Skip to main content

బిగ్ డేటాతో బెస్ట్ ఫ్యూచర్

‘ఆధునిక కంప్యూటరీకరణ నేపథ్యంలో, బిగ్ డేటా, డేటా మేనేజ్‌మెంట్ వంటి విభాగాలపై యువత దృష్టి సారిస్తే ఉత్తమ భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు’ అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్ చైర్ ప్రొఫెసర్ జయంత్ ఆర్.హరిష్ట సూచిస్తున్నారు. ఆయన ఐఐటీ-చెన్నై నుంచి బీటెక్, విస్కిన్‌సాన్ యూనివర్సిటీ (యుఎస్) నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసి బోధన రంగంలో మూడు దశాబ్దాల అనుభవం గడించారు. ఇన్ఫోసిస్ అవార్డు-2014 గ్రహీత ప్రొఫెసర్ జయంత్ ఆర్.హరిష్టతో ఈ వారం ‘భవిత’ గెస్ట్ కాలమ్.
అకడమిక్ నేపథ్యమేదైనా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత తమను తాము మార్చుకోవాలి. కోర్సు పూర్తిచేసి ఉద్యోగాలు పొందడంతో జీవితంలో స్థిరపడ్డామనే ఆలోచనకు స్వస్తి పలకాలి. సాధారణ గ్రాడ్యుయేట్ నుంచి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ వరకు.. స్థాయి ఏదైనా, నూతన అవకాశాలపై అధ్యయనం చేయాలి.

సీఎస్‌ఈ విద్యార్థులు విభిన్నంగా
ఇంజనీరింగ్ కోర్సుల విషయానికొస్తే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల దృక్కోణం మారాలి. ఆటోమేషన్ టూల్స్, డేటా సెక్యూరిటీ, 3-డి డిజైన్ వంటి కొత్త అంశాలు నేర్చుకోవాలి. ప్రస్తుతం ఎలాంటి సంస్థలైనా వాటికి తగిన సాఫ్ట్‌వేర్స్ వినియోగించి టార్గెట్ యూజర్స్‌కు సేవలందించడం సర్వసాధారణమైంది. ఈ నేపథ్యంలో క్లాస్ రూం బోధనకే పరిమితమవకుండా నూతన అవకాశాలు కల్పించే విభాగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి.

అప్లికేషన్స్‌కే పరిమితం కావద్దు
సీఎస్‌ఈ విద్యార్థుల్లో అధిక శాతం మంది సాఫ్ట్‌వేర్స్ అప్లికేషన్స్ విభాగంలో కెరీర్స్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కోణంలో మానవ వనరుల కోసం కంపెనీలు విస్తృతంగా అన్వేషిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల్లో అధిక శాతం మంది, రిస్క్ లేని కెరీర్ కోరుకంటూ అప్లికేషన్స్‌కే పరిమితమవుతున్నారు. వీరు డిజైనింగ్‌పై దృష్టి పెట్టి సాఫ్ట్‌వేర్స్ రూపకల్పనలో పాల్పంచుకుంటే కెరీర్‌లో ముందుంటారు.

అంతా ఆన్‌లైన్‌లోనే..
సాఫ్ట్‌వేర్ రంగంలో సంస్థల కార్యకలాపాలు, లక్షిత వినియోగదారుల కారణంగా బిగ్‌డేటా విస్తృతంగా ప్రచారమవుతోంది. ప్రస్తుతం ప్రతి సంస్థ ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోంది. ఈ క్రమంలో విభిన్న నేపథ్యాలు, అవసరాలు గల వినియోగదారులు ఎదురవుతుంటారు. తమ మొత్తం వినియోగదారులను అవసరాలకు అనుగుణంగా వర్గీకరించి, వాటి ఆధారంగా ప్రత్యేక డేటా రూపొందించాలి. తద్వారా సేవలు, ఉత్పత్తులు అందించేందుకు కార్యకలాపాలు, వ్యాపార వ్యూహాలు అమలు చేయడానికి బిగ్ డేటా మేనేజ్‌మెంట్ ఉపయోగపడుతుంది. ఆ డేటాను నిక్షిప్తం చేయడం, పైరసీకి గురికాకుండా చేసే డేటా సెక్యూరిటీ విభాగాలు కూడా సీఎస్‌ఈ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తును అందిస్తాయి.

సర్టిఫికేషన్స్‌తో జాగ్రత్తగా
చాలా మంది విద్యార్థులు సీనియర్లు, విద్యావేత్తల సలహాల మేరకు తమ కోర్ కోర్సులకు అదనపు ప్రయోజనం చేకూర్చే సర్టిఫికేషన్ కోర్సులు చేస్తున్నారు. అయితే వీటిని ఎంపిక చేసుకునే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ సర్టిఫికేషన్ తమ కోర్ డొమైన్‌కు ఎలా సరితూగుతుంది, దాని వ్యవధి, ఆ కోర్సు స్వరూపం, సంస్థకు ఉన్న గుర్తింపు.. వంటి వాటిపై దృష్టి పెట్టాలి. షార్ట్ టర్మ్ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు తప్పనిసరిగా సర్టిఫికేషన్ జారీ చేసే అధికారిక సంస్థ నిర్వహించే పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలి. సర్టిఫికేషన్‌తో అవకాశాలు మెరుగవుతాయి.

ఉన్నత విద్యకు ప్రాధాన్యం
ఉన్నత విద్య, ఉద్యోగం.. ఈ రెండు ఆప్షన్లలో ఏది ఎంచుకోవాలనేది విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే.. ఎలాంటి నేపథ్యం, అవసరం ఉన్నప్పటికీ ఉన్నత విద్య వైపు దృష్టి పెట్టాలన్నదే నా సలహా. ఉన్నత విద్య దిశగా సాగే అభ్యర్థులు రెండు అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత గుర్తింపు పొందాలనుకునే వారు పీహెచ్‌డీ చేస్తే బాగుంటుంది. బృందంలో పనిచేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు పీజీ చేయాలి.

ఆల్ ది బెస్ట్!!
Published date : 27 Nov 2015 12:51PM

Photo Stories