Skip to main content

ఆందోళన అనవసరం.. అంతా సక్రమంగానే..


రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి
గతంలో ఎన్నడూ లేనంత సందిగ్ధ వాతావరణం
నెలకొంది. ముఖ్యంగా బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి
కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ ఎప్పుడు
మొదలవుతుందో? క్లాసులు ఎప్పుడు ప్రారంభమవుతాయో?
అనే ఆందోళన లక్షలాది మంది విద్యార్థులు, వారి
తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో.. ఇంజనీరింగ్
తదితర వృత్తి విద్యా కోర్సుల్లో వెబ్ కౌన్సెలింగ్, ప్రవేశాలపై
సందేహాలకు సమాధానాలతోపాటు సంప్రదాయ
డిగ్రీ కోర్సుల విషయంలో చేపడుతున్న సంస్కరణలపై

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్
ప్రొఫెసర్ పి.జయప్రకాశ్ రావు
తో ఇంటర్వ్యూ..

వారం రోజుల్లో పరిష్కారం:
ఈ సంవత్సరం వెబ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి తాజా పరిస్థితికి ప్రధాన కారణం.. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ను ఆన్‌లైన్ విధానంలో జరపాలని ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం: 66పై పలు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం. ఫీజుల విషయంలో ముఖ్యంగా బీటెక్ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) కూడా ఆయా కళాశాలలు అందించిన వ్యయ నివేదిక ఆధారంగా ఇటీవలే ఫీజులకు కూడా తుది రూపం ఇవ్వడంతో ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు తొలిగాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయాలి అనే విషయంలో హైకోర్టులో కొనసాగుతున్న విచారణ కారణంగానే కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతోంది. ఇది కూడా ఈ వారంలోగా పరిష్కారమయ్యే అవకాశముంది. ఈ అంశంపై తీర్పు వెలువడిన వెంటనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తాం.

జూలై చివరి నాటికి కౌన్సెలింగ్ పూర్తి:
‘జూలై 31లోగా అన్ని కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్‌లు పూర్తిచేసి ఆగస్టు 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని’ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీపై హైకోర్టు మార్గదర్శకాలు వెలువడిన వెంటనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేలా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశాం.

ఆగస్టు 1 నుంచే క్లాసులు:
ప్రస్తుతం కొంత సందిగ్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ.. జూలై 31లోగా ప్రవేశాల ప్రక్రియ ముగించి ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రవేశ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ అంతా సక్రమంగానే జరుగుతుంది. ఆ దిశగా ఇప్పట్నుంచే చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు దీన్ని గుర్తించి, కౌన్సెలింగ్ విషయంపై ఆందోళనకు స్వస్తి పలికి,
ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో, తాము చేరనున్న కోర్సులో రాణించడమెలా అనే అంశంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాను.

కాలేజీలకు అనుమతి.. ఏఐసీటీఈ పరిధిలోనిది:
రాష్ట్రంలో ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోతున్న మాట వాస్తవమే. దీనికి ప్రధాన కారణం కళాశాలల సంఖ్య విపరీతంగా పెరగడమే. కళాశాలల సంఖ్యను నియంత్రించడం, కొత్త కళాశాలలకు అనుమతి మంజూరు వంటివి ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) పరిధిలో ఉండే అంశాలు. వాస్తవ పరిస్థితిని ఏఐసీటీఈకి వివరిస్తూ.. శాస్త్రీయంగా సర్వే నిర్వహించి దాని ఆధారంగా నిజంగా అవసరం ఉన్న ప్రాంతంలోనే కొత్త కళాశాలలకు అనుమతులివ్వాలని పలు మార్లు విజ్ఞప్తి చేశాం. అయినా ఏటా పదుల సంఖ్యలో కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతిస్తోంది. ఈ కారణంగానే కన్వీనర్ కోటాలో కూడా చాలా వరకు సీట్లు భర్తీ కాకుండా మిగులుతున్నాయి.

విద్యార్థులు, తల్లిదండ్రుల దృక్పథమూ మారాలి:
మన రాష్ర్టంలో వందల సంఖ్యలో కళాశాలల ఆవిర్భావం, పర్యవసానంగా వేల సంఖ్యలో సీట్లు మిగలడానికి.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా ఓ ప్రధాన కారణం. ఇంజనీరింగ్ లేదా ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివితేనే చక్కని భవిష్యత్తు ఉంటుందనే భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఎంబీబీఎస్‌లో సీట్లు తక్కువగా ఉన్న కారణంగా వారు తమ పిల్లలను ఇంజనీరింగ్ వైపు దృష్టిసారించేలా చేస్తున్నారు. దాంతో ఇంజనీరింగ్ సీట్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కొత్త కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితులను బేరీజు వేస్తే ప్రతి కోర్సుకు చక్కటి భవిష్యత్తు ఉందనే విషయాన్ని గుర్తించాలి. కామర్స్, ఆర్‌‌ట్స, సైన్స్, లా.. ఇలా విభిన్న రంగాల్లో మానవ వనరులకు చక్కని డిమాండ్ నెలకొంది. ఉన్నత విద్య, పరిశోధనల్లో అనేక అవకాశాలున్నాయి. పీహెచ్‌డీ అభ్యర్థుల కోసం యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్), ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు పలు రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను కూడా అందిస్తోంది. విద్యార్థులు వీటిని గుర్తించాలి. కేవలం ఇంజనీరింగ్‌తోనే ఉద్యోగాలొస్తాయి అనే భావనను వీడాలి. వాస్తవనికి ఇంజనీరింగ్‌కు ఈ స్థాయిలో డిమాండ్ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కోర్సును కూడా ఇతర బ్యాచిలర్ కోర్సులు (ఆర్ట్స్, సెన్సైస్, కామర్స్) మాదిరిగానే భావిస్తారు.

సంప్రదాయ కోర్సులకూ సరికొత్త రూపు:
ఇక.. రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చొరవతో సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో మార్కెట్ ట్రెండ్, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈక్రమంలోనే 2008 లోపు 26 సబ్జెక్టుల్లో సిలబస్‌లో మార్పులు చేశాం. దాంతోపాటు ఈ ఏడాది తాజాగా పదిహేను రోజుల క్రితం.. నిపుణుల కమిటీ అధ్యయనం ఆధారంగా.. బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) మోడల్ కరిక్యులం రూపొందించి వాటిని యూనివర్సిటీలకు పంపించాం. ఫలితంగా 2013-14 విద్యా సంవత్సరం నుంచి బీఈడీ సిలబస్ మారనుంది.

మార్కెట్ డిమాండ్, భవిష్యత్ అంచనాయే ప్రధానం:
మన డిగ్రీ కోర్సులు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా లేవని, మూస ధోరణిలో సాగుతున్నాయని, మార్కెట్ అవసరాల మేరకు కొత్త కోర్సులు ప్రారంభించాలి అనే అభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమే. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం.. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సును ప్రారంభించే ముందు సదరు రంగంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే అంచనా మేరకు ప్రారంభించాల్సి ఉంటుంది. లేదంటే ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సులో ఉత్పన్నమైన పరిస్థితులే తలెత్తే అవకాశం లేకపోలేదు. కేవలం మార్కెట్ డిమాండ్ ఆధారంగానే పూర్తి స్థాయి కోర్సు ప్రారంభిస్తే.. భవిష్యత్తులో ఆ రంగం కుదేలైతే వేల మంది విద్యార్థులు నష్టపోతారు. అందుకే.. మార్కెట్ డిమాండ్, కొత్త కోర్సులు తేవాలనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. ఇప్పటికే ఉన్న కోర్సుల్లో కొన్ని మార్పులు చేయాలని యూనివర్సిటీలకు సూచించడం జరిగింది. ప్రతి గ్రూప్‌లో కోర్ సబ్జెక్ట్స్‌ను ఉంచి.. జాబ్ ట్రెండ్‌కు అనుగుణంగా కొన్ని ఎలక్టివ్ సబ్జెక్ట్‌లను పొందుపర్చాలని విజ్ఞప్తి చేశాం.

అధ్యాపకుల కొరత తగ్గుతోంది:
రాష్ర్టంలో వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టుకొస్తున్నా.. విద్యార్థుల కోణంలో కొంత అనుకూల పరిణామం చోటు చేసుకుంది. అది.. అధ్యాపకుల కొరత క్రమేణా కొంత వరకు తగ్గుతుండటమే. రాష్ట్రంలో ఎంటెక్ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరిగింది. ఫలితంగా బీటెక్ కాలేజీల్లో అధ్యాపకులుగా చేరుతున్నా వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అధ్యాపకులుగా పనిచేయొచ్చనే ఏఐసీటీఈ ఇచ్చిన వెసులుబాటు కూడా అధ్యాపకుల కొరతను అధిగమించడానికి దోహపడిందని భావించవచ్చు. బీటెక్ ఉత్తీర్ణులు అధ్యాపకులుగా విధులు నిర్వహించొచ్చనేది 2015 వరకే పరిమితం చేశారు. ఆ తర్వాత తప్పనిసరిగా ప్రతి కళాశాలలో ఎంటెక్ ఉత్తీర్ణులనే అధ్యాపకులుగా నియమించాలి. కాబట్టి ఇప్పుడు బీటెక్ అర్హతతో అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు.. ఇదే రంగంలో కొనసాగాలనుకుంటే 2015 లోపు ఎంటెక్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

డిగ్రీ కాలేజీల పెంపు.. ప్రయోజనమే:
రాష్ట్రంలో ఇటీవల కాలంలో కొత్త డిగ్రీ కళాశాలలకు అనుమతులిస్తున్నాం. 12 వందల మండలాల్లో క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహించి అవసరమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ మాత్రమే నూతన కళాశాలలను మంజూరు చేస్తున్నాం. 2006 నుంచి ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 400పైగా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం వల్ల వేలాది మంది విద్యార్థులకు లాభం చేకూరింది. అధ్యాపకుల కొరత కూడా ఏమంత తీవ్రంగా లేదు. మరోవైపు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (పీజీ) కళాశాలలకు అనుమతి విషయంలోనూ ఎంతో కట్టుదిట్టమైన నిబంధనలు విధించడం జరిగింది. సొంత భవంతులు ఉన్న డిగ్రీ కళాశాలలు మాత్రమే పీజీ కోర్సులు ప్రారంభించేలా నిబంధనలు రూపొందించాం. దీనివల్ల విద్యార్థుల్లో నాణ్యత మెరుగవడమే కాకుండా భవిష్యత్తులో మంచి అధ్యాపకులు లభిస్తారు.

కౌన్సిల్ చొరవతో సెట్‌కు పునర్జీవం:
రాష్ట్రంలో భారీగా ఏర్పాటైన డిగ్రీ కళాశాలల్లో బోధించాలంటే.. నెట్ లేదా సెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులే అర్హులు. ఈ సంఖ్య మన రాష్ట్రంలో తక్కువగా ఉంది. దీన్ని గుర్తించిన ఉన్నత విద్యామండలి రాష్ట్ర స్థాయిలో సెట్ (స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహణకు ఉపక్రమించింది. సెట్ ఆవశ్యకతను ప్రభుత్వానికి నివేదించడం.. దాన్ని ప్రభుత్వం అంగీకరించడంతో ఎన్నో ఏళ్ల తర్వాత గత ఏడాది తొలిసారి సెట్‌ను తిరిగి నిర్వహించారు. మలి దశ సెట్‌కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈసారి మరికొన్ని సబ్జెక్టులను అదనంగా పొందుపర్చేందుకు యూజీసీ అనుమతి కూడా లభించింది.

బోధనలో నాణ్యతకు ప్రాధాన్యం:
విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు సొంతం కావాలంటే.. బోధనలో నాణ్యత ఉండాలి. అందుకే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రతిఏటా తాజా అధ్యాపకులకు వారం రోజులపాటు శిక్షణ తరగతులు, రిఫ్రెష్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. వీటితోపాటు విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే కోణంలో ఆయా కళాశాలలు సెమినార్లు, కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు అనుమతించి నిధులు కూడా అందజేస్తున్నాం. వీటికోసం ప్రతిఏటా రెండుసార్లు కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఈ సదుపాయాన్ని ప్రతి కళాశాల రెండేళ్లకోసారి వినియోగించుకోవచ్చు.

తప్పు చేస్తే.. శిక్షకు సిఫార్సు:
చాలా కళాశాలలు నిబంధనలు పాటించట్లేదని, సరైన సదుపాయాలు లేవని, ఉన్నత విద్యా మండలి వాటిని పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి.. ఉన్నత విద్యా మండలి ఒక సలహా మండలి మాత్రమే. ఎలాంటి నిఘా లేదా పర్యవేక్షణ సంస్థ కాదు. ఒకవేళ ఏదైనా ఒక కళాశాల తప్పు చేసిందని మా దృష్టికి వస్తే.. ఆ కళాశాల ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంటే.. ఆ యూనివర్సిటీకి తెలియజేసి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తాం. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. అంతేతప్ప నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఉన్నత విద్యా మండలికి లేదు.

విద్యార్థులకు సలహా:
అభిరుచికి తగిన కోర్సులో చేరండి. శ్రద్ధతో చదివి సబ్జెక్ట్ నైపుణ్యం పొందితే ఏ కోర్సయినా భవిష్యత్ బాగుంటుంది. నిరంతర అధ్యయనం, పరిశ్రమ అవసరాలకనుగుణంగా నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకోవడం ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో అవసరం. అదేవిధంగా లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవాలి. ఈ నైపుణ్యాలు అలవర్చుకుంటే అవకాశాలకు కొదవే ఉండదు.
Published date : 11 Jul 2013 02:33PM

Photo Stories