Skip to main content

ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలెన్నో..!

గతంలో కొన్ని రంగాలకే పరిమితమైన ఎంబీఏ గ్రాడ్యుయేట్ల అవసరం ప్రస్తుతం ఇతర రంగాలకు సైతం వేగంగా విస్తరిస్తోంది. అంటే ఎంబీఏ పూర్తిచేసిన వారికి డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సును ఎంచుకున్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) సీనియర్ డెరైక్టర్, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ సర్వీసెస్, అడ్మిషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్.. వి.కె. మీనన్. దేశంలో మేనేజ్‌మెంట్ విద్య, ఎంబీఏ కళాశాలల స్థితిగతులు, భవిష్యత్ పరిణామాలపై తాజాగా ఆయన తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు..

మేనేజ్‌మెంట్ విద్యలో భారతదేశం ఇప్పుడిప్పుడే ప్రపంచస్థాయి వేదికగా అవతరిస్తోంది. ప్రస్తుతం మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే యూఎస్‌లోని విద్యా సంస్థలు అత్యుత్తమ మేనేజ్‌మెంట్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. భారత్‌లో మేనేజ్‌మెంట్ విద్య ఇప్పటిదాకా సంప్రదాయబద్ధమైన తరగతి గది బోధనకే పరిమితం. ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. ఇక్కడ బీ స్కూల్స్‌లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల నిపుణులను, అధ్యాపకులను ఆకర్షిస్తున్నాయి.

ఎంబీఏ... అదనపు అర్హత
తమ సంస్థ విలువను పెంచే సామర్థ్యాలు ఉన్నవారినే యాజమాన్యాలు ఉద్యోగులుగా నియమించుకుంటాయి. అదనపు అర్హతగా ఎంబీఏ చేసిన వారికి జాబ్ మార్కెట్‌లో తిరుగుండదు. ఉదాహరణకు.. ఒక ఆసుపత్రిని సమర్థంగా నిర్వహించాలంటే కేవలం వైద్యుడిగా పట్టా సంపాదిస్తే సరిపోదు. ప్లానింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ వంటి వాటిపై పట్టుండాలి. కాబట్టి వైద్య విద్య తర్వాత ఎంబీఏ చేస్తే పుష్కలమైన అవకాశాలున్నాయి. వైద్య రంగంతోపాటు ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ రంగాల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. ఐఎస్‌బీలో ఏటా చాలామంది వైద్యులు మేనేజ్‌మెంట్ విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఎంబీఏ పూర్తిచేసిన వైద్యుల కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి వారికి మంచి డిమాండ్ ఉంది. కేవలం మెడిసిన్ మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో ఉన్నవారు సైతం ఎంబీఏ చేసి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు.

గతంలో కంటే మెరుగైన అవకాశాలు
ఎంబీఏ వ్యాపారంలో విజయానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పుతుంది. ప్రపంచీకరణతో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు గతంలో కంటే ఎన్నో రెట్లు అవకాశాలు పెరిగాయి. బ్యాక్‌గ్రౌండ్ ఏదైనప్పటికీ కన్సల్టింగ్ రంగంలో స్థిరపడాలంటే ఎంబీఏ దాదాపు తప్పనిసరిగా మారింది. దీంతోపాటు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఈక్విటీ, కార్పొరేట్ బ్యాంకింగ్ రంగాలూ వీరికే ప్రాధాన్యమిస్తున్నాయి.

సాంకేతిక రంగంలో అవకాశాలు అపారం!
ఇక సాంకేతిక రంగం ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు సాదర స్వాగతం పలుకుతోంది. బిజినెస్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ కన్సల్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో వీరికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కన్సల్టింగ్, ఫైనాన్స్, సేల్స్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ రంగాలు సంప్రదాయ ఎంబీఏ ప్రొఫెషనల్స్‌ను ఎంచుకుంటున్నాయి. కొత్తకొత్త రంగాల్లో ఎంబీఏల అవసరం పెరిగినట్లు మా పరిశీలనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌కేర్, ఫార్మా, లైఫ్‌సెన్సైస్, మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్‌స్టైల్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర రంగాల్లో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకే మొదటి ప్రాధాన్యత దక్కుతున్నట్లు తేలింది. పలు కీలక రంగాల్లో ఐఎస్‌బీ గ్రాడ్యుయేట్లకు ఉన్నత ఉద్యోగాలు దక్కడమే ఇందుకు నిదర్శనం.

పరిశోధనాపరమైన బోధన కావాలి
ప్రపంచంలోని ఉత్తమ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో నాణ్యమైన పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలను ఆయా సంస్థల విద్యార్థులు పొందుతున్నారు. భారత్‌లోనూ పరిశోధనలు పెరుగుతుండడం శుభ పరిణామం. బిజినెస్ స్కూల్స్ ప్రధాన లక్ష్యం.. సమస్యలను పరిష్కరించే, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడమే. పరిశోధనాపరమైన వాస్తవిక బోధన ఇందుకు కచ్చితంగా ఉపకరిస్తుంది.

సామాజిక బాధ్యతను మరవొద్దు
బిజినెస్ స్కూల్స్‌పై సామాజిక బాధ్యత కూడా తప్పనిసరిగా ఉంటుంది. సమాజం ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యలకు పరిష్కార మార్గాలను చూపేందుకు కృషి చేయాలి. అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఈ అవసరం మరింత ఎక్కువగా ఉంది. నిరుపేదలు, నిరక్షరాస్యులకు మేలు కలిగించే విధానాలను అభివృద్ధి చేయాలి. ఈ దిశగా ఐఎస్‌బీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. పేదలకు గృహ వసతిపై ఇప్పటికే ఎన్నో ప్రాజెక్ట్‌లు చేపట్టాం. భారత్‌లో కంటే విదేశాల్లో బిజినెస్ స్కూల్స్ వేగంగా అభివృద్ధి చెందాయి. దీనికి కారణం.. పరిశ్రమల నుంచి, దాతల నుంచి తగిన ఆర్థిక సహాయం లభించడమే. భారత్‌లో మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి సాయం అందాల్సిన అవసరం ఉంది.

కరిక్యులమ్‌పై పున:సమీక్ష
భారత బిజినెస్ స్కూల్స్ కరిక్యులమ్‌ను పున:సమీక్షించాల్సిన సమయం వచ్చింది. కరిక్యులమ్ సమకాలీనంగా, ప్రపంచస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇది ప్రస్తుత మార్కెట్ అవసరాలను తీర్చేలా తీర్చిదిద్దాలి. కేస్ టీచింగ్ మెథడాలజీని ప్రవేశపెట్టాలి. విదేశీ విద్యార్థులను మరింతగా ఆకర్షించేలా ఎంబీఏ కోర్సును రూపొందించాలి. అంతర్జాతీయంగా విదేశీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాల వల్ల భారత విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఎంబీఏ విద్యార్థికి, పరిశ్రమకు మధ్య సన్నిహిత సంబంధం ఉండాలి. దీనివల్ల పరిశ్రమల అవసరాలేంటో విద్యార్థులకు తెలుస్తాయి. దానికనుగుణంగా వారు సంసిద్ధులయ్యేందుకు అవకాశం ఉంది.

కుటుంబ వ్యాపారాలకు మేలు
మనదేశ వ్యాపారాల్లో 85 శాతానికిపైగా కుటుంబ వ్యాపారాలే ఉన్నాయి. ఈ వ్యాపార కుటుంబాలు తమ సంప్రదాయ పాత పంథాను వీడి ఆధునికతను అందిపుచ్చుకుంటున్నాయి. దీనివల్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు విస్తృతమవుతున్నాయి. వ్యాపార కుటుంబాలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించవచ్చు. ఈ కుటుంబాల నుంచి వ్యాపారంలోకి ప్రవేశించే కొత్త తరాలకు తగిన శిక్షణ అవసరమవుతోంది. ఇలాంటి వారి కోసం ఐఎస్‌బీ.. మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యామిలీ బిజినెస్(ఎంఎఫ్‌ఏబీ) కోర్సుకు రూపకల్పన చేసింది. కుటుంబ వ్యాపారాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన నైపుణ్యాలను బోధిస్తోంది. వ్యాపారంలో భవిష్యత్ నాయకులుగా ఎదిగేందుకు తోడ్పాటును అందిస్తోంది.
Published date : 17 Feb 2014 06:10PM

Photo Stories