సబ్జెక్టుపై పట్టుసాధిస్తే.. అపరిమిత అవకాశాలు కల్పిస్తున్న కోర్సు ఇది!!! మన రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా అడ్మిషన్ కల్పించే ఈ బీఫార్మసీ కోర్సుకు.. ప్రభుత్వం బోధనా ఫీజులను కూడా ఇటీవలే నిర్ణయించింది. దాంతో త్వరలోనే ప్రవేశాల కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. బీఫార్మసీ కోర్సు.. కెరీర్ స్కోప్‌పై.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్), హైదరాబాద్ ప్రాజెక్ట్ డెరైక్టర్ ప్రొఫెసర్ అహ్మద్ కమల్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...

దేశ ప్రస్తుత అవసరాలను పరిశీలిస్తే.. ఫార్మసీ పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇందుకు ప్రధాన కారణం.. మన హెల్త్‌కేర్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటమే! సగటున 12 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటూ.. పరిశ్రమ పరిధి పరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఏటేటా డ్రగ్స్ ఫార్ములేషన్, రీసెర్చ్ సంస్థల సంఖ్య పెరుగుతోంది. దాంతో ఆయా సంస్థలకు అర్హులైన, నాణ్యమైన మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా.. ఫార్మసీ కోర్సు ఉత్తీర్ణులకు చిన్నస్థాయి ఫార్మసీ ఔట్‌లెట్ నుంచి బల్క్‌డ్రగ్ ఫార్ములేషన్ వరకూ.. అన్నింటా అవకాశాలు విస్తృతమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్ రంగాలకు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. వీటన్నింటినీ గుర్తించి భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేలా ఫార్మసీ విద్యార్థులు అడుగులు వేయాలి.

ప్రాధాన్యమున్న కోర్సు.. ఫార్మసీ:
మన రాష్ట్రంలో దాదాపు 30 వేల బీఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలా సీట్లు భర్తీ కావట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ సమస్య లేదు. రాష్ట్రంలోని పలు కాలేజీల్లో సరైన సదుపాయాలు, ప్రమాణాలు లేకపోవడం వల్లనే ఈ కోర్సులో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. వాస్తవానికి విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో వైద్యులకు ఎంత ప్రాధాన్యమిస్తారో.. అంతే ప్రాధాన్యం ఫార్మసిస్ట్ లకు ఉంటుంది. ఇప్పుడిప్పుడే ప్రసార సాధనాల ద్వారా ఫార్మసీతో అవకాశాలపై మన దేశంలోనూ క్రమేణా అవగాహన పెరుగుతోంది. ఇది మంచి పరిణామం.

రెండు గ్రూపుల్లో అనుకూలం ఎవరికంటే:
బీఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ రెండు గ్రూపుల విద్యార్థులు అర్హులే. రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా బీఫార్మసీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు జీవశాస్త్ర సంబంధ అంశాలపై అవగాహన ఉంటుంది కాబట్టి ఎంపీసీ విద్యార్థులతో పోల్చితే.. బైపీసీ వాళ్లే ముందంజలో ఉంటారనేది నా అభిప్రాయం. ఎంపీసీ విద్యార్థుల విషయానికొస్తే.. కెమికల్ ఫార్ములేషన్ సంబంధ రంగాలు, పరిశ్రమల్లో బాగా రాణిస్తారు. కొన్ని కంపెనీలు బీఎస్సీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయనే అభిప్రాయముంది. ఆ సంస్థలు కేవలం రసాయన సంబంధ డ్రగ్ డిస్కవరీకి పరిమితమైనవే. ఫార్మాస్యూటికల్ రంగంలో కోర్ విభాగంలో స్థిరపడాలనుకుంటే పూర్తిస్థాయి ఫార్మసీ కోర్సులు చేయడమే మంచిది.

నాణ్యత కోసమే.. నైపర్-జేఈఈ:
జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ ప్రవేశాలకు జీప్యాట్(గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్) నిర్వహిస్తున్నప్పటికీ.. నైపర్ ఆరు క్యాంపస్‌లలో ప్రవేశానికి ప్రత్యేకంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి కారణం.. నాణ్యమైన, నిజమైన ఆసక్తి గల విద్యార్థులను ఎంపిక చేయడం కోసమే. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్‌లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతో నైపర్స్‌ను నెలకొల్పింది. వీటిలో బోధన పూర్తిస్థాయిలో ప్రాక్టికల్ అప్రోచ్‌తో, రీసెర్చ్ ఓరియెంటేషన్‌లో సాగుతుంది. కరిక్యులం, సిలబస్ కూడా విభిన్నంగా ఉంటుంది. ఫలితంగా సర్టిఫికెట్ చేతికొచ్చే సమయానికి విద్యార్థి సర్వసన్నద్ధంగా, పరిశ్రమకు అవసరమైన అన్ని నైపుణ్యాలు సొంతం చేసుకుంటాడు.

ఫ్యాకల్టీ కొరత:
రాష్ట్రంలోని ఫార్మసీ కాలేజీల్లో నాణ్యమైన ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. ఫార్మసీలో ఉన్నత విద్య (పీజీ, పీహెచ్‌డీ) ను అభ్యసించే వారి సంఖ్య తక్కువగా ఉండటం.. ఒక వేళ ఎంఫార్మసీ వంటి పీజీ కోర్సులు పూర్తిచేసినా.. బోధన పట్ల వాళ్లు ఆసక్తి చూపకపోవడం ఫ్యాకల్టీ కొరతకు ప్రధాన కారణం. ఫ్యాకల్టీ కొరతకు తోడు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను సంతృప్తిపరిచేలా కళాశాలల్లో మౌలిక సదుపాయాలు ఉండట్లేదు. దాంతో ఈ కోర్సులో చేరితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉండదన్న సంశయంతో విద్యార్థులు ముందుగానే దూరమవుతున్నారు. అటు కోర్సులో చేరిన విద్యార్థులకు నైపుణ్యాలు పెంచే దిశగా ఇంటరాక్టివ్ టీచింగ్ అందడంలేదు. ఎన్నో కాలేజీల్లో లెక్చరర్లు కేవలం సిలబస్ బోధనకే పరిమితమవుతున్నారు. విద్యార్థులతో మమేకం కావట్లేదు. దాంతో విద్యార్థుల సందేహాలు అలానే మిగిలిపోతున్నాయి. అలాకాకుండా విద్యార్థులు లైబ్రరీ, రిఫరెన్స్ బుక్స్, వికీపీడియా, సోషల్ నెట్‌వర్క్ వంటి సాధనాలను వినియోగించుకుని తమ సబ్జెక్ట్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. తరగతి గదికే పరిమితమైతే నష్టపోతారని గుర్తించాలి.

ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో మరింత నైపుణ్యం:
నాలుగేళ్ల బీఫార్మసీలో రాణించాలంటే.. కోర్సులో చేరిన తొలిరోజు నుంచే ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో అధ్యయనం సాగించాలి. తాము చదువుతున్న కోర్సుకు సంబంధించి వాస్తవ అప్లికేషన్స్‌పై అవగాహన పొందాలి. ప్రధానంగా క్లినికల్ ట్రయల్స్, బల్క్‌డ్రగ్ ఫార్ములేషన్, ఔషధ తయారీలోని పలు పద్ధతులపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అవగాహన పెంచుకునేందుకు కృషిచేయాలి. అకడమిక్ స్థాయిలోనే ఫార్మాస్యూటికల్ సంస్థల్లోనైనా ఇంటర్న్‌షిప్ చేయాలి. తద్వారా ప్రాక్టికల్ పరిజ్ఞానం అలవడుతుంది.

ఉన్నత విద్యనభ్యసిస్తేనే:
బీఫార్మసీలో చేరే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే.. ఉన్నత విద్యతోనే సాధ్యం. అందుకే ప్రతి విద్యార్థి పీజీ కోర్సులు చదవడం కనీస అవసరంగా గుర్తించాలి. జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జీప్యాట్, అదేవిధంగా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షల కోసం బీఫార్మసీ మూడో సంవత్సరం నుంచే కసరత్తు ప్రారంభించాలి. పీజీ స్థాయిలో ఏ కోర్సు పూర్తి చేసినా భవిష్యత్తుపై భరోసా ఉంటుంది. ప్రస్తుతం ఫార్మా మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతోపాటు రీసెర్చ్‌పై ఆసక్తి ఉంటే.. పీహెచ్‌డీని లక్ష్యంగా చేసుకోవాలి. ప్రస్తుతం దేశంలో నైపర్, ఐఐసీటీ, ఐఐఎస్సీ వంటి పలు జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లు.. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ అర్హతతో పీహెచ్‌డీలోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో అడుగుపెడితే ఫెలోషిప్‌తోపాటు నూతన ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుంది. నైపర్ క్యాంపస్‌ల నుంచి ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీల కోసం విదేశాలకు వెళుతున్నారు.

పెరుగుతున్న ప్రాధాన్యం:
హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్ రంగాలకు ప్రభుత్వం కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ఇటు అకడమిక్, అటు ఇండస్ట్రీ అవసరాల దృష్ట్యా అనేక చర్యలు చేపడుతోంది. అకడమిక్ పరమైన చర్యల విషయానికొస్తే.. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కొత్తగా పది నైపర్స్‌ను ఏర్పాటు చేయాలని.. అదే విధంగా నైపర్స్‌లో పీజీ, పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను మరో అయిదు వేలకు పెంచాలని ప్రణాళిక సంఘం సూచించింది. అంతేకాకుండా బయో-ఫార్మాస్యూటికల్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిలేటెడ్ టు ఫార్మాస్యూటికల్స్, న్యూ కెమికల్ ఎంటిటీస్‌కు సంబంధిత విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు రూపకల్పన చేయాలని కూడా సలహా ఇచ్చింది. దాంతోపాటు డ్రగ్ డిస్కవరీకి సంబంధించి ఇన్‌స్టిట్యూట్-ఇండస్ట్రీ ఇంటరాక్షన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తూ.. ఒక్కో నైపర్‌కు ఒక్కో పరిశోధన అంశాన్ని కేటాయించింది. ఈ క్రమంలో నైపర్-హైదరాబాద్‌లో నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ అండ్ డీ ఇన్ బల్క్ డ్రగ్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు కారణం.. దేశంలో మొత్తం ఉత్పత్తి అవుతున్న బల్క్‌డ్రగ్ ప్రొడక్ట్స్‌లో 30 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి కావడమే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ప్రత్యేక టౌన్‌షిప్ ఏర్పాటు కానుంది.

లక్షల్లో డిమాండ్-విదేశాల్లోనూ:
ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ విభాగాల్లో భవిష్యత్‌లో లక్షల మంది ఫార్మసీ అభ్యర్థుల అవసరం ఉంటుంది. నేషనల్ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ అంచనా ప్రకారం- 2020 నాటికి.. ఈ విభాగాల్లో కింది స్థాయి మొదలు ఉన్నత స్థానాల వరకు దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది అవసరం. అలాగే.. సమీప భవిష్యత్తులో అంటే 2015 నాటికి కనీసం లక్ష మంది అవసరమని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మెడికల్ కెమిస్ట్స్, మాలిక్యులర్ బయాలజిస్ట్స్, జెనెటిస్ట్స్, ఇమ్యునాలజిస్ట్స్, క్లినికల్ రీసెర్చర్స్, బయో-స్టాటిస్టిషియన్స్, కెమికల్ అండ్ బయో కెమికల్ ఇంజనీర్స్ వంటి సిబ్బంది అవసరం ఎంతో ఉందని పేర్కొంది. ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు విదేశీ అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, మన ఫార్మసీ గ్రాడ్యుయేట్లకుఎర్ర తివాచీ పరుస్తోంది. ఇదే ధోరణి కెనడా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లోనూ ఉంది. మరోవైపు ఔట్ సోర్సింగ్ కూడా విస్తరిస్తోంది. 2015 నాటికి ఔట్‌సోర్సింగ్‌లో 8 నుంచి 10 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా. కాబట్టి దేశవిదేశాల్లో అవకాశాలు విస్తరిస్తున్నందున ఫార్మసీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.

నా సలహా:
బీఫార్మసీ కోర్సు ఔత్సాహికులకు నేనిచ్చే సలహా సర్టిఫికెట్ అందుకున్నాక ఫార్మసిస్ట్‌లుగా పని చేయడమే అనే అపోహ వీడాలి. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ మాదిరిగానే ఫార్మసీ కూడా ఒక ప్రొఫెషనల్ కోర్సు అని గుర్తించాలి. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి పలు మార్గాల ద్వారా ఆయా కాలేజీల నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మేలు. కాలేజీ ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలి. తాము చేరే కాలేజీ నాణ్యతపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అన్ని కళాశాలలను ప్రత్యక్షంగా సందర్శించడం వీలు కాదు. కాబట్టి ఆయా కాలేజీల అలూమ్నీలు, ఫ్యాకల్టీలను సంప్రదించి, సదరు కాలేజీ నాణ్యతను తెలుసుకోవాలి. కోర్సులో చేరాక సబ్జెక్ట్‌ను ఇష్టపడి చదవాలి. ప్రధానంగా బయలాజికల్ సెన్సైస్‌లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఎక్కువ పెంచుకుంటే.. అంత ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ స్థాయి అర్హతలు సాధిస్తే అవకాశాలకు ఆకాశమే హద్దు.

Published date : 25 Jul 2013 04:00PM

Photo Stories