మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
1. మౌలిక భారత రాజ్యాంగంలో (1950) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఎన్ని భాగాలుగా విభజించారు?
1) రెండు
2) మూడు
3) నాలుగు
4) ఐదు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950లో దేశంలోని ప్రాంతాలను ఎ,బి,సి,డి అనే నాలుగు భాగాలుగా విభజించారు. ఎ భాగంలో 9 పూర్తి స్థాయి రాష్ట్రాలను పొందుపరుస్తూ 1వ షెడ్యూల్లో చేర్చారు. బి భాగంలో 9 స్వదేశీ సంస్థానాలను చేర్చుతూ 7వ భాగంలో పొందుపరిచారు. సి భాగంలో 10 కేంద్రపాలిత ప్రాంతాలను చేర్చుతూ 8వ భాగంలో పొందుపరిచారు. డి భాగంలో అండమాన్ నికోబార్, ఆక్రమిత ప్రాంతాలను చేర్చుతూ 9వ భాగంలో పొందుపరిచారు.
- సమాధానం: 3
2. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై నియమించిన మొదటి కమిషన్ ఏది?
1) ఫజల్ అలీ కమిషన్
2) జె.వి.పి కమిటీ
3) హుకుం సింగ్ కమిటీ
4) ఎస్.కె. థార్ కమిటీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై 1948 జూన్‌లో ఎస్.కె. థార్ నేతృత్వంలో ఫన్నాలాల్ జనత్ నారాయణ్ సభ్యులుగా ఈ కమిషన్‌ను రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నియమించాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై నియమించిన మొదటి కమిషన్ ఇది. ఈ కమిషన్ 1948 డిసెంబర్లో తన నివేదికలో జాతీయ ప్రయోజనాల అంశాల దృష్ట్యా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం లేదని తెలుపుతూ పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది.
- సమాధానం: 4
3. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సు ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ చట్టం(1956) ద్వారా ఎన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు?
1) 14, 6
2) 16, 6
3) 14, 7
4) 16, 7
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను 1953లో ఫజల్ అలీ చైర్మన్‌గా హెచ్.ఎన్. కుంజ్రు, కెఎమ్. ఫణిక్కర్లను సభ్యులుగా నియమించారు. ఈ కమిషన్ 1955లో తన నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాలను సమర్థిస్తూ 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సూచనలను మార్పు చేస్తూ నెహ్రూ ప్రభుత్వం 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది.
- సమాధానం: 1
4. భాషా ప్రయుక్త రాష్ట్రాలను 1956లో ఏర్పాటు చేసిన 14 రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రం ఏది?
1) గుజరాత్
2) నాగాలాండ్
3) హర్యానా
4) మైసూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1956లో ఏర్పాటు చేసిన 14 రాష్ట్రాలలో మైసూర్ రాష్ట్రం ఉంది. మైసూర్ రాష్ట్రాన్ని 1973లో కర్ణాటకగా మార్చారు. అదే విధంగా పైన పేర్కొన్న మూడు రాష్ట్రాలు 1956లో లేవు. గుజరాత్ 1960లో ఏర్పడగా, నాగాలాండ్ 1963, హర్యానా 1966లో ఏర్పడ్డాయి.
- సమాధానం: 4
5. భారత దేశంలో మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
1) ఢిల్లీ
2) అండమాన్
3) పుదుచ్చేరి
4) చంఢీఘర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్న పుదుచ్చేరి 1954లో భారత దేశంలో విలీనం అయింది. పుదుచ్చేరి నాలుగు జిల్లాల సమ్మేళనం. ఈ నాలుగు జిల్లాలు భారత దేశంలో మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. అవి పుదుచ్చేరి, కరైకల్ జిల్లాలు తమిళనాడులో, మాహే జిల్లా కేరళలో, యానం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌లో విస్తరించి ఉన్నాయి. 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1962లో çపుదుచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అదేవిధంగా 1963లో శాసన సభను ఏర్పాటు చేశారు. ఇందులో 30 మంది ఎన్నికైన సభ్యులు మరియు ముగ్గురు నియామక సభ్యులు ఉంటారు.
- సమాధానం: 3
6. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికీ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ, మంత్రి మండలిని ఏర్పాటు చేశారు?
1) 69
2) 70
3) 71
4) 72
- View Answer
- సమాధానం: 1
వివరణ: 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ప్రకారం ఢిల్లీకి అసెంబ్లీ్ల, మంత్రి మండలిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన 70 మంది సభ్యులు ఉంటారు. అసెంబ్లీ, మంత్రిమండలి గురించి ఆర్టికల్–239(ఎ) తెలుపుతుంది. ఢిల్లీ మంత్రిమండలిలో ముఖ్యమంత్రితో కలిపి 7 గురు సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి సమిష్టిగా అసెంబ్లికి బాధ్యత వహిస్తారు.
- సమాధానం: 1
7. ఈ కింది ఏ సంవత్సరాల్లో మూడు చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి?
1) 1972
2) 1987
3) 2000
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారతదేశంలో మూడు సార్లు మూడు చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1972లో ఇందిరా గాం«ధీ ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్, త్రిపుర, మేఘాలయ, 1987లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, 2000లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చత్తీస్ఘడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
- సమాధానం: 4
8. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు?
1) పొట్టి శ్రీరాములు
2) గొల్లపూడి సీతారామ మూర్తి
3) పట్టాభీ సీతారామయ్య
4) ఎన్.జి. రంగా
- View Answer
- సమాధానం: 2
వివరణ: మద్రాస్ రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకై గొల్లపూడి సీతారామమూర్తి 1951 ఆగస్ట్ 15 నుంచి 35 రోజుల పాటు గుంటూరులో నిరాహార దీక్ష చేసి ఆచార్య వినోభాభావే సలహా మేరకు దీక్షను విరమించాడు. తర్వాత 1952 అక్టోబర్ 19 నుంచి 1952 డిసెంబర్ 15 వరకు పొట్టి శ్రీరాములు 58 రోజులు మద్రాస్‌లోని బులుసు సాంబమూర్తి నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మత్యాగం చేశాడు.
- సమాధానం: 2
9. భారత రాజ్యాంగంలో XXIవ భాగంలో ఆర్టికల్–371లో ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక అంశాలను కల్పించారు?
1) 8
2) 10
3) 12
4) 14
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత రాజ్యాంగంలో XXIవ భాగంలో ఆర్టికల్–371 నుంచి 371(జె) వరకు 12 రాష్ట్రాలకు సంబంధించి వివిధ అంశాలకు ప్రత్యేక రక్షణలను కల్పించారు. ఇందులో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, అసోం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక. సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు తెలంగాణ. వాస్తవానికి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు వీటి గురించి ప్రస్తావన లేదు. కానీ ఈ రాష్ట్రాలు ఏర్పడే సందర్భంలో వివిధ సందర్భాల్లో వెనుకబడిన ప్రాంతాల రక్షణ, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఆయా రాష్ట్రాల్లోని గిరిజన ప్రజల సంస్కృతి రక్షణ అంశాలు, ఉద్యోగాల నియామకాలలో వెనుకబడిన ప్రాంత ప్రజలకు ప్రత్యేక అవకాశాలు వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు.
- సమాధానం: 3
10. ప్రస్తుతం భారత దేశంలో శాసనసభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా అందులో మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా శాసనసభలు ఉన్నాయి. అవి ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ–కశ్మీర్. ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్‡ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. అవి జమ్మూ–కశ్మీర్ శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది.
- సమాధానం: 3
11. జమ్మూ–కశ్మీర్ భారతదేశంలో ఏ ప్రక్రియ ద్వారా విలీనం అయింది?
1) రెఫరెండం ద్వారా
2) పోలీస్ చర్య ద్వారా
3) సైనిక చర్య ద్వారా
4) విలీన ఒప్పందం ద్వారా
- View Answer
- సమాధానం: 4
వివరణ: జమ్మూ–కశ్మీర్ 1947 అక్టోబర్ 26న విలీన ఒప్పందం ద్వారా భారత్‌లో విలీనం అయింది. దీనిపై అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. జమ్మూ కశ్మీర్ రాజు హరీసింగ్ సంతకాలు చేశారు. దీని ద్వారా జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి రక్షణ, విదేశీవ్యవహారాలు, కమ్యూనికేషన్ అంశాలు భారత దేశానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగంలో ఆర్టికల్–370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించగా, దీనిని ఇటీవల రద్దు చేశారు. అదేవిధంగా జునాఘడ్ సంస్థానం రెఫరెండం ద్వారా 1948 ఫిబ్రవరి 25న భారత్‌లో విలీనమైంది. హైదరాబాద్æ నిజాం సంస్థానం పోలీస్ చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనం చేశారు.
- సమాధానం: 4
12. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జె) ప్రకారం ఏ రాష్ట్ర గవర్నర్‌కు ఆ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది?
1) జమ్ము కశ్మీర్
2)గోవా
3) కర్ణాటక
4) అసోం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 98వ రాజ్యాంగ సవరణ చట్టం(2012) ప్రకారం ఆర్టికల్–371(జె) ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని హైదరాబాద్–కర్ణాటక ప్రాంతానికీ ప్రత్యేక హోదా కల్పించారు. దీని ప్రకారం ఈ ప్రాంతాభివృద్ధికై భారత రాష్ట్రపతి ఆ రాష్ట్ర గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలను లేదా బాధ్యతలను కల్పించవచ్చు.
- సమాధానం: 3
13.ఈ కింది ప్రాంతాలు లేదా రాష్ట్రాలు స్వాతంత్రోధ్యమ సమయంలో వివిధ దేశాల పరిపాలనల్లో ఉండేవి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) గోవా–పోర్చుగీస్
2) పుదుచ్చేరి–ఫ్రెంచి
3) దాద్రానగర్ హవేలీ–పోర్చుగీస్
4) సిక్కిం–చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సిక్కిం 1975 వరకు సర్వస్వతంత్ర దేశంగా ఉండేది. దీనిని చోగ్యాల్ వంశస్తులు పాలించేవారు. 1975లో సిక్కిం రాజుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఆ సందర్భంలో దేశంలో రెఫరెండమ్‌కు నిర్వహించగా మెజారిటీ ప్రజలు భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించారు. తద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం 35వ రాజ్యాంగ సవరణ(1975) ద్వారా సిక్కింను భారత్‌లో విలీనం చేసుకుంటూ దానికి ‘సహ రాష్ట్ర హోదా’ కల్పించారు. అనంతరం 36వ రాజ్యాంగ సవరణ ద్వారా(1975) సిక్కింకు సహ రాష్ట్ర హోదా రద్దు చేస్తూ పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చారు.
- సమాధానం: 4
14. 1956లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. వీటి తర్వాత ఏర్పడిన తొలి రాష్ట్రం ఏది?
1) హిమాచల్ ప్రదేశ్
2) నాగాలాండ్
3) గుజరాత్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాష్ట్రాల పునర్విభజన సందర్భంలో (1956) గుజరాత్ ప్రాంతం బొంబాయి రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. తర్వాత 1960లో 15వ రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. 1963లో 16వ రాష్ట్రంగా నాగాలాండ్, 1966లో 17వ రాష్ట్రంగా హర్యానా, 1971లో 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అవతరించాయి.
- సమాధానం: 3
15. భారత దేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
1) భారత పార్లమెంట్
2) భారత రాష్ట్రపతి
3) ఆ రాష్ట్ర అసెంబ్లీ
4) 1, 3 సరైనవే
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత దేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం భారత పార్లమెంట్‌కు ఉంటుంది. నూతన రాష్ట్ర ఏర్పాటును ముందుగా కేంద్ర క్యాబినేట్ ఆమోదించవలసి ఉంటుంది. తర్వాత దానికి అనుగుణంగా కేంద్ర హోం మంత్రి బిల్లును రూపొందిస్తాడు. ఆ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో దేనిలోనైనా∙ప్రవేశపెట్టవచ్చు. దీనిని ప్రవేశపెట్టెముందు రాష్ట్రపతి అనుమతికై పంపవలసి ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లుని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకీ పంపిస్తారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆ బిల్లుని ఆమోదించినా∙లేదా తిరస్కరించినా కేంద్ర హోం మంత్రి దానిని పార్లమెంట్లో ప్రవేశపెట్టవచ్చు. అప్పుడు పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే రాష్ట్రపతి ఆమోదంతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు.
- సమాధానం: 1
16. ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
1) షీలా కౌల్
2) సుష్మా స్వరాజ్
3) షీలా దీక్షిత్
4) మార్గరేట్ ఆల్వా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఢిల్లీకీ 1952–56 మధ్య ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఉండేది. 1956లో రద్దు చేయగా, మళ్లీ 1993 నుంచి వీటిని పునరుద్దరించారు. ఢిల్లీకి 7గురు ముఖ్యమంత్రులుగా పనిచేయగా అందులో ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు. మొదటి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్(1998), రెండవ మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(1998–13)
- సమాధానం: 2
17. ఢిల్లీ, పుదుచ్చేరిల్లో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు?
1) 355
2) 356
3) 239–ఎబి
4) 239–బి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఢిల్లీ, పుదుచ్చేరిలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు లేదా రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు ఆర్టికల్ 239–ఎబి ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇంతవరకు ఢిల్లీలో ఒకసారి, పుధుచ్చేరిలో 6 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అదేవిధంగా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను ఆర్టికల్ 356 ప్రకారం విధించవచ్చు. ఇప్పటి వరకు అత్యధికసార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం మణిపూర్(10 సార్లు)
- సమాధానం: 3
18. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది?
1) 7
2) 8
3) 9
4) 10
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో 8వ భాగంలో ఆర్టికల్ 239 నుంచి 241 వరకు ఉంది. వీటిని 1874 లో తొలిసారిగా షెడ్యూల్డ్ జిల్లాలుగా పిలిచేవారు. తరువాత చీఫ్ కమీషనర్ ప్రాంతాలు అనేవారు. మౌళిక రాజ్యాంగంలో సి భాగంలో 10 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండేవి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం (1956) ద్వారా సి, డి భాగాల ప్రాంతాలను కలిపి ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను కలపడం తో కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరింది.
- సమాధానం: 2
19. కింది రాష్ట్రాలను అవి ఏర్పడిన సంవత్సరాలను అనుసరించి వరుస క్రమంలో రాయండి.
ఎ) మణిపూర్
బి) గోవా
సి) పంజాబ్
డి) సిక్కిం
1) ఎ,బి,సి,డి.
2) సి.ఎ,డి,బి.
3) సి,డి,ఎ,బి.
4) ఎ,సి,డి,బి.
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ట్రాల పునర్విభజన సందర్భంలోనే 1956లో పంజాబ్ అవతరించగా, మణిపూర్ 1972లో సిక్కిం 1975లో ఏర్పడగా, గోవా 1987లో రాష్ట్రంగా అవతరించింది.
- సమాధానం: 2
20. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) కర్భీ ఆంగ్లాంగ్–అసోం
2) మిథిలాంచల్–ఉత్తరప్రదేశ్
3) కోసల్ –తమిళనాడు
4) బోడోలాండ్–మేఘాలయ
- View Answer
- సమాధానం: 1
వివరణ: కర్భీ ఆంగ్లాంగ్ అనే గిరిజన ప్రాంత జిల్లా అసోంలో ప్రత్యేక రాష్ట్రానికై డిమాండ్ చేస్తుంది. మిథిలాంచల్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ బీహార్, కోసల్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఒడిశాలో ఉండగా బోడోలాండ్ డిమాండ్ అసోం రాష్ట్రానికి సంబంధించినది.
- సమాధానం: 1