Skip to main content

మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో కెరీర్‌లో మెరవొచ్చు

‘ఇంజనీరింగ్ నైపుణ్యాలకు మేనేజ్‌మెంట్ స్కిల్స్ తోడైతే ఉజ్వల కెరీర్ దిశగా అదనపు ప్రయోజనం గ్యారంటీ’ అని అంటున్నారు ఐఐటీ-ముంబై ఆధ్వర్యంలోని శైలేష్ జె.మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ శివగణేశ్ భార్గవ. ఐఐఎం అహ్మదాబాద్‌లో మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ(ఫెలో)చేసి.. ఐఐటీ-ముంబైలో దాదాపు పాతికేళ్ల బోధనానుభవంతో బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్‌గా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొ॥శివగణేశ్ భార్గవతో గెస్ట్ కాలమ్...
బిజినెస్ స్కిల్స్ ద్వారా టెక్నోగ్రాడ్యుయేట్లకు లభించే అవకాశాలు మెరుగవుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని గుర్తించే ఇటీవల కాలంలో అధికశాతం ఇంజనీరింగ్ విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అంతమాత్రాన మేనేజ్‌మెంట్ విద్యలో ఇంజనీరింగ్ విద్యార్థులే ముందంజలో ఉంటారని భావించడం కూడా సరైన అభిప్రాయం కాదు. ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు సైతం ప్రముఖ బి-స్కూల్స్‌లో ప్రవేశం పొందడాన్ని చూస్తే కెరీర్ పరంగా మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నాయో తెలుసుకోవచ్చు.

మేనేజ్‌మెంట్ + ఇంజనీరింగ్
మేనేజ్‌మెంట్ విద్య కొన్ని నేపథ్యాల విద్యార్థులకే అందుబాటులో ఉంటోందని, ముఖ్యంగా ఇంజనీరింగ్ పట్టభద్రులే మేనేజ్‌మెంట్ కళాశాలల్లో అధిక శాతం ఉంటున్నారనే అభిప్రాయం నెలకొన్న మాట వాస్తవం. ఇందుకు కారణం.. మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్షల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు కొంత మెరుగైన ఫలితాలు పొందడమే! దాంతో సహజంగానే ఆయా బీస్కూల్స్‌లోని విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటోంది. దీనికి ఇంజనీరింగ్ విద్యార్థుల వ్యక్తిగత దృక్పథాన్ని కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు భవిష్యత్తులో సొంత సంస్థలు నెలకొల్పాలనే ఉద్దేశంతోనో లేదా తమ కోర్ రంగంలోనే భవిష్యత్తులో డెసిషన్ మేకింగ్ విభాగాల్లో కీలక భాగస్వామ్యం పొందాలనే ఆలోచనతోనో ఉంటున్నారు. అందుకే మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరుతున్నారు.

ఐఐటీల్లో విభిన్న కోర్సులు
ఐఐటీలకు ఇంజనీరింగ్ విద్యను అందించడంలో అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్‌తోపాటు మేనేజ్‌మెంట్, సోషల్ సెన్సైస్, లా, మెడిసిన్ తదితర విభిన్న కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. అవి..ఇన్‌స్టిట్యూట్ స్థాయిలో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌కు ప్రాధాన్యమివ్వడం; సామాజికంగా అన్ని వర్గాలు, నేపథ్యాలకు ఐఐటీ క్యాంపస్‌లను అందుబాటులోకి తేవడం. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ క్రమంలో ఇతర విభాగాల్లో పూర్తి స్థాయి కోర్సుల విద్యార్థులకే కాకుండా ఇతరులకు కూడా అవకాశం ఉంటుంది. అప్పటికే ఆయా ఐఐటీల్లో బీటెక్, ఎంటెక్ తదితర ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న అభ్యర్థులు సైతం తమకు నచ్చిన ఇతర కోర్సులను మైనర్స్‌గా ఇంటర్ డిసిప్లినరీ పద్ధతిలో అభ్యసించే అవకాశం లభిస్తుంది.

కొలాబరేషన్స్‌తో మరింత మెరుగ్గా
మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని ఇతర ఇన్‌స్టిట్యూట్‌లతో కలిసి జాయింట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు నూతన నైపుణ్యాలపై అవగాహన లభిస్తుంది. ఇండస్ట్రీ కొలాబరేషన్స్‌తో రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ సొంతం చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి అన్ని విభాగాల్లోనూ కొలాబరేషన్స్, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. మా ఇన్‌స్టిట్యూట్‌లో వీటికి ప్రాధాన్యమిస్తున్నాం.

దూర విద్య కంటే
మేనేజ్‌మెంట్‌లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌పై ఇటీవల కాలంలో అవగాహన పెరిగింది. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది. అయితే ఇండస్ట్రీ వర్గాలు ఫుల్ టైం లెర్నర్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి (ఫుల్ టైం) కోర్సుల్లో చేరడానికే ప్రయత్నించడం మంచిది.

కాంటెంపరరీ అప్రోచ్‌తోనే విజయాలు
విద్యార్థుల భవిష్యత్తు విజయ పథంలో నడవాలంటే కాంటెంపరరీ అప్రోచ్ ఒక్కటే మార్గం. కేవలం పుస్తకాల అభ్యసనం, సర్టిఫికెట్లు సొంతమైతే చాలు అనుకునే దృక్పథం వీడాలి. ఆయా రంగాల్లోని వాస్తవ నైపుణ్యాలపై అవగాహనతో ముందుకుసాగాలి. ప్రాజెక్ట్ వర్క్స్, రియల్ టైం కేస్ స్టడీస్ అనాలిసిస్, బిజినెస్ స్ట్రాటజీలను తెలిపే కేస్ స్టడీస్ విశ్లేషణ తదితరాలను ప్రాధాన్యాంశాలుగా గుర్తించాలి. అప్పుడే మేనేజ్‌మెంట్ విద్యలో చేరిన విద్యార్థి లక్ష్యం నెరవేరుతుంది.
Published date : 04 Dec 2015 12:30PM

Photo Stories