Skip to main content

దవ్యోల్బణం

ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే అంశాల్లో ‘ద్రవ్యోల్బణం’ ముందు వరుసలో ఉంటుంది. నిరంతరం ధరలు పెరిగే స్థితినే ద్రవ్యోల్బణం అంటారు. సహజంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో వివిధ స్థాయిల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల ప్రధానంగా స్థిర ఆదాయ వర్గాల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ధరలు పెరిగి ద్రవ్యం విలువ తగ్గుతుంది.

ద్రవ్యోల్బణ నిర్వచనాలు

  • ‘అధిక ద్రవ్యం అతి తక్కువ వస్తువులను వెంటాడటమే ద్రవ్యోల్బణం’ - డాల్టన్
  • ‘అధికంగా కరెన్సీని జారీ చేయడమే ద్రవ్యోల్బణం’ - హాట్రే
  • ‘అందుబాటులో ఉన్న వస్తువుల సప్లైలో పెరుగుదల కంటే, ద్రవ్య పరిమాణం పెరుగుదల ఎక్కువగా ఉండటమే ద్రవ్యోల్బణం.’ - ఇర్వింగ్ ఫిషర్
  • ‘ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణోద్యోగిత సిద్ధించిన తర్వాత ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం’ అంటారు. - జె.ఎం.కీన్‌‌స
  • దీన్నే నిజ లేదా వాస్తవిక ద్రవ్యోల్బణంగా పేర్కొన్నాడు. కీన్‌‌స ప్రకారం సంపూర్ణోద్యోగితకు ముందున్న పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం ఏర్పడదు.

ద్రవ్యోల్బణ తీవ్రతను బట్టి ప్రొఫెసర్ ఆర్.పి. కెంట్ ద్రవ్యోల్బణాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించారు.
1.పాకే ద్రవ్యోల్బణం: ధరల్లో పెరుగుదల 3 శాతం వరకు ఉండటం.
2. నడుస్తున్న ద్రవ్యోల్బణం: ధరల్లో పెరుగుదల 3 నుంచి 5 శాతం వరకు ఉండటం.
3. పరుగెడుతున్న ద్రవ్యోల్బణం: ధరల్లో పెరుగుదల 5 నుంచి 10 శాతం వరకు ఉండటం.
4. ఉధృత ద్రవ్యోల్బణం (లేదా) అతి ద్రవ్యోల్బణం: ధరల్లో పెరుగుదల 10 శాతానికి పైగా ఉండటం.

ఆర్.పి.కెంట్ ప్రకారం పాకే ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడూ లాభదాయకమే. నడుస్తున్న ద్రవ్యోల్బణం ప్రభుత్వానికి హెచ్చరిక వంటిది. ద్రవ్యోల్బణ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ పరిస్థితి ప్రభుత్వానికి సూచిస్తుంది.

  • పరుగెడుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. ఉధృత ద్రవ్యోల్బణ పరిస్థితులు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి. అనేక కారణాల వల్ల ఒక దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి.
  • ప్రభుత్వం తనకొచ్చే రాబడి కంటే వ్యయం ఎక్కువ చేసినప్పుడు ఏర్పడే లోటును పూడ్చుకొనేందుకు కొన్నిసార్లు నూతన ద్రవ్యాన్ని ముద్రిస్తుంది. దీనివల్ల అధిక కరెన్సీ చెలామణీలోకి వచ్చి ధరలు పెరుగుతాయి.
  • ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం వల్ల ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో ధరలు పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి.
  • ఒక దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులకు ఇతర దేశాల్లో డిమాండ్ పెరిగితే, ఆ దేశ ఎగుమతులు పెరుగుతాయి. ఫలితంగా సంబంధిత దేశంలో ఆయా వస్తువుల లభ్యత తగ్గి అంతర్గత డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.
  • ప్రభుత్వం గతంలో ప్రజల వద్ద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం వల్ల కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ధరలు అధికమవుతాయి.
  • దేశంలో వేగవంతమైన జనాభా పెరుగుదల వల్ల వస్తు సేవల డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
  • వ్యాపారస్తులు వస్తు, సేవలను గుప్తపరచడం వల్ల వాటి ధరలు పెరుగుతాయి.
  • ఉత్పత్తిదారులు ఏకస్వామ్యదారులుగా లేదా పరిమితస్వామ్యదారులుగా ఉన్నప్పుడు పోటీ లేకపోవడం వల్ల వస్తూత్పత్తి వ్యయాల కంటే వస్తు ధరలను అధికంగా పెంచి లాభాలను ఆర్జించేందుకు ప్రయత్నించడం వల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. దీన్నే లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు.

ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడటానికి ప్రధానంగా రెండు కారణాలను పేర్కొనొచ్చు.
1. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
2. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
దీన్నే అధిక డిమాండ్ ద్రవ్యోల్బణం అని అంటారు. ప్రభుత్వ వ్యయం, అనుత్పాదక వ్యయం, లోటు బడ్జెట్ తదితరాలు పెరగడం, ప్రత్యక్ష పన్నులు తగ్గడం, ప్రజల వినియోగస్థాయి పెరగడం, నూతన ద్రవ్యం జారీ వంటివి దీనికి కారణాలు.

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం
దీన్నే నూతన ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. 1950 వరకు ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంగానే ఆర్థికవేత్తలు విశ్లేషిస్తూ వచ్చారు. అయితే కార్మికుల వేతనాలు పెరగడం, ఉత్పత్తికారకాల కొరత, ముడి సరుకుల ధరలు పెరగడం, ఉత్పత్తిదారుల లాభార్జన తదితరాలు వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి కారణాలు.

  • వస్తు డిమాండ్, ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల సంభవించి, ఉత్పత్తిలో తగ్గుదల మూలంగా ధరలు పెరిగితే దాన్ని ‘మిశ్రమ ద్రవ్యోల్బణం’ అంటారు.
  • ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి ధరలు పెరగడాన్ని స్తంభన ద్రవ్యోల్బణం (Stagflation) అంటారు.
  • పభుత్వం ప్రత్యక్ష చర్యల ద్వారా లేదా భౌతిక నియంత్రణ ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తే దాన్ని ‘అణచి వేసిన ద్రవ్యోల్బణం’ అంటారు.
  • ధరలు తగ్గుతున్న పరిస్థితిని ‘ప్రతి ద్రవ్యోల్బణం’ అంటారు.
  • ప్రభుత్వం ద్రవ్య, కోశ విధానాలను ఉపయోగించి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తుంది. అయితే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ద్రవ్య, కోశ విధానాలు పనిచేయవు.

చాలా కాలం నిరంతరంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటే అనేక దుష్ఫలితాలు సంభవిస్తాయి. వాటిని ప్రధానంగా రెండు రకాలుగా పేర్కొనవచ్చు.
1. ఉత్పత్తిపై ప్రభావం.
2. పంపిణీపై ప్రభావం

ఉత్పత్తిపై ప్రభావం
ద్రవ్యోల్బణం వల్ల ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులు తమ వేతనాల పెరుగుదలను సాధించుకుంటారు. అందువల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగి ఉత్పత్తి మందగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీయొచ్చు.

పంపిణీపై ప్రభావం
ద్రవ్యోల్బణ కాలంలో ధనిక వర్గానికి అనుకూలంగా ఆదాయం, సంపద పునఃపంపిణీ జరుగుతుంది. ఇది ఆదాయ అసమానతలను పెంచుతుంది. ఈ కాలంలో కొద్ది మంది లబ్ధి పొందితే చాలా మంది నష్టపోతారు. ఈ కాలంలో ఉత్పత్తిదారులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, రుణ గ్రహీతలు, రైతులు, ధనవంతులు లబ్ధి పొందితే.. వినియోగదారులు, రుణదాతలు, వేతనాలు పొందేవారు, స్థిర ఆదాయం పొందేవారు, పింఛన్‌దారులు, పేదవారు నష్టపోతారు.

ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు ప్రభుత్వం మూడు రకాల చర్యలు తీసుకుంటుంది. అవి..
1. ద్రవ్య విధానం.
2. కోశ విధానం.
3. ఇతర చర్యలు

ద్రవ్య విధానం
దేశంలో అధిక కరెన్సీ చెలామణీని అరికట్టడంలో భాగంగా కేంద్ర బ్యాంకు చేపట్టే చర్యలు దీని పరిధిలోకి వస్తాయి. బ్యాంకు రేటును, నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం, బహిరంగ మార్కెట్ చర్యల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను, బాండ్లను ప్రజలకు అమ్మడం వంటి పరిణామాత్మక ద్రవ్య విధానాలతోపాటు వినియోగ పరపతిని నియంత్రించడం, రుణాలకు పూచీగా పెట్టుకొనే ఆస్తులకు మార్జిన్లను పెంచడం వంటి గుణాత్మక ద్రవ్య విధానాల ద్వారా ప్రజల వద్ద ఉన్న ద్రవ్య పరిమాణాన్ని నియంత్రించి వారి కొనుగోలు శక్తిని తగ్గిస్తారు. తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తారు. దీన్నే ఖరీదైన ద్రవ్య విధానం అంటారు.

కోశ విధానం
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కోశపర చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం వ్యయ పొదుపును పాటించడం, పన్నులు విధించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించడం, ప్రజల నుంచి రుణాలు తీసుకోవడం వంటి చర్యల ద్వారా ధరలను అదుపులో ఉంచొచ్చు.

ఇతర చర్యలు

  • వస్తూత్పత్తిని పెంచడం ద్వారా డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెంచి ధరలను అదుపులోకి తీసుకురావడం, వేతనాలను నియంత్రించడం, నిత్యావసర వస్తువులను రేషనింగ్ విధానం ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం తదితర చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచొచ్చు.
  • మనదేశంలో ద్రవ్యోల్బణం రేటును తెలుసుకోవడానికి టోకు ధరల సూచీ (Wholesale Price Index-WPI) ని ఉపయోగిస్తున్నారు.
  • ఒక సంవత్సర కాలంలో ధరల సూచీలో వచ్చిన మార్పు శాతాన్ని ‘ద్రవ్యోల్బణ రేటు’ అంటారు.
  • ధరల సూచీని నిర్ణయించేటప్పుడు ఆధార సంవత్సరాన్ని నిర్ణయించి, దాని ధరల సూచీ 100గా భావించి, దాని ఆధారంగా టోకు ధరల సూచీని రూపొందిస్తారు.
  • ఒక సంవత్సర కాలంలో టోకు ధరల సూచీలో మార్పు రాకపోతే శూన్య ద్రవ్యోల్బణం అని, టోకు ధరల సూచీలో మార్పు ఎక్కువగా ఉంటే ధనాత్మక ద్రవ్యోల్బణం అని, టోకు ధరల సూచీలో మార్పు తక్కువుంటే రుణాత్మక ద్రవ్యోల్బణం అని పేర్కొంటారు.

మన దేశంలో టోకు ధరల సూచీని రూపొందించడానికి ఇప్పటివరకు 6 సార్లు ఆధార సంవత్సరాలను ఎంచుకున్నారు. అవి..1952-53, 1961-62, 1970-71, 1981-82, 1993-94, 2004-05. ప్రస్తుతం అనుసరిస్తున్న 2004-05 టోకు ధరల సూచీ ఆధార సంవత్సరం, 2010, సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకొచ్చింది. 1993-94 ఆధార సంవత్సరంగా టోకు ధరల సూచీని నిర్ణయించడానికి 435 వస్తువులను పరిగణనలోకి తీసుకున్నారు. 2004-05 ఆధార సంవత్సరంగా టోకు ధరల సూచీని నిర్ణయించడానికి 676 వస్తువులను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 102 ప్రాథమిక వస్తువులు, 19 విద్యుచ్ఛక్తి, ఇంధన వస్తువులు, 555 తయారీ రంగ వస్తువులున్నాయి.

Published date : 02 Mar 2017 04:34PM

Photo Stories