Indian History Study Material : గ్రూప్1 & 2 పరీక్షలకు ఉపయోగపడేలా.. ఇండియన్ హిస్టరీ.. ‘దేవానాం ప్రియ’ అనేది ఎవరి బిరుదు?
జైనమతం (క్రీ.పూ. 540–468)
జైనమత స్థాపకుడు రుషభనాథుడు. జైన ప్రవక్తలను ‘తీర్థంకరులు’ అంటారు. మొత్తం 24 మంది తీర్థంకరులు ఉండేవారు. రుషభనాథుడు మొదటి తీర్థంకరుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. చివరివారైన 24వ తీర్థంకరుడు మహావీరుడు.
మహావీరుడు క్రీ.పూ. 540లో వైశాలి నగరానికి సమీపాన ఉన్న ‘కుంద’ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సిద్ధార్థుడు, వైశాలి. మహావీరుడి భార్య యశోధ, కుమార్తె ప్రియదర్శిని. ఈయన జీవిత సుఖాలతో తృప్తి చెందక కొంత కాలం దిగంబరుడిగా కఠోర నియమాలను పాటించి తపస్సు చేశాడు. ‘జృంబిక’ గ్రామంలో పరిపూర్ణజ్ఞానాన్ని పొందిన తర్వాత ‘మహావీరుడు’గా పేరు పొందాడు. ఈయన ప్రబోధించిన సరైన క్రియ, సరైన విశ్వాసం, సరైన జ్ఞానం అనే మూడు అంశాలను ‘త్రిరత్నాలు’గా పేర్కొంటారు. పంచవ్రతాల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని మహావీరుడు ప్రవచించాడు. ఈయన తన 72వ ఏట క్రీ.పూ. 468లో ‘పావాపురి’ వద్ద నిర్యాణం చెందాడు.
Job Fair For Freshers: 1500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు ఇవే
జైనులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఉపవాసాలు చేసి శరీరాన్ని కృశింపజేసుకొని మరణించడాన్ని ‘సల్లేఖన వ్రతం’గా పేర్కొంటారు. చాలా మంది రాజులు జైనమతాన్ని ఆదరించి అభివృద్ధి చేశారు. చంద్రగుప్త మౌర్యుడు ఈ మతాన్ని అనుసరించి, అన్నింటినీ త్యజించి శ్రావణ బెళగొళలో మరణించాడు. జైనులు ప్రజల భాష అయిన ప్రాకృతంలో తమ సందేశాన్ని ప్రచారం చేశారు. చంద్రగుప్తుడి కాలంలో పాటలీపుత్రంలో స్థూలభద్ర ఆధ్వర్యంలో జైనమత మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జైనమత బోధనలను 12 అంగాలుగా విభజించి క్రోడీకరించారు. కొంతకాలం తర్వాత వస్త్రధారణ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తడం వల్ల జైనమతం దిగంబర, శ్వేతాంబర శాఖలుగా చీలిపోయింది. రెండో జైన సంగీతి క్రీ.శ. 512లో వల్లభి (గుజరాత్)లో దేవార్థి క్షమపణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ‘గంధర్వ’ అనే పవిత్ర గ్రంథాలను క్రమానుసారంగా రాశారు. జైనులు శిల్పకళను అభివృద్ధి చేశారు.
క్రీ.పూ. 4వ శతాబ్దం చివరి రోజుల్లో గంగా లోయ ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చాలామంది జైన గురువులు, సన్యాసులు దక్షిణ భారతదేశానికి తరలివెళ్లారు. ముఖ్యంగా శ్రావణ బెళగొళ ప్రాంతానికి ఎక్కువ మంది వచ్చారు. దక్షిణానికి వచ్చినవారిలో భద్రబాహుడు, చంద్రగుప్త మౌర్యుడు లాంటి ప్రముఖులు ఉన్నారు. మగధలో ఉన్న జైనులు శ్వేతాంబరులయ్యారు. వీరికి గురువు స్థూల బాహుడు.
జైనమత మహత్వ సూత్రాలు
1) అహింస
2) సత్యభాషణ
3) అపరిగ్రహం (దొంగిలించకపోవడం)
4) అస్తేయం (ఆస్తి లేకుండా ఉండటం)
5) బ్రహ్మచర్యం
వీటిలో మొదటి నాలుగు సూత్రాలు మహావీరుడి ముందు కాలం నుంచే అమల్లో ఉన్నాయి. మహావీరుడు బ్రహ్మచర్యాన్ని పంచమ సూత్రంగా కలిపాడు.
PG Diploma Courses : నిమ్స్‌లో పీజీ డిప్లొమా కోర్సులు.. ప్రవేశానికి దరఖాస్తులు..
జైనుల ప్రధాన కట్టడాలు
ఠి అబూ పర్వతం–మహావీరుడి దేవాలయం
ఠి శ్రావణ బెళగొళ–గోమఠేశ్వరుడి విగ్రహం
ఠి అజంతా, ఎల్లోరా, ఉదయగిరి గుహలు
ఠి బాదామి – జైన దేవాలయాలు
అజీవికులు: గోశాల మస్కారిపుత్రుడు అజీవిక మతశాఖను స్థాపించారు. ఇది జైన మత సిద్ధాంతాలకు సన్నిహితంగా ఉంది. అశోకుడి కాలంలో ఇది బాగా వ్యాప్తి చెందింది.
హర్యాంక వంశం (క్రీ.పూ.542–490)
క్రీ.పూ. 542–490 మధ్య కాలంలో రాజకీయంగా అనేక పరిణామాలు సంభవించాయి. ఉత్తర భారతదేశంలో మహాజనపదాలుగా పేర్కొనే పదహారు పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటినే ‘షోడశ మహాజనపదాలు’ అంటారు. వీటిలో మగధ రాజ్యం శక్తిమంతమైంది. గిరివజ్రం, పాటలీపుత్రం దీని రాజధాని నగరాలు. మొదటగా దీన్ని బృహద్రధ వంశస్థులు పాలించారు. తర్వాత హర్యాంక వంశస్థులు పరిపాలించారు. వీరిలో బింబిసారుడు గొప్పవాడు. ఈయన తర్వాత అజాతశత్రువు పాలించాడు.
అజాతశత్రువు పాలనా కాలం క్రీ.పూ. 495–464. ఈయన హర్యాంక వంశ స్థాపకులైన బింబిసారుడి కుమారుడు. అజాతశత్రువు భార్య వజీరాదేవి. ఈమె కోసలరాజు ప్రసేనజిత్తు కుమార్తె. అజాతశత్రువు వజ్జి గణరాజ్య సమాఖ్యతో 16 ఏళ్లు యుద్ధం చేసి జయించాడు. కంటక శిల, కంటక బోధన అనే రాళ్లు, విసరు రథాలను యుద్ధంలో ఉపయోగించి శత్రురాజులను జయించాడు. ఈయన పాటలీపుత్రాన్ని నిర్మించాడు. ఈయనకు కుణిక అనే పేరు కూడా ఉంది. ఉదయనుడు ఈయన వారసుడు. అజాతశత్రువు గౌతమబుద్ధుడి సమకాలీకుడు.
హర్యాంక వంశం తర్వాత మగధను శిశునాగవంశం (క్రీ.పూ. 490–458) పాలించింది. వీరి తర్వాత నంద వంశస్థులు రాజ్యానికి వచ్చారు. నంద వంశంలో మహాపద్మనందుడు గొప్పరాజుగా పేరు పొందాడు. ఈయనకు ‘మహాక్షత్రాంతక’ అనే బిరుదు ఉంది. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సహాయంతో నందవంశాన్ని నిర్మూలించి మౌర్యవంశాన్ని స్థాపించాడు.
NIT Admissions : నిట్‌లో బీఎస్సీ–బీఈడీ ఇంటిగ్రేటెడ్ ప్రవేశాలు.. కోర్సు వివరాలు..
విదేశీ దండయాత్రలు (క్రీ.పూ. 327–325)
భారతదేశంలో రాజకీయ అనైక్యత కారణంగా విదేశీయులు దండయాత్రలు ప్రారంభించారు. పారశీకులు మొదటగా భారత్‌పై దండయాత్ర చేశారు. వీరిలో ‘సైరస్’, ‘డేరియస్’ గొప్పవారు. పారశీక చక్రవర్తి ‘సైరస్’ గాంధారను జయించారు. వీరి తర్వాత గ్రీకులు భారతదేశంపై దండెత్తారు. గ్రీకు రాజ్యాల్లో అగ్రగామి అయిన మాసిడోనియా చక్రవర్తి అలెగ్జాండర్ విశ్వవిజేతగా పేరు పొందారు. గ్రీకు దండయాత్రల ఫలితంగా భారతదేశానికి, యూరప్ దేశాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. భారతీయులు గ్రీకుల నుంచి నాణేల ముద్రణ; శిల్ప, ఖగోళ శాస్త్రాలను నేర్చుకున్నారు.
మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ. 322)
మౌర్యుల చరిత్రకు ఆధారాలు: విదేశీ గ్రంథాలు: మెగస్తనీస్ (గ్రీకు రాయబారి) రాసిన ‘ఇండికా’, స్ట్రాబో, డియోడరస్, ఏరియస్, ప్లీనీ రచనలు మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.
సాహిత్య ఆధారాలు: కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’, విశాఖదత్తుడి ‘ముద్రారాక్షసం’.
మత సంబంధ ఆధారాలు: పురాణాలు, బౌద్ధుల దివ్య వదన, అశోకవదన, శ్రీలంకకు సంబంధించి న దీపవంశ, మహావంశ, జైనులకు సంబంధించిన పరిశిష్ట పర్వణ్ మొదలైనవి కూడా మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి దోహదపడుతున్నాయి.
వీటితో పాటు శిలా శాసనాలు, రాతి చెక్కడాలు, గుహలు కూడా మౌర్యుల చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి.
చంద్రగుప్త మౌర్యుడు: ఈయన మౌర్యవంశ స్థాపకుడు. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో కర్ణాటకలోని శ్రావణ బెళగొళలో జీవించాడు. ‘సల్లేఖన వ్రతం’ ద్వారా మరణించాడు. ఈయన క్రీ.పూ. 303లో ‘సెల్యుకస్ నికే టర్’తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మౌర్య సామ్రాజ్యానికి ఎక్కువ ప్రయోజనం కలిగింది.
బిందుసారుడు (క్రీ.పూ. 298–273): ఈయన చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు. బిందుసారుడికి ‘అమిత్రఘాత’, ‘సింహసేనుడు’ అనే బిరుదులు ఉన్నాయి. ఈయన రాజ్యాన్ని మైసూరు వరకు విస్తరించాడు. చాణక్యుడు కొంత కాలంపాటు బిందుసారుడికి కూడా మహామంత్రిగా ఉండి ఆయనకు రాజ్య రక్షణలో సాయపడినట్లుగా టిబెట్ చరిత్రకారుడు తారానాథ్ పేర్కొన్నారు. బిందుసారుడి పాలనా కాలంలో తక్షశిలలో తిరుగుబాటు జరిగింది. ఈయన ఆజ్ఞ ప్రకారం అశోకుడు తక్షశిలకు వెళ్లి శాంతి నెలకొల్పాడు. బిందుసారుడు గ్రీకు రాజ్యాలతో స్నేహ సంబంధాలు పెంపొందించాడు.
IITH: విపత్తుల సమయంలో ఎదుర్కొనేందుకు.. ఐఐటీహెచ్‌లో బాహుబలి డ్రోన్ తయారీ!
అశోకుడు (క్రీ.పూ. 273–232): ఈయన బిందుసారుడి కుమారుడు. అశోకుడు పట్టాభిషేకం చేసుకున్న తొమ్మిదేళ్లకు (క్రీ.పూ. 262– 61లో) సామ్రాజ్యకాంక్షతో కళింగ రాజ్యంపై దండెత్తి జయించాడు. ఈ యుద్ధం ‘ధర్మాశోకుడు’గా పూర్తిగా పరివర్తనం చెందడానికి కారణమైంది. ఆ తర్వాత ఉపగుప్తుడు అనే బౌద్ధ ఆచార్యుడి వద్ద అశోకుడు బౌద్ధమత దీక్ష స్వీకరించాడు. ధర్మప్రచారానికి పూనుకొని ‘దేవానాం ప్రియ’, ‘ప్రియదర్శిని’ బిరుదులు పొందాడు. బానిసలు, సేవకుల పట్ల కరుణ, తల్లిదండ్రులు, పెద్దల పట్ల విధేయత, గురువుల పట్ల గౌరవం, స్నేహితులు, బంధువులు, పరిచయస్థుల పట్ల ఔదార్యం, పురోహితులు, భిక్షువుల పట్ల ఆదరణ అనేవి అశోకుడు ప్రబోధించిన ‘ధర్మం’లోని సూత్రాలు. ‘అహింసా’ అనేది ‘ధర్మం’లోని ముఖ్యసూత్రం. అశోకుడు 42 ఏళ్లు పరిపాలించి క్రీ.పూ. 232లో మరణించాడు.
వివిధ శాసనాల ఆధారంగా అశోకుడి సామ్రాజ్య సరిహద్దుల గురించి తెలుస్తోంది. షహాబద్‌గిరి, మాన్‌షేషరా శాసనాలు వాయవ్య సరిహద్దును, రుమిందై శాసనం ఈశాన్య సరిహద్దును, సొపారా, గిర్నార్ శాసనాలు పశ్చిమ సరిహద్దును తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. బబ్రూ శాసనం అశోకుడి బౌద్ధమత స్వీకారం గురించి, ధౌలీ, జునాగడ్ శాసనాలు ఉదాత్త రాజ ధర్మ స్వరూపం గురించి, బరాబర్ శాసనం పరమత సహనం గురించి, 13వ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి తెలుపుతున్నాయి. మస్కీలో అశోక అనే పదం ఉంది. కళింగ యుద్ధం తర్వాత అశోకుడి పాలన గురించి కళింగ శాసనం ద్వారా తెలుస్తోంది. రుమిందై, ఇగ్లివ శాసనాలు అశోకుడికి బుద్ధుడిపై ఉన్న గౌరవాన్ని వివరిస్తాయి. తరాయి శాసనం అశోకుడికి బౌద్ధమతంపై ఉన్న గౌరవాన్ని తెలుపుతుంది.
Puzzle of the Day (23.08.2024): Maths Missing Number Logic Puzzle
అన్ని మతాల సారాంశం ఆధారంగా అశోకుడు కొన్ని సూత్రాలతో దమ్మను తయారు చేశాడు. ఈయన దమ్మ ప్రచారం కోసం ధర్మమహామాత్రులు అనే ప్రచారకులను పంపిస్తే వారు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. భారత ఉపఖండంలో అశోకుడు వేయించిన 14 ప్రధాన శిలా శాసనాలు, ఏడు స్తంభ శాసనాలు, అనేక చిన్నరాతి శాసనాలు లభించాయి. ఇందులో చాలావాటిపై ప్రజల కోసం చేసిన ప్రకటనలు చెక్కారు. 14 శిలా శాసనాలు అశోకుడి దమ్మ సూత్రాల గురించి తెలుపుతు న్నాయి. మస్కీ శాసనంలో ‘దేవానాం ప్రియ’ అని ఉంది.
మౌర్య వంశ చివరి పాలకులు (క్రీ.పూ. 232 – 185): అశోకుడి తర్వాత వచ్చిన రాజులు అర్ధ శతాబ్దం పాటు పాలించారు. మౌర్య వంశ చివరి రాజైన బృహద్రధుడిని ఆయన సేనాని పుష్యమిత్రుడు వధించి మగధను ఆక్రమించడంతో వీరి పాలన అంతమైంది.
మౌర్యుల పాలనా వ్యవస్థ
భారతదేశంలో ప్రప్రథమంగా కేంద్రీకృత అధికారాలు కలిగిన నిర్దిష్టమైన పరిపాలన రూపొందించింది మౌర్య చక్రవర్తులే. వీరికి పాలనలో సలహా కోసం మంత్రితో పాటు పరిషత్తు ఉండేది. పాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించి వాటికి రాజప్రతినిధులను నియమించారు. భూమిశిస్తు ప్రభుత్వ ప్రధాన ఆదాయం. పంట దిగుబడిలో 4 నుంచి 6వ వంతు వరకు శిస్తు వసూలు చేసేవారు. పాటలీపుత్ర నగర పాలన ముపై్ఫ మంది సభ్యులున్న బోర్డు నిర్వహణలో ఉండేది. వర్తకుల ‘శ్రేణులు’ బ్యాంకులుగా పనిచేశాయి. సమాజంలో బహు భార్యత్వం, కన్యల విక్రయం, సతీసహగమనం లాంటి దురాచారాలు ఉండేవి. ఈ కాలంలో స్త్రీల స్థాయి తగ్గింది. మౌర్యులు ఎక్కువగా ప్రజల భాష అయిన ప్రాకృతాన్ని ఉపయోగించారు. శిలా శాసనాల్లో ‘ఖరోష్టి’, ‘బ్రాహ్మి’ లిపులను వాడారు.
World's Oldest Person: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఈమెనే.. ఏ దేశానికి చెందిన మహిళంటే!
Tags
- indian history study material
- Competitive Exams
- tspsc and appsc groups exam
- competitive exams study material
- indian history subject
- appsc and tspsc preparation material
- State Exams
- group 1 and 2 exam preparation
- history preparation material
- history subject material for competitive exams
- APPSC Indian History
- TSPSC Indian History
- Education News
- Sakshi Education News