Skip to main content

Science Study Material and Bits for Competitive Exams : పోటీ ప‌రీక్ష‌కు ఉప‌యోగ‌ప‌డే సైన్స్‌.. సమాచార ప్రసారానికి తోడ్పడే వాతావరణ పొర ఏది?

భూమిపై ఉన్న ఘన, ద్రవ, వాయు, జీవ సమ్మేళనాన్ని పర్యావరణం అంటారు. జీవుల మనుగడకు అవసరమైన గాలి, నీరు, ఆహారం పూర్తిగా కలుషితమవుతున్నాయి. సహజ వనరులు తరిగిపోతుండటంతో డిమాండ్‌ పెరుగుతోంది.
Science Study Material for Competitive Exams

ఫలితంగా వాటి దుర్వినియోగం కూడా అధికమై పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది.  పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల ఆర్థిక స్థితిగతులపై పర్యావరణ నష్ట ప్రభావం తీవ్రంగా ఉంది. వంట చెరకు లభ్యత, పశుగ్రాసం, భూగర్భ, ఉపరితల వనరులు తగ్గి గ్రామీణ  ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఒక ప్రాంత సుస్థిరాభివృద్ధి పర్యావరణ పరిరక్షణపై ఆధారపడి ఉంటుంది.

పర్యావరణ విభాగాలు
    పర్యావరణాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి..
    1. వాతావరణం(అట్మాస్పియర్‌)
    2. శిలావరణం(లిథోస్పియర్‌)
    3. జలావరణం(హైడ్రోస్పియర్‌)
    4. జీవావరణం(బయోస్పియర్‌)
వాతావరణం (అట్మాస్పియర్‌) 
భూమి ఉపరితలంపై ఉన్న వాయు పొరల నిర్మాణమే వాతావరణం లేదా అట్మాస్పియర్‌. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇది భూమిపై ఉంటుంది. ఇందులో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్‌ అనే నాలుగు విభాగాలున్నాయి. రెండు పొరల మధ్య హద్దుగా ఉండే ప్రాంతాన్ని ‘పాజ్‌’ అంటారు. ఉదాహరణకు.. స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్‌ మధ్యనున్న ప్రాంతాన్ని స్ట్రాటోపాజ్‌ అంటారు.
Polytechnic new 2courses news: ఇకనుంచి పాలిటెక్నిక్‌లో రెండు కొత్త కోర్సులు
ట్రోపోస్పియర్‌ 

ఇది భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర. ఈ పొర ధ్రువాల వద్ద 6–8 కి.మీ. ఎత్తు వరకు, భూమధ్యరేఖ వద్ద 18 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. పైకి వెళ్లేకొద్దీ ప్రతి కిలోమీటరుకు ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల చొప్పున తగ్గుతుంది. సుమారు 12 కి.మీ. ఎత్తు వద్ద ట్రోపోపాస్‌ అనే పరివర్తన ప్రాంతం మొదలవుతుంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయి.

స్ట్రాటోస్పియర్‌
వాతావరణంలోని రెండో పొర అయిన స్ట్రాటోస్పియర్, ట్రోపోపాజ్‌ నుంచి మొదలై 50 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 60 డిగ్రీలుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో గంటకు 320 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. స్ట్రాటోస్పియర్‌లో ఓజోన్‌ అధిక మోతాదులో ఉండటం వల్ల దీన్ని ఓజోనోస్పియర్‌ అని కూడా అంటారు. హానికర అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరకుండా ఈ పొర అడ్డుకుంటుంది.

మీసోస్పియర్‌
స్ట్రాటోపాజ్‌ నుంచి దాదాపు 80 కి.మీ. ఎత్తు వరకు ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి. మీసోస్పియర్‌ పైనున్న ప్రాంతం వాతావరణంలోని అన్ని భాగాల కంటే అత్యంత శీతలంగా ఉంటుంది. ఉల్కాపాతం భూమిని చేరకపోవడానికి మీసోస్పియరే కారణం.
Students Free DSC Coaching: విద్యార్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌
థర్మోస్పియర్‌
ఇది మీసోపాజ్‌ నుంచి మొదలవుతుంది. థర్మోస్పియర్‌ను ఐనోస్పియర్, ఎక్సోస్పియర్‌లుగా విభజిస్తారు. కింది భాగమైన ఐనోస్పియర్‌ భూవాతావరణంలో 100–120 కి.మీ. ఎత్తు నుంచి 550 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఐనోస్పియర్‌లో నత్రజని, ఆక్సిజన్‌ లాంటి మూలకాల పరమాణువులు సౌర వికిరణాన్ని గ్రహించి అయానీకరణం చెందుతాయి. భూ ఉపరితలం నుంచి వచ్చే రేడియో తరంగాలను పరావర్తనం చేసి సమాచార ప్రసారానికి ఐనోస్పియర్‌ తోడ్పడుతోంది. బలమైన సౌరగాలులు వీచినప్పుడు ఐనోస్పియర్‌ సంఘటనం మారే ప్రమాదం ఉంది. ఫలితంగా సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయి.

శిలావరణం
భూమిపై ఉన్న ఖండాలన్నింటినీ కలిపి శిలావరణం అంటారు. భూమి ఉపరితలం మొత్తం కొన్ని ప్రత్యేక ఫలకాలపై అమరి ఉంటుంది. ఈ ఫలకాల నిర్మాణం, వాటి కదలికలను ప్లేట్‌ టెక్టానిక్స్‌ సిద్ధాంతం వివరిస్తుంది. 200 మిలియన్‌ సంవత్సరాల కిందట భూభాగం మొత్తం ఒకే చోట కలిసి ఉండేది. దీన్ని పాంజియా అని పిలుస్తారు. 50 మిలియన్‌ ఏళ్ల క్రితం ఇది రెండు భాగాలుగా చీలింది. ఉత్తరంగా ఉన్న భాగాన్ని లారెన్షియా అని, దక్షిణ దిశగా విడిపోయిన ప్రాంతాన్ని గోండ్వానా అని పిలుస్తారు. ఇవి మరింత దూరం కదిలి ప్రస్తుత ఖండాలు ఏర్పడ్డాయి. ఖండ చలన సిద్ధాంతం.. ఖండాల నిర్మాణం, వాటి కదలికలను వివరిస్తుంది. భూమి ఉపరితలం నుంచి లోపలి వైపు మూడు భాగాలుంటాయి. భూపటలం(క్రస్ట్‌), భూప్రావారం (మాంటెల్‌), భూకేంద్రం(కోర్‌). భూపటలం ఉపరితలం నుంచి సుమారు 100 కి.మీ. లోతు వరకు ఉంటుంది. భూపటల ఉపరితలంపై వదులుగా ఉండే పొరలను మృత్తిక లేదా నేల అంటారు. 100 కి.మీ. లోతు నుంచి 2900 కి.మీ. లోతు వరకు భూప్రావారం(మాంటెల్‌) అనే పొర ఉంటుంది. దీని తర్వాత మధ్యభాగం భూకేంద్రం(కోర్‌). దీనిలో బాహ్యకేంద్రం, అంతర కేంద్రం అనే రెండు భాగాలు ఉంటాయి. బాహ్యకేంద్రం 2900 కి.మీ. నుంచి 5100 కి.మీ. వరకు ఉంటుంది. అంతర కేంద్రం 5100 కి.మీ. నుంచి సుమారు 6378 కి.మీ. వరకు ఉంటుంది.
New Scheme: వైద్య పరికరాల తయారీకి కొత్త పథకం
జలావరణం
భూమిపై వివిధ రూపాల్లో ఉన్న మొత్తం నీటిని జలావరణం లేదా హైడ్రోస్పియర్‌ అంటారు. పూర్వం సముద్ర జలమంతా పూర్తిగా సాదుజలంగా ఉండేది. కొన్ని మిలియన్‌ సంవత్సరాల నుంచి నేల క్రమక్షయం జరిగి ఖనిజాలు సముద్రంలోకి చేరడంతో లవణీయత పెరిగింది. భూమి ఉపరితలం 75 శాతం నీటితో నిండి ఉంది. భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97.5 శాతం సముద్రాల్లోనే ఉంది.  మిగతా 2.5 శాతం నీరు సాదుజలం లేదా మంచి నీరు. మంచి నీటిలో 0.3 శాతం నదులు, సరస్సుల్లో ఉంది. భూగర్భ జలంగా 30.8 శాతం, హిమనీనదాల రూపంలో 68.9 శాతం ఉంది.
భూమిపై నీటి విస్తరణను జల వలయం నిర్ధారిస్తుంది. నీరు ఆవిరై మేఘాల రూపంలోకి సాంద్రీకరణం చెంది ఆ తర్వాత మంచు,  వర్షం రూపంలో భూమిని చేరుతుంది. ఇలా చేరిన నీటిలో కొద్ది మొత్తం భూగర్భంలోకి ఇంకుతుంది. మిగతాది నదులు, సముద్రాల్లోకి చేరుతుంది. ధ్రువ ప్రాంతాల్లో శీతాకాలంలో ఈ నీరు గడ్డకట్టి వేసవిలో కరుగుతుంది. ఈ రకమైన నిరంతర నీటి ఆవిరి కదలికలను జలవలయం అంటారు.

జీవావరణం
భూమిపై ఉన్న జీవులు, జీవం విస్తరించిన ప్రాంతాలన్నింటినీ కలిపి బయోస్పియర్‌ అంటారు. భూమిపై సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల క్రితం జీవం ఆవిర్భవించింది. అనేక సిద్ధాంతాలు భూమిపై జీవం ఆవిర్భవించే విధానాన్ని వివరిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...
1.    ప్రత్యేక సృష్టి సిద్ధాంతం: దీని ప్రకారం భూమిపై జీవులను దేవుడు సృష్టించాడు. ఈ సిద్ధాంతానికి తగిన నిదర్శనాలు లేని కారణంగా దీన్ని నమ్మకంగానే భావిస్తారు.
2.    పాన్‌స్పెర్శియ సిద్ధాంతం: దీని ప్రకారం భూమిపై జీవులు ఆవిర్భవించలేదు. భూమి ఆవల నుంచి గ్రహశకలాలు లేదా గ్రహాంతర వాసుల ద్వారా  భూమిపైకి చేరి ఆ తర్వాత పరిణామ క్రమంలో మార్పు చెందాయి.
3.    జీవ ఆవిర్భావ సిద్ధాంతం: అలెగ్జాండర్‌ ఇవనోవిచ్‌ ఒపారిన్, జె.బి.ఎస్‌. హాల్డెన్‌ అనే శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం భూమిపై జీవ ఆవిర్భావానికి ముందు జీవ రసాయనాలు ఆవిర్భవించాయి. ఈ జీవ రసాయనాల చర్యల ద్వారా భూమిపై పూర్వ జీవకణాలు ఏర్పడ్డాయి. తర్వాత వాటి నుంచి సంపూర్ణ జీవకణాలు ఆవిర్భవించాయి. భూమిపై ఆవిర్భవించిన తొలి తరం జీవులన్నీ అవాయు జీవులు. ఇలాంటి కొన్ని అవాయు జీవులు నీటి అణువులను విచ్ఛిన్నం చేయడంతో గాల్లోకి క్రమంగా ఆక్సిజన్‌ విడుదలైంది. తొలుత కేంద్రక పూర్వ జీవులు ఏర్పడి ఆ తర్వాత నిజ కేంద్రక జీవులు ఆవిర్భవించాయి.
Sreejesh: భార‌త హాకీ గోల్ కీప‌ర్ శ్రీజేష్‌కు రూ.2 కోట్ల భారీ నజరానా..
గతంలో అడిగిన ప్రశ్నలు

1.    ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం?
(గ్రూప్‌–2, 2008)
ఎ) ఆహార గొలుసు    బి) ఇకలాజికల్‌ నిచే
సి) ఎకోటోన్‌    డి) ఏదీకాదు
2.    పాన్‌స్పెర్శియ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?    (2004 గ్రూప్‌–1)
ఎ) అర్హీనియస్‌    బి) ఒపారిన్‌
సి) స్వారెజ్‌    డి) ఎవరూ కాదు
3.    తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే జీవులను ఏమంటారు?
(గ్రూప్‌–1 2010 రీ ఎగ్జామ్‌)
ఎ) స్టోనోథర్మల్‌    బి) సైక్రోఫైల్స్‌
సి) యూరిథర్మల్‌    డి) పైకిలో థర్మల్‌
4.    భారతదేశంలోని విశిష్టమైన స్త్రీ పర్యావరణ వేత్త (ఎన్విరాన్‌మెంటలిస్ట్‌) ఎవరు?            (గ్రూప్‌–1, 1999)
ఎ) మేధాపాట్కర్‌       బి) మమతా బెనర్జీ
సి) సరోజిని మహర్షి   డి) మార్గరెట్‌ ఆల్వా
5.    కింది వాటిలో ఫ్లోటింగ్‌ నేషనల్‌ పార్కు ? (సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2015)
ఎ) కజిరంగ జాతీయ పార్కు
బి) కైబుల్‌ లామ్జావు జాతీయ పార్కు
సి) కార్బెట్‌ జాతీయ పార్కు
డి) ఏదీకాదు
సమాధానాలు
1) ఎ; 2) ఎ; 3) ఎ; 4) ఎ; 5) బి.
DSC Free Coaching: ఉచితంగా డీఎస్సీ కోచింగ్‌.. దరఖాస్తు చేసుకోండి
మాదిరి ప్రశ్నలు
1.    ఓజోన్‌ పొర సంరక్షణకు ఏర్పాటైన 
అంతర్జాతీయ ఒప్పందం?
ఎ) క్యోటో ఒప్పందం
బి) మాంట్రియాల్‌ ఒప్పందం
సి) స్టాక్‌హోమ్‌ ఒప్పందం
డి) రామ్సార్‌ ఒప్పందం
2.    కింది వాటిలో ఓజోన్‌ పొరను 
దెబ్బతీసేది?
ఎ) క్లోరోఫ్లోరో కార్బన్లు బి) హాలోన్లు    
సి) మిథైల్‌ బ్రోమైడ్‌      డి) పైవన్నీ
3.    చిప్కో ఉద్యమం ఏ ప్రాంతంలో 
ప్రారంభమైంది?
ఎ) ఉత్తరాంచల్‌    బి) కర్ణాటక
సి) బిహార్‌    డి) మధ్యప్రదేశ్‌
4.    చిప్కో ఉద్యమంలో పాల్గొన్నవారు?
ఎ) సుందర్‌లాల్‌ బహుగుణ
బి) చండీ ప్రసాద్‌ భట్‌
సి) సుదేశాదేవి    డి) పైవారందరూ
5.    సైలెంట్‌ స్ప్రింగ్‌ అనే గ్రంథాన్ని రచించి అమెరికాలో డి.డి.టి.కి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించింది ఎవరు?
ఎ) జాన్‌ ముయర్‌
బి) బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌
సి) రాచెల్‌ కార్సన్‌    డి) ఎవరూ కాదు
6.    ‘ఎ శాండ్‌ కౌంటీ ఆల్మనాక్‌’ 
గ్రంథ రచయిత ఎవరు?
ఎ) డేవిడ్‌ హెన్రీ    
బి) ఆల్డో లియోపోల్డ్‌
సి) జాన్‌ ముయర్‌
డి) బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌
7.    అటవీ హక్కు చట్టం ఎప్పుడు 
Ap Govt Job Notification: ఏపీలో 997 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. వేతనం నెలకు రూ. 70వేలు
అమల్లోకి వచ్చింది?
ఎ) 2006    బి) 2007
సి) 2008    డి) 2009
8.    1986లో అమల్లోకి వచ్చిన చట్టం?
ఎ) జల కాలుష్య నివారణ,
నియంత్రణ చట్టం
బి) వాయు కాలుష్య నివారణ,
నియంత్రణ చట్టం
సి) పర్యావరణ పరిరక్షణ చట్టం
డి) జల కాలుష్య సుంకం చట్టం
9.    జీవవైవిధ్య చట్టాన్ని అమలు చేసే నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది?
ఎ) చెన్నై, తమిళనాడు    
బి) బెంగళూరు, కర్ణాటక
సి) హైదరాబాద్‌, తెలంగాణ
డి) తిరువనంతపురం, కేరళ
10.    భూమిపై ఆవిర్భవించిన మొదటి
పూర్వకణానికి ఒపారిన్‌ ఇచ్చిన పేరు?
ఎ) ప్రోటినాయిడ్‌    బి) సింబయాంట్‌
సి) కొయసెర్వేట్‌    డి) ప్రోక్వారియోట్‌
సమాధానాలు
1) బి; 2) డి; 3) ఎ; 4) డి;  5) సి; 
6) బి; 7) ఎ; 8) సి; 9) ఎ; 10) సి.
National Space Day 2024: రేపు జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

Published date : 23 Aug 2024 08:25AM

Photo Stories