General Science : బలమైన ఆమ్లాలను తరలించే కంటెయినర్‌లను దేనితో రూపోందిస్తారు?
పోటీ పరీక్షలకు ప్రశ్నపత్రం ప్రిపేర్ చేసేవారికి వెంటనే స్ఫురించే అంశాలలో పదార్థాల స్వభావం ఒకటి. ఎందుకంటే మన జీవన క్రియల్లో పాల్పంచుకోవడంతో పాటు ప్రభావితం చేసే అనేక ఇతర అంశాల్లో ఆమ్లాలు, క్షారాలు, లవణాలు ముఖ్యమైనవి.
ఆమ్లాలు, క్షారాలు నిత్యజీవితంలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ఉదరంలో ఉన్న హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడానికి దోహదం చేయడంతో పాటు ఇన్‌ఫెక్షన్‌లు రాకుండా కాపాడుతుంది. సంప్రదాయంగా ఇస్తున్న తాంబూలంలో తమలపాకుపై సున్నపు తేట ఒక క్షారం. ఇది ఎసిడిటీ రాకుండా కాపాడే ఒక మంచి ఆచారం. అయితే ప్రస్తుతం మనం తినగానే వెంటనే ‘కూల్ డ్రింక్’ తాగుతుంటాం. అందులోని ఫాస్ఫారిక్ ఆమ్లంతో పాటు ఉన్న కార్బొనిక్ ఆమ్లం ఉదరంలో చేరడంతో మంటను చల్లార్చడానికి పెట్రోలు చల్లిన చందంగా అవుతుంది.
కొన్ని సహజ సిద్ధమైన అమ్లాలు
పచ్చళ్లు నిల్వ ఉంచడానికి ఉప్పును మంచి నిల్వకారిణిగా వాడతారు. మనం రుచి కోసం కూరల్లో వేసే ఉప్పు (సోడియం క్లోరైడ్) ఉదరంలో హైడ్రోక్లోరిక్ ఆమ్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. అదే విధంగా సో డియం బెంజోయేట్ ఒక మంచి ‘ఆహార నిల్వకారిణి’. ఎర్ర చీమ కుడితే ఫార్మిక్ ఆమ్లం ఇంజెక్ట్ అవుతుంది. వెనిగర్ అనేది ఎసిటికామ్లం. గతంలో ఈ అంశంపై అనేకసార్లు ప్రశ్నలు వచ్చాయి. వివిధ ఆమ్ల, క్షారాలు–వాటి స్వభావాలు, ధర్మాలు, వివిధ లవణాలు–వాటి ఉపయోగాలపై ప్రశ్నలు అడగవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
అనేక సిద్ధాంతాలు:
ప్రాచీన కాలం నుంచి పుల్లని రుచి కలిగిన పదార్థాలను ఆమ్లాలని, చేదు కలిగిన వాటిని క్షారాలని వ్యవహరించేవారు. ఈ రెండూ కాని వాటిని లవణాలని చెప్పేవారు. ఆ తర్వాత ఆమ్లాలలో ఆక్సిజన్ తప్పనిసరిగా ఉంటుందని కొందరు, హైడ్రోజన్ ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు భావించారు. లాటిన్ భాషలో ‘అసిడస్’ అంటే ‘పులుపు’ అని అర్థం. పస్తుతం ఆమ్ల–క్షారాలకు సంబంధించి మూడు సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి.. అర్హీనియస్, లూయీ, బ్రాన్‌స్పెడ్–లోరీ సిద్ధాంతాలు.
అర్హీనియస్ సిద్ధాంతం
లోతుగా వెళ్లకుండా సాధారణ పరిభాషలో ఆమ్ల–క్షార భావనను వివరించడానికి అర్హీనియస్ సిద్ధాంతం అనువైంది. ఈ సిద్ధాంతం ప్రకారం జల ద్రావణంలో ప్రోటాన్(H+)ను ఇచ్చే పదార్థాలు ఆమ్లాలు. హైడ్రాక్సిల్ అయాన్ (OH-) ఇచ్చేవి క్షారాలు. ఆమ్లాలు క్షారాలతో కలిసి నీటితో పాటు లవణాన్ని ఏర్పరుస్తాయి. ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం(HCl), సోడియం హైడ్రాక్సైడ్(NaOH)తో కలిసి సోడియం క్లోరైడ్ అనే లవణాన్ని ఏర్పరుస్తుంది.
ఆమ్లాలు–ఇతర ధర్మాలు:
➡︎ నీలి లిట్మస్‌ను ఎరుపు రంగులోకి మారుస్తాయి.
➡︎ చురుకైన లోహాలతో చర్య పొంది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
➡︎ కార్బొనేటులు, బైకార్బొనేటులలో చర్యను పొందినపుడు బుసబుసమని పొంగుతూ కార్బన్‌డైఆక్సైడ్ (CO2) వాయువు విడుదలవుతుంది.
ఉదా: చలువరాతి ముక్కలు (కాల్షియం కార్బొనేట్–CaCO3)పై హైడ్రోక్లోరిక్ ఆమ్లం CO2 వస్తుంది. CaCO3+2HCl→CaCl2+H2O+CO2 అదే విధంగా తినేసోడా (సోడియం బైకార్బొనేట్-NaHCO3) మన ఆహారంతో ΄ాటు తీసుకున్నప్పుడు తేన్పుల రూపంలో CO2 బయటకు రావడాన్ని మనం గమనించవచ్చు. NaHCO3+HCl→NaCl+H2O+CO2
➡︎ ఆమ్లాలు చాలా వరకు మంచి విద్యుత్ వాహకాలు
కొన్ని బలహీన ఆమ్లాలు
➡︎ కార్బోనిక్ ఆమ్లం–H2CO3
➡︎ ఫార్మిక్ ఆమ్లం–HCOOH
➡︎ ఎసిటిక్ ఆమ్లం–CH3COOH
బలమైన ఆమ్లాలు
➡︎ హైడ్రోక్లోరిక్ ఆమ్లం–HCl
➡︎ సల్ఫ్యూరిక్ ఆమ్లం– H2SO4
➡︎ నైట్రిక్ ఆమ్లం–HNO3
➡︎ ఫాస్ఫారిక్ ఆమ్లం–H3PO4
క్షారాల సాధారణ ధర్మాలు:
➡︎ సబ్బు నురగ వంటి జారుడు స్వభావం గల చేదుగా ఉండే పదార్థాలు
➡︎ ఎరుపు లిట్మస్ పేపర్‌ను నీలి రంగులోకి మారుస్తాయి.
➡︎ కాస్టిక్ సోడా వంటి బలమైన క్షారాలు చేతిపై పడినప్పుడు చర్మాన్ని తినేస్తాయి.
బలహీన క్షారాలు:
➡︎ మెగ్నీషియం హైడ్రాక్సైడ్–Mg(OH)2
➡︎ కాల్షియం హైడ్రాక్సైడ్–Ca(OH)2
➡︎ అల్యూమినియం హైడ్రాక్సైడ్–Al(OH)3
➡︎ అమ్మోనియం హైడ్రాక్సైడ్–NH4OH
☛ Follow our Instagram Page (Click Here)
బలమైన క్షారాలు:
➡︎ సోడియం హైడ్రాక్సైడ్ –NaOH
➡︎ ΄÷టాషియం హైడ్రాక్సైడ్ –KOH
కొన్ని లవణాలు:
➡︎ సోడియం క్లోరైడ్ –NaCl
➡︎ అమ్మోనియం క్లోరైడ్ –NH4Cl
➡︎ సోడియం కార్బొనేట్ –Na2CO3
pH:స్కేలు
ఆమ్ల క్షార బలాలను కొలవడానికి సొరెన్‌సెన్ పరిచయం చేసిన ‘pH స్కేలు’ అనే పరిభాషను ఉపయోగిస్తారు. ఆమ్లాల pH విలువ 1–7 వరకు. క్షారాల pH విలువ 7–14 వరకు. తటస్థ పదార్థాల pH విలువ 7. బలమైన ఆమ్లాల pH విలువ ఒకటికి దగ్గరగా ఉంటే బలమైన క్షారాల pH విలువ 14కు దగ్గరగా ఉంటుంది.
లవణ జల విశ్లేషణ:
కొన్ని లవణాలు నీటిలో కరిగించినపుడు ఆ ద్రావణానికి ఆమ్ల లేదా క్షార స్వభావం వస్తుంది. ఆ దృగ్విషయాన్నే లవణ జల విశ్లేషణ అంటారు. సాధారణంగా బలమైన క్షారం –బలహీనమైన ఆమ్లం కలయికతో ఏర్పడిన లవణాల జలద్రావణం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది.
ఉదా: సోడియం బైకార్బొనేట్ –NaHCO3
సోడియం కార్బొనేట్ –Na2CO3
అందుకే తినేసోడా (NaHCO3) అధికంగా వాడినపుడు ఆమ్లత్వం (acidity) పెరిగి ఉదరంలో మంట మండినట్లు అనిపించడం గమనించవచ్చు. ఇదే చివరకు అల్సర్లకు కూడా దారితీయవచ్చు.
కొన్ని నమూనా ప్రశ్నలు
1. పెరుగు పులుపునకు కారణమైన ఆమ్లం
1) ఫార్మక్ ఆమ్లం 2) ఎసిటిక్ ఆమ్లం
3) టార్టారిక్ ఆమ్లం 4) లాక్టిక్ ఆమ్లం
2. నారింజ వంటి నిమ్మ జాతి పండ్లలో ఉండే ఆమ్లం
1) సిట్రిక్ ఆమ్లం 2) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం 4) లాక్టిక్ ఆమ్లం
3. కిందివాటిలో బలహీన ఆమ్లం ఏది?
1) హైడ్రోక్లోరిక్ ఆమ్లం 2) నైట్రిక్ ఆమ్లం
3) సల్ఫ్యూరిక్ ఆమ్లం 4) కార్బొనిక్ ఆమ్లం
4. సబ్బుల పరిశ్రమలో ఉపయోగించే కాస్టిక్ సోడాగా పిలిచే క్షారం ఏది?
1) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) సోడియం హైడ్రాక్సైడ్
4) అల్యూమినియం హైడ్రాక్సైడ్
5. కిందివాటిలో తటస్థమైనది ఏది?
1) నీరు 2) సోడియం క్లోరైడ్ జల ద్రావణం
3) 1, 2 4) లాలాజలం
☛ Join our WhatsApp Channel (Click Here)
6. ఉసిరికాయలో ఎక్కువగా ఉండే ఆమ్లం ఏది?
1) ఫార్మిక్ ఆమ్లం 2) ఆస్కార్బిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం 4) టార్టారిక్ ఆమ్లం
7. జతపరచండి:
ఎ. ఎర్రచీమలు 1. టార్టారిక్ ఆమ్లం
బి. వెనిగర్ 2. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
సి. పొట్టలోని ఆమ్లం 3. ఫార్మిక్ ఆమ్లం
డి. బేకింగ్ పౌడర్ 4. ఎసిటిక్ ఆమ్లం
తయారీలో ఉపయోగించే ఆమ్లం
ఎ బి సి డి
1) 2 4 3 1
2) 1 3 2 4
3) 3 4 2 1
4) 4 2 1 3
8. నీటిలో చాకలిసోడా (సోడియం కార్బొనేట్) కరిగిస్తే వచ్చే ద్రావణం
1) ఆమ్లయుతం 2) క్షారయుతం
3) తటస్థం 4) చెప్పలేం
9. పాన్ తయారీలో తమలపాకుపై రాసే సున్నపు తేటలోని రసాయనం
1) కాల్షియం కార్బొనేట్ 2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) సోడియం బైకార్బొనేట్ 4) సోడియం కార్బొనేట్
10. గ్యాస్ట్రిక్ రసం విలువ
1) 2 2) 7 3) 10 4)14
11. జతపరచండి:
జాబితా 1 (పదార్థం)
ఎ. సారవంతమైన పదార్థం
బి. లాలాజలం
సి. మూత్రం
డి. రక్తం
జాబితా 2 (pఏ విలువ)
1. 6 – 6.8
2. 6.2 – 6.9
3. 4.8 – 7.5
4. 7.1 – 7.4
ఎ బి సి డి
1) 1 2 3 4
2) 4 3 2 1
3) 3 2 1 4
4) 2 4 1 3
☛ Join our Telegram Channel (Click Here)
12. బలమైన ఆమ్లాలను తరలించే కంటెయినర్‌లను దేనితో రూపోందిస్తారు?
1) ఇత్తడి 2) కంచు 3) రాగి 4) సీసం
13. సిరా మరకలను తొలగించడానికి వాడే ఆమ్లం ఏది?
1) లాక్టిక్ ఆమ్లం 2) ఆక్జాలిక్ ఆమ్లం
3) టార్టారిక్ ఆమ్లం 4) ఎసిటిక్ ఆమ్లం
14. మానవుల జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం (గ్రూప్–1, 2012)
1) అసిటిక్ ఆమ్లం 2) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం 4) నైట్రిక్ ఆమ్లం
15. అత్యధిక ఆమ్లాలలో సాధారణంగా ఉండే మూలకం
1) గంధకం 2) ఉదజని 3) క్లోరిన్ 4) ఆక్సిజన్
16. రసాయనికంగా వంట సోడా (గ్రూప్–2, 2005)
1) బేకర్స్ ఈస్ట్ 2) కాల్షియం ఫాస్ఫేట్
3) సోడియం బైకార్బనేట్ 4) సోడియం క్లోరైడ్
17. వెనిగర్ దేని జల ద్రావణం (గ్రూప్–2, 2008)
1) ఆక్సాలిక్ ఆమ్లం 2) సిట్రిక్ ఆమ్లం
3) అసిటిక్ ఆమ్లం 4) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
18. కింది వాటిలో ఆమ్ల విరోధి
1) బేకింగ్ సోడా 2) మిల్క్ ఆఫ్ మెగ్నీషియం
3) అల్యూమినియం హైడ్రాక్సైడ్ 4) అన్నీ
19. మిల్క్ ఆఫ్ లైమ్ అనేది
1) కాల్షియం కార్బొనేట్ 2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) మెగ్నీషియం హైడ్రాక్సైడ్ 4) లాక్టిక్ ఆమ్లం
20. ఆమ్ల వర్షాల్లో భూమిని చేరే ప్రధాన ఆమ్లాలు
1) నైట్రిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం
2) సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం
4) హైడ్రోక్లోరిక్ ఆమ్లం,సల్ఫ్యూరిక్ ఆమ్లం
21. కింది వాటిలో సరిగా జతపరచనిది ఏది?
1) ఆహార నిల్వకారిణి–సోడియం బెంజోయేట్
2) టేబుల్ సాల్ట్–సోడియం క్లోరైడ్
3) నిమ్మ ఉప్పు–సిట్రిక్ ఆమ్లం
4) చాకలి సోడా–సోడియం బైకార్బొనేట్
22. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) మనం ఆహారం ద్వారా తీసుకునే ఉప్పు(సోడియం క్లోరైడ్), ఉదరంలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తుంది.
2) నీటిలో సంఘటనం పరంగా హైడ్రోజన్ అయాన్‌లు, హైడ్రాక్సిల్ అయాన్‌లు సమాన సంఖ్యలో ఉండడం వల్ల ఆమ్ల గుణం కానీ, క్షార గుణం కానీ ఉండక తటస్థంగా ఉంటుంది.
3) శీతల పానీయాల్లో ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు.
4) శీతల పానీయాల్లో కార్బన్‌డైఆక్సైడ్ కరిగించడం వల్ల ఏర్పడే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం.
23. జతపరచండి
ఎ. బ్యాటరీలు 1. సాలిసిలిక్ ఆమ్లం
బి. బేకరీలు 2. సల్ఫ్యూరిక్ ఆమ్లం
సి. సోడా నీరు 3. కార్బోనిక్ ఆమ్లం
డి. ఆస్పిరిన్ తయారీ 4. వెనిగర్
ఎ బి సి డి
1) 2 1 4 3
2) 2 4 3 1
3) 4 3 2 1
4) 1 2 3 4
సమాధానాలు
1) 4; 2) 1; 3) 4; 4) 3; 5) 3;
6) 2; 7) 3; 8) 3; 9) 2; 10) 1;
11) 1; 12) 4; 13) 2; 14) 2; 15) 2;
16) 3; 17) 3; 18) 4; 19) 2; 20) 2;
21) 4; 22) 4; 23) 2.
Tags
- general science study material
- bit banks for general science
- appsc and tspsc groups general science
- groups exams study material
- appsc and tspsc general science
- Government Jobs
- study material and bit banks
- study material and bit banks for general science
- Competitive Exams
- bit banks and material for groups exams
- acids in science
- Education News
- Sakshi Education News