Skip to main content

‘ఆన్‌లైన్’ అవకాశాలు అందిపుచ్చుకోవాలి

‘పోటీ ప్రపంచంలో ముందంజలో ఉండాలంటే క్లాస్‌రూం అభ్యసనానికే పరిమితం కాకుండా ఆన్‌లైన్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ అని సూచిస్తున్నారు ఐఐటీ-ఇండోర్ డెరైక్టర్, ప్రొఫెసర్ ప్రదీప్ మాథుర్.
పాలిటెక్నిక్ ఆఫ్ నార్త్ లండన్ నుంచి బీఎస్సీ(ఆనర్స్), కీలే యూనివర్సిటీలో పీహెచ్‌డీ, యేల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్‌గా, ఐఐటీ - ముంబైలో ఫ్యాకల్టీగా పనిచే శారు. 2010 నుంచి ఐఐటీ-ఇండోర్ వ్యవస్థాపక డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రదీప్ మాథుర్‌తో గెస్ట్ కాలం...

మంచి ఇన్‌స్టిట్యూట్‌లో చేరితేనే మెరుగైన నైపుణ్యాలు సొంతమవుతాయనే అభిప్రాయం చాలామంది విద్యార్థుల్లో ఉంది. ప్రొఫెషనల్ కోర్సుల స్థాయికి చేరుకున్నాక ఎలాంటి ఇన్‌స్టిట్యూట్‌లో చేరినా.. స్కిల్స్ సొంతం చేసుకోవడమనేది విద్యార్థి దృక్పథంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ఐఐటీలు, ఐఐఎంల వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉంటాయనేది వాస్తవం.

ఆన్‌లైన్ సదుపాయాలు.. ఐసీటీ అవకాశాలు:
ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు అకడమిక్ అంశాల్లో పూర్తిస్థాయి నైపుణ్యం పొందలేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. క్లాస్‌రూం సిలబస్ ప్రకారం బోధించే అంశాల్లో విస్తృతి పరిమితంగా ఉంటుంది. అందుకే విద్యార్థులు దీనికి అదనంగా సమాచారాన్ని నేర్చుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఐసీటీ సదుపాయాలను ఉపయోగించుకోవాలి. ఫ్యాకల్టీ కొరతకు పరిష్కారంగా ఐఐటీలు కూడా మూక్స్ వంటి ఆన్‌లైన్ సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి.

రీసెర్చ్ ప్రాధాన్యంగా కరిక్యులం:
ఐఐటీ-ఇండోర్, హైదరాబాద్, మండి, గాంధీనగర్, రోపార్, పాట్నాలను ఇప్పటికీ కొత్త ఐఐటీలుగా పేర్కొనడం సరికాదు. జేఈఈ ఉత్తీర్ణుల ఇన్‌స్టిట్యూట్ ప్రాధామ్యతలే ఇవి రాణిస్తున్నాయనడానికి నిదర్శనం. టాప్-100లో దాదాపు పదిహేను మంది ఐఐటీ-ఇండోర్‌ను ఫస్ట్ ఛాయిస్‌గా పేర్కొన్నారు. బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ తదితర సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల కరిక్యులంలో పరిశోధనకు ప్రాధాన్యం ఇచ్చేలా మార్పులు చేయాలి. ఐఐటీ-ఇండోర్‌లో ఇటీవలే బీటెక్ కరిక్యులంలో మార్పు తీసుకొచ్చాం. దీనివల్ల విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన, ఆసక్తి ఏర్పడుతుంది.

ఐసీటీ విధానాలు విస్తృతంగా..:
దేశంలో మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం నైపుణ్యాలు అందించేలా ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) విధానాలను మరింత విస్తృతంగా అమలు చేయాలి. ఇన్‌స్టిట్యూట్‌లు, కాలేజ్‌లలో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలు కల్పించి విద్యార్థులకు ఆన్‌లైన్ లెక్చర్స్, ఇతర అవకాశాలు అందుబాటులోకి తేవాలి.

స్వయం ప్రతిపత్తితో:
ఇటీవల కాలంలో ఐఐటీలు, ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి కల్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న మాట వాస్తవమే. అయితే ఇలాంటి ప్రపంచ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌లకు స్వయం ప్రతిపత్తి ఉండటం ముఖ్యం. దీనివల్ల ఫ్యాకల్టీ అన్వేషణ, నియామకాల పరంగా స్వతంత్రంగా వ్యవహరించి నిపుణులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకు తద్వారా భవిష్యత్తులో దేశ ప్రగతికి దోహదం చేసే అంశం. స్వయం ప్రతిపత్తి వల్లే ఐఐటీ-ఇండోర్‌లో యూకే, యూఎస్ నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ ఫ్యాకల్టీని నియమించుకున్నాం.

అధ్యాపక వృత్తిపై ఆసక్తి :
ప్రస్తుతం ఐఐటీల నుంచి సాధారణ ఇన్‌స్టిట్యూట్‌ల వరకు ఎదురవుతున్న ఫ్యాకల్టీ కొరత సమస్య తీరాలంటే.. యువతలో అధ్యాపక వృత్తిపై అవగాహన, ఆసక్తి పెంపొందించాలి. వేతనాల కారణంగానే ఈ వృత్తివైపు ఆసక్తి కనబరచకపోవడం వాస్తవమే. ముఖ్యంగా ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ సమస్య ఎదురవుతోంది.

స్వీయ అభ్యసనం ముఖ్యం:
ఐఐటీలో బీటెక్ లక్ష్యంగా చేసుకుని కృషి చేసిన విద్యార్థులు సీటు రాలేదని నిరుత్సాహ పడకూడదు. ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రకారం- 10 నుంచి 12 శాతం మందికి మాత్రమే ఐఐటీల్లో అవకాశం లభిస్తుంది. ఈ విద్యార్థులతో పోల్చుకుని నిరాశ, నిరుత్సాహాలకు గురికాకూడదు. ఐఐటీల్లో, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజనీరింగ్ కోర్సులో అడుగు పెట్టిన విద్యార్థులు స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తరగతి గదిలో బోధించిన అంశాలకు అనుబంధ, సమకాలీన పరిణామాలు స్వయంగా తెలుసుకోవాలి. అప్పుడే కోర్సు పూర్తయ్యే నాటికి జాబ్ రెడీ స్కిల్స్ సొంతమవుతాయి.
Published date : 04 Sep 2015 01:05PM

Photo Stories