Telangana History Qutub-Shahi Era: కుతుబ్‌షాహీల యుగ విశేషాలు.. మహమ్మద్ కులీ కుతుబ్‌షా కవితల సంకలనం దివాన్
కుతుబ్‌షాహీల యుగ విశేషాలు
భాషా సాహిత్యాలు
మహమ్మద్ కులీ కుతుబ్‌షా
ఇబ్రహీం కుతుబ్‌షా తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్‌షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి తల్లి భగీరథి. మహమ్మద్ కులీ తన ప్రేయసి అయిన భాగమతి పేరుమీద భాగ్యనగరాన్ని నిర్మించాడు. చార్మినార్ లాంటి అనేక కట్టడాలను నిర్మించాడు. ఇతడు మీర్జా మహమ్మద్ అమీన్, ముల్లా మూమిన్,మిసాక్ సుబాజ్ వలి అనే పార్సీ కవులను ఆదరించాడు. వజాహి,గవాస్సీ అనే ప్రముఖ ఉర్దూ కవులకు ఆశ్రయమిచ్చాడు. మహమ్మద్ కులీ స్వయంగా కవి, గ్రంథకర్త. ఫారసీ కవితా సంకలన కర్తయిన అలామ మీర్ మోమిన్ ఇతడి కాలంలో పీష్వా పదవిని అలంకరించాడు. పటమట సోమయాజిని ఆస్థాన కవిగా నియమించాడు. సారంగు తమ్మయ్య, కామారెడ్డిలను కులీ సన్మానించాడు. ఇత డి ఆస్థానంలో గణేశ పండితుడు కూడా ఉండేవాడు.
ఉర్దూ కవుల్లో కులీ ప్రథముడు కాకపోయినా ఆ భాషలోని రచనలు ఒక సంపుటంగా పుస్తక రూపంలో వెలువడటం ఈయనతోనే మొదలైంది. మహమ్మద్ కులీ తొలి ఉర్దూ రాజ కవి. ఇతడు పార్సీ, తెలుగు భాషల్లోనూ కవిత్వం రాశాడని భావిస్తారు. కానీ అవి అలభ్యం. మహమ్మద్ కులీ కవితల సంకలనాన్ని అతడి అల్లుడైన సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా 'దివాన్' పేరుతో వెలువరించాడు. ఇతడి కవిత్వం పర్షియన్, భారతీయ సంస్కృతుల సమ్మేళనం. కులీ కవితల్లో తెలుగు పదాలు, ఆచార వ్యవహారాలు, హోళీ, బతుకమ్మ పండుగల ప్రస్తావన ఉంది. అప్పటి వరకూ మత సంబంధంగా ఉన్న ఉర్దూ కవిత్వంలో లౌకిక భావనను ప్రవేశపెట్టిన కవుల్లో కులీ ప్రథముడు. నాటి తెలుగు, ఉర్దూ కవిత్వాల తరహాలోనే ఇతడిది ప్రధానంగా శృంగార కవిత్వం.
సారంగు తమ్మయ్య
తమ్మయ కులీ కుతుబ్‌షాకు ఆప్తుడు. గోల్కొండకు కరణీకం చేసేవాడు. అనేక కావ్యాలను రచించాడు. హరిభక్తి సుధోదయం అనే గ్రంథానికి తమ్మయ్య రాసిన వ్యాఖ్యానంలో భగీరథ పట్టణ ప్రస్తావన ఉంది. ఈ పట్టణమే భాగ్యనగరం(హైదరాబాద్). తమ్మయ్య ముఖ్య రచన 'వైజయంతీ విలాసం'. తెలుగులో వెలువడిన గొప్ప శృంగార కావ్యాల్లో ఇదొకటి. ఇందులో భక్తిని, శృంగారాన్ని మేళవించారు. నేబతి కృష్ణమంత్రి మహమ్మద్ కులీ ఆస్థానకవి. కులీకి మంచి స్నేహితుడైన ఇతడు మంత్రిగానూ వ్యవహరించాడు. ఇతడు రాజనీతి రత్నాకరం అనే గ్రంథాన్ని రాశాడు. నాటి రాజకీయ పరిస్థితులు, సాహిత్యం తదితర విషయాల గురించి ఈ గ్రంథం తెలియజేస్తోంది.
చదవండి: Telangana History Qutub-Shahi Era: తెలుగు భాషా సాహిత్యాలను ఆదరించిన కుతుబ్‌షాహీలు
దోమకొండ సంస్థానం
దోమకొండ (బిక్కనవోలు, నిజామాబాద్ జిల్లా) సంస్థానాన్ని తెలంగాణలో తొలి సంస్థానంగా భావించవచ్చు. ఈ సంస్థాన మూల పురుషుడు కాచారెడ్డి (141535). ఇతడి మునిమనవడైన ఒకటో ఎల్లారెడ్డి (150025) కాలం నుంచి ఈ సంస్థానం సాహిత్యాన్ని పోషించింది. బాలభారతం, కిరాతార్జునీయం అనే గ్రంథాలను ఎల్లారెడ్డి అంకితం తీసుకున్నాడు. అనేక మంది కవిపండితుల్ని పోషించాడు. ప్రస్తుతం వారి కావ్యాలేవి లభించడం లేదు. జంగమరెడ్డి, రెండో కామిరెడ్డి, రెండో ఎల్లారెడ్డి, రెండో మల్లారెడ్డి అనే నలుగురు ఇతడి మనవళ్లు. చివరి ముగ్గురు కృతిభర్తలు, కృతికర్తలు. ఈ ముగ్గురూ 16 శతాబ్దం ఉత్తరార్ధానికి చెందినవారు.
కామిరెడ్డి(15301600) తన సహాధ్యాయి అయిన పటమట సోమనాథ సోమయాజిని ఆస్థాన కవిగా నియమించాడు. సోమయాజి 'సూత సంహిత'ను అనువదించి కామిరెడ్డికి అంకితమిచ్చాడు. బ్రహ్మోత్తర ఖండాన్ని కామిరెడ్డి సోదరుడైన రెండో ఎల్లారెడ్డికి అంకితమిచ్చాడు. సోమయాజి గ్రంథాల ద్వారా దోమకొండ సంస్థాన విషయాలు తెలుస్తున్నాయి. రెండో ఎల్లారెడ్డి కృతికర్త కూడా. ఆయన వాసిష్ఠం, లింగపురాణం రచించాడు. కానీ అవి అలభ్యం. కామిరెడ్డి చివరి తమ్ముడైన రెండో మల్లారెడ్డి రాజకవి మల్లారెడ్డిగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఎన్నో గ్రంథాలు రచించాడు. కానీ ఆయన రాసిన షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరం, పద్మపురాణం అనే గ్రంథాలు మాత్రమే లభిస్తున్నాయి.
ఉర్దూ భాషకు స్వర్ణయుగం..
పైడిమర్రి వెంకటపతి (15701640) అనే కవి కులీకుతుబ్‌షా కాలానికి చెందినవాడు. ఇతడు హైదరాబాద్, బీదర్ పరిసర ప్రాంతాల్లో నివసించాడు. బ్రౌన్, బహజనపల్లి లాంటి వాళ్లు ఈ కవిని ప్రామాణికుడిగా భావించారు. స్కంధపురాణంలోని 11 శ్లోకాల కథను తనదైన శైలిలో వర్ణించాడు. దీన్ని 'చంద్రాంగద చరిత్ర' అనే రసవత్ప్రబంధంగా మలిచాడు. తన పూర్వీకుల మాదిరిగానే మహమ్మద్ కులీ కుతుబ్‌షా కూడా కవి పండితులను పోషించాడు. ఇతడి ఆస్థాన కవి మీర్ మోమెన్. సయ్యద్ మీర్ కుతుబుద్దీన్, సయ్యద్ కమాలుద్దీన్, మాజ్ సదరానీ తదితర పండితులు ఇతడి ఆస్థానంలో ఉండేవారు.
మహమ్మద్ కులీ కుతుబ్‌షా తర్వాత సుల్తాన్ అబ్దుల్లా కులీ కుతుబ్‌షా రాజయ్యాడు. ఇతడు సంస్కృత 'శుకసప్తతి'ని తోతినామా పేరుతో పార్సీ భాషలోకి అనువాదం చేయించాడు. దాన్నే 'సబ్‌రన్' (కామరూప కళాకథలు) పేరుతో ఉర్దూలోకి అనువదింపజేశాడు. ఇతడు ఉర్దూ భాషకు చాలా సేవ చేశాడు. ఇతడి పాలనా కాలం ఉర్దూ భాషకు స్వర్ణయుగం. ఇతడు కవిపండిత పోషకుడే కాకుండా స్వయంగా కవి. అబ్దుల్లా పేరుతో కవితలు వెలువరించాడు. ఇతడి ఆస్థానంలో అలామీ మీర్ మజీదుద్దీన్, మౌలానా రౌనఖీ మొదలైన ఎనిమిది మంది కవి పండితులుండేవారు. గవాసీ ఇబిన్ నిషాత్ లాంటి గొప్పకవులను ఇతడు ఆదరించాడు. గవాసి 'తోతినామా' అనే కథలు రాశాడు. తబీయ అనే కవి బహురావగుల్ అనే మనోరంజకమైన కథను రాశాడు. అబ్దుల్లా కులీ కుతుబ్‌షా ఆస్థానంలో తులసీమూర్తి లాంటి తెలుగు కవులు కూడా ఉండేవారు. క్షేత్రయ్య ఈ రాజును దర్శించాడు. అబ్దుల్లా పార్సీ, తెలుగు, మరాఠీ భాషల్లో కవిత్వం చెప్పేవాడు.
హరివాసర మహాత్మ్యం రాసిన మరింగంటి వెంకట (ప్రథమ) నరసింహాచార్యులు, శశిబిందు చరిత్రం రచయిత చరిగొండ నరసింహకవి, కూర్మపురాణాన్ని రచించిన రాజలింగ కవి ఈ కాలానికి చెందినవారే. బమ్మెర కేసకవి మల్లకవి, వజ్రాభ్యుదయాన్ని రాసిన కోననారాయణ, రాజేశ్వర విలాసం రచయిత పిల్లలమర్రి వెంకటపతి, చెన్నబసవ పురాణాన్ని రచించిన గోపతి లింగకవి తదితరులు కూడా ఈ కాలానికి చెందినవారే. ఓరుగల్లుకు చెందిన కాసెసర్వప్ప (1600) ఏకామ్రనాథుడి 'ప్రతాపరుద్ర చరిత్ర'ను అనుసరించి ద్విపదలో 'సిద్దేశ్వర చరిత్ర' రాశాడు. ఈ గ్రంథాన్ని వ్యవహారిక భాషలో రచించాడు.
చదవండి: TS History for Group 1 & 2: తెలంగాణ చరిత్ర... తొలి కాకతీయులు అవలంభించిన మతం?
ఎలకూచి బాలసరస్వతి
తెలంగాణ కుతుబ్‌షాహీల పాలనలో ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాలు ఇతర రాజుల చేతులు మారుతూ వచ్చాయి. సురభి మాధవరాయలు విజయనగర అళియరాయల నుంచి జటప్రోలును(కొల్లాపూర్) కానుకగా పొందాడు. తర్వాత అతడి కుమారులు అబ్దుల్లా కుతుబ్‌షా నుంచి సనదు రూపంలో జటప్రోలు సంస్థానాన్ని పొందారు. రేచర్ల పద్మనాయకులైన వీరికి సురభి వంశనామమైంది. ఈ వంశానికి చెందిన సురభి మాధవరాయలు(162070) చంద్రికా పరిణయమనే ప్రౌఢ కావ్యాన్ని రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి ఎలకూచి బాలసరస్వతి (15701650). ఆంధ్రశబ్ద చింతామణి ద్వారా ఇతడి పేరు చర్చనీయాంశమైంది. సంస్కృతంలో రాసిన ఈ తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం నన్నయ రచనా? కాదా? బాలసరస్వతే రాసి నన్నయ పేరు పెట్టాడా? అనే విషయాలు చర్చనీయమయ్యాయి. మాధవరాయలతోపాటు ఇతడు కూడా 'చంద్రికా పరిణయం' రాశాడు. కానీ ఈ రెండింటిలో వేర్వేరు కథలున్నాయి. ఇతడు భర్తృహరి సంస్కృతంలో రాసిన శృంగార, నీతి, వైరాగ్య శతకాలను సుభాషిత రత్నావళి పేరుతో అనువదించాడు. మాధవరాయల తండ్రయిన మల్లభూపాలుడికి సుభాషిత రత్నావళిని అంకితం చేశాడు. ఇది తొలి అనువాదం. 'యాదవ రాఘవ పాండవీయం' అనే త్య్రర్థి కావ్యంతో పాటు మొత్తం పది గ్రంథాలను ఇతడు రచించాడు. ఇతడి గ్రంథాల వల్ల జటప్రోలు, పర్తియాల (జూపల్లి వారు) సంస్థానాల విశేషాలు తెలుస్తున్నాయి.
బాలసరస్వతి ఆంధ్రశబ్ద చింతామణికి వ్యాఖ్య రాసిన కొద్ది కాలానికే కాకునూరి అప్పకవి అదే గ్రంథానికి భాష్యం లాంటి ప్రసిద్ధమైన అప్పకవీయం రాశాడు. అప్పకవి తెలంగాణ వాడేనని బూర్గుల రామకృష్ణారావు నిరూపించారు. అప్పకవీయం లక్షణ గ్రంథమైనా, సందర్భాన్ని బట్టి 'నిజదేశంబుల వేషభాషలపయిన్ని త్యాభిమానస్థులై ప్రజమెచ్చన్' అని ప్రాంతాభిమానాన్ని చాటాడు. సాధ్వీజనధర్మం (ద్విపదకావ్యం), అనంత వ్రతకల్పం(కావ్యం), శ్రీశైలమల్లికార్జునుడి మీద శతకం, అంబికావాదం (యక్షగానం), కవి కల్పకం (లక్షణ గ్రంథం) మొదలైన ఇతర గ్రంథాలు కూడా అప్పకవి రచించాడు. కానీ ఇవి లభ్యం కావడం లేదు.
దేవరకొండ పాలకుడైన పొనుగోటి జగన్నాథరాయలు 'కుముదవల్లీ విలాసం' రచించాడు. ఇందులోని ఇతివృత్తం భక్తరామదాసు జీవితానికి దగ్గరగా ఉంటుంది.
కుతుబ్‌షాహి వంశంలో చివరి రాజులైన అబ్దుల్లా కుతుబ్‌షా (162672), అబుల్ హసన్ తానీషా (167287) వద్ద అక్కన్న, మాదన్న అధికారులుగా పనిచేశారు. వారి మేనల్లుడైన కంచర్ల గోపన్న (భక్తరామదాసు) భద్రాచలం తహశీల్దార్ అయ్యాడు. తొలి సంకీర్తనాచార్యుల్లో ఒకడిగా రామదాసు ప్రసిద్ధి చెందాడు. ఇతడి జీవితం గురించి యక్షగానం వచ్చింది. దీన్ని బట్టి రామదాసు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఇతడి కీర్తనల్లో పాండిత్య ప్రకర్ష ఉండదు. అవి ఆర్తితో, సహజభక్తి భావావేశంతో అప్రయత్నంగా వచ్చాయి. దేశీయ గేయ రీతులను పుణికి పుచ్చుకున్నాయి. ఇతడు రాసిన 'దాశరథి శతకం' కూడా ప్రసిద్ధి చెందింది. భక్తరామదాసు పేరు వినగానే అబుల్ హసన్ తానీషా పేరు స్ఫురిస్తుంది. రామదాసును జైల్లో పెట్టిన నిర్దయుడిగానే ఇతడి గురించి తెలుసు. కానీ ఇతడు రసహృదయం ఉన్న కవి. ఇతడు పార్సీ, తెలుగు, మరాఠీ భాషల్లో కవిత్వం చెప్పేవాడు. తానీషా ఆస్థానంలో లతీఫ్, షాహినూరి, మీర్జాగులాం అలీ లాంటి ప్రసిద్ధ కవులుండేవారు. ఇతడి కాలంలో వజ్జి, గవాసీ తదితర ఉర్దూ కవులు తమ కవిత్వం ద్వారా ఉర్దూ భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ఉర్దూ రాజభాషగా పరిణతి చెందింది. అక్కన్న, మాదన్న, లింగన్నలకు ముఖ్య పదవులిచ్చాడు. పరమత సహనం చూపి ఉదార స్వభావిగా పేరొందాడు.
అష్టదిగ్గజాల్లో ఒకడైన తెనాలి రామలింగడు (కృష్ణుడు) కాకుండా మరో తెనాలి రామలింగకవి (166686) ఉన్నాడు. విశ్వ బ్రాహ్మణుడైన ఇతడు అక్కన్న, మాదన్నల వద్ద ఆశ్రయం పొందాడు. ఇతడు ధీరజనమనో విరాజితం (పరిమళ చోళచరిత్ర) అనే కావ్యాన్ని రాశాడు. విశ్వబ్రాహ్మణులకు జరిగిన అన్యాయాలే ఈ ప్రబంధంలోని కథావస్తువు.
చదవండి: Telangana History for Groups: కలకాలం నిలిచి ఉండే కాకతీయుల ప్రాభవం
ఇతర కవులు..
పెన్గలూరి వెంకటాద్రి రామోదాహరణం, భువన మోహినీ విలాసం అనే గ్రంథాలను రచించాడు. పదిహేడో శతాబ్దికి చెందిన విశ్వనాథయ్య సిద్దేశ్వర పురాణం అనే ద్విపద రాశాడు. అన్నంభట్టు తర్క సంగ్రహాన్ని, కర్పూరం కృష్ణమాచార్యులు భగవద్గీత ద్విపదను రచించారు. అత్తాను రామానుజాచార్యుడు శ్రీ రుక్మిణీకురవంజి అనే గ్రంథాన్ని రాయగా, పూడూరి కృష్ణయామాత్యుడు భగవద్గీత యథాశ్లోకానువాదం చేశాడు. శ్రీనాథుని వెంకటరామయ్య అశ్వరాయ చరిత్ర రాశాడు. అన్నమయ్య తర్వాత ఎక్కువ కీర్తనలు (3476) రాసిన ముష్టిపల్లి వేంకటభూపాలుడు ఈ కాలానికి చెందినవాడే. లక్ష్మీ శకవి, కాండ్రవేటి రామానుజాచార్యులు, ఎడపాటి ఎర్రన, సింహాద్రి వెంకటాచార్యులు, మరింగంటి వేంకట (ద్వితీయ) నరసింహాచార్యులు (16501720), సురభి నర్సింగరావు, బోరవెల్లి కృష్ణప్ప కూడా ఈ కాలానికి చెందిన కవులే. వీరే కాకుండా కుతుబ్‌షాహీల కాలానికి చెందిన ఎంతో మంది కవులు తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.
రచయితలు | రచనలు |
సారంగు తమ్మయ్య | వైజయంతీ విలాసం |
నేబతి కృష్ణమంత్రి | రాజనీతి రత్నాకరం |
మరింగంటి వెంకట (ప్రథమ) నరసింహాచార్యులు | హరివాసర మహాత్మ్యం |
కాసెసర్వప్ప | సిద్దేశ్వర చరిత్ర |
సురభి మాధవరాయలు | చంద్రికా పరిణయం (కావ్యం) |
ఎలకూచి బాలసరస్వతి | యాదవ రాఘవ పాండవీయం |
పొనుగోటి జగన్నాథరాయలు | కుముదవల్లీ విలాసం |
గవాసి | తోతినామా (అనువాద కథలు) |
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 'తెలంగాణ చరిత్ర' రచయిత