Skip to main content

కేస్ స్టడీస్.. ఎంతో ముఖ్యం

‘ప్రస్తుతం దేశంలో ఎన్నో కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా స్వయం ఉపాధి దిశగా పలు కొత్త స్టార్టప్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇదే సమయంలో ఎంటర్‌ప్రెన్యూరియల్ ఔత్సాహికులు మరెందరో.. మదిలో మంచి ఆలోచనలున్నా.. కార్యరూపం దాల్చేందుకు మార్గాలు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి పరిశ్రమ వర్గాల వరకు అందరూ ముందుకొచ్చి స్టార్టప్స్‌కు సహకరించాల్సిన ఆవశ్యకత ఉంది’ అంటున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - కోల్‌కతా ‘న్యూ ఇనీషియేటివ్స్ అండ్ ఎక్స్‌టర్నల్ రిలేషన్స్’ డీన్ ప్రొఫెసర్ అశోక్ బెనర్జీ. ఆయన కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఎంకాం, రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. తర్వాత ఐఐఎం-లక్నో, ఐఎంటీ- ఘజియాబాద్ వంటి ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో బోధించారు. గతేడాది ఐఐఎం-సీలో ప్రారంభించిన సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్‌కు అవకాశాలు, ఐఐఎం-కోల్‌కతా చేపడుతున్న చర్యలపై ఆయనతో ఇంటర్వ్యూ...

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆవశ్యకత ఎంతో
దేశంలో ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆవశ్యకత ఎంతో ఎక్కువగా ఉంది. స్టార్టప్స్ సంఖ్య మరింత పెరగాలి. ముఖ్యంగా స్మాల్ మీడియం ఎంటర్‌ప్రెజైస్ (ఎస్‌ఎంఈ) విభాగంలో స్టార్టప్స్ రూపుదిద్దుకుంటే.. కింది స్థాయి నుంచే అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. ఈ స్టార్టప్స్ ఫలితంగా ఎస్‌ఎంఈ రంగం పురోగమిస్తుంది. దాంతోపాటు పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ, ముడి ఉత్పత్తుల సంఖ్య పెరిగి స్థూలంగా ఉత్పాదకత పెరుగుతుంది. అదే సమయంలో ఆదాయాన్నీ అందిస్తుంది.

ఇన్‌స్టిట్యూట్.. ఇండస్ట్రీ కలిస్తేనే
స్టార్టప్స్‌ను ప్రోత్సహించే క్రమంలో అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లు, పారిశ్రామిక వర్గాలు రెండూ కలిసి సంయుక్తంగా కృషిచేయాలి. అలాచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్.. ఇంక్యుబేషన్ సెంటర్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఈ క్రమంలో పరిశ్రమల సహకారం కూడా తీసుకోవాలి. తద్వారా సమాజ అవసరాలు తీర్చే ఉత్పత్తులు రూపొందించే విధంగా స్టార్టప్స్‌ను తీర్చిదిద్దొచ్చు. ఈ ఉద్దేశంతోనే గతేడాది ఐఐఎం-కోల్‌కతాలో ఇన్నోవేషన్ పార్క్ పేరుతో స్టార్టప్స్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించాం. ప్రతి ఏటా 40 స్టార్టప్స్‌కు సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. ఈ ఇన్నోవేషన్ పార్క్ ప్రధానంగా హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, క్లీన్ టెక్నాలజీ, లైఫ్ స్టైల్, అనలిటిక్స్ విభాగాల్లో స్టార్టప్స్ ఔత్సాహికులకు సేవలందిస్తోంది.

కొత్త ఆలోచనలు ఆవిష్కరించేలా
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐఐఎం-కోల్‌కతా ప్రత్యేకంగా సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఈఐ)ను కూడా ప్రారంభించింది. ఈ సెంటర్‌లో ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు మమేకమై కొత్త ఆలోచనలను ఆవిష్కరించే విధంగా తోడ్పాటునందిస్తున్నాం. ప్రస్తుత సమాజ అవసరాల దృష్ట్యా దేశంలోని అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విధమైన చర్యలు తీసుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగం మరింత ముందుకు సాగుతుంది.

ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు.. ఎంతో అవసరం
ప్రొఫెషనల్ కోర్సుల్లో విద్యార్థులకు కెరీర్ పరంగా, పరిశ్రమ వర్గాలకు నిపుణులైన మానవ వనరుల కోణంలో ఎంతో ప్రయోజనం చేకూర్చేవి.. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు! వీటివల్ల వాస్తవ అవసరాలతోపాటు విద్యార్థులు తాము నైపుణ్యం సాధించాల్సిన అంశాలపైనా అవగాహన ఏర్పడుతుంది. అకడమిక్‌గా విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ నైపుణ్యాలు పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా.. భవిష్యత్తులో మంచి లీడర్‌గా ఎదగాలనుకునే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ సమస్యలపై అవగాహన ఉండటం ఎంతో అవసరం. ఈ ఆవశ్యకతను గుర్తించిన ఐఐఎం-కోల్‌కతా.. కమ్యూనిటీ ఆఫ్ యూరోపియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్(సీఈఎంఎస్)తో ఒప్పందం చేసుకుంది. తద్వారా ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసింది. ప్రపంచవ్యాప్తంగా 28 ప్రముఖ బిజినెస్ స్కూల్స్ కూటమిగా ఉన్న సీఈఎంఎస్‌తో ఒప్పందం.. విద్యార్థులు అంతర్జాతీయ నిర్వహణ నైపుణ్యాలు పొందేందుకు దోహదపడుతుంది.

కేస్ స్టడీల ప్రాధాన్యం
మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో కీలక పాత్ర పోషించే విభాగం.. కేస్ స్టడీలు. వీటి ద్వారా విద్యార్థులకు హ్యాండ్స్-ఆన్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఈ విషయంలోనూ అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లు.. పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తే.. అటు విద్యార్థులతోపాటు ఇటు పరిశ్రమకు ఉపయుక్తంగా ఉంటుం ది. ఒక పరిశ్రమలోని వాస్తవ సమస్యపై విద్యార్థులు అధ్యయనం చేయడం ద్వారా విశ్లేషణ, కేస్ పెడగాగీ, కేస్ రైటింగ్ వంటి ఎన్నో అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ప్రస్తుతం ఐఐఎం- కోల్‌కతా.. కెనడాలోని వెస్ట్రన్ యూనివర్సిటీ ఐవీ బిజినెస్ స్కూల్‌తో ఒప్పందం చేసుకుని పలు కేస్ స్టడీలపై అధ్యయనం చేస్తోంది.

ఆ మూడు లక్ష్యాలతో నాణ్యమైన విద్య దిశగా
ఐఐఎం-కోల్‌కతా.. గ్రోత్, గవర్నెన్స్, గ్లోబలైజేషన్ అనే మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటికి కార్యరూపం ఇవ్వడంలో ఫ్యాకల్టీ ఎంతో కృషి చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. ఇన్‌స్టిట్యూట్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ బి-స్కూల్స్ ర్యాంకింగ్స్‌లో ఐఐఎం-కోల్‌కతా టాప్-20, టాప్-50లో నిలుస్తోంది.

విద్యార్థులకు సలహా
మేనేజ్‌మెంట్ కోర్సుల ఔత్సాహిక విద్యార్థులకు ఉండాల్సిన మూడు ప్రధాన లక్షణాలు.. విశ్లేషణ సామర్థ్యం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార వాణిజ్య రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన, విభిన్న సంస్కృతులతో మమేకం కాగల దృక్పథం ఉండాలి. ఈ మూడూ ఉంటే భవిష్యత్తులో మంచి బిజినెస్ లీడర్లుగా కార్పొరేట్ ప్రపంచంలో రాణించగలరు!!
Published date : 22 Sep 2014 05:59PM

Photo Stories