Skip to main content

సాంఘిక అవస్థాపన, ఉపాధి, మానవాభివృద్ధి ఆర్థిక సర్వే 2018-19

భారత మానవాభివృద్ధి సూచీ విలువలో 1990 - 2017 మధ్య కాలంలో గణనీయమైన ప్రగతి ఏర్పడింది.
ఈ కాలంలో మానవాభివృద్ధి సూచీ విలువ 0.427 నుంచి 0.640కు పెరిగింది. భారత్ మానవాభివృద్ది సూచీ విలువలో పెరుగుదల ఏర్పడినప్పటికీ ఇతర ఆసియా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు విలువపరంగా భారత్ వెనుకబడి ఉంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం రూపొందించిన మానవాభిృద్ధి సూచీలో మొత్తం 189 దేశాల్లో భారత్ 130వ స్థానం పొందింది. రాష్ట్రస్థాయి మానవాభివృద్ధి సూచీలను పరిశీలించినప్పుడు భారత్‌లో ప్రాంతీయ, మానవాభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టమవుతున్నాయి. యు.ఎన్.డి.పి. 1990-2017 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి Sub national HDI ని రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు మానవాభివృద్ధిలో గణనీయమైన ప్రగతి సాధించాయి. 2017 సంవత్సరంలో కనిష్ట Sub national HDI విలువ 1990లో సాధించిన గరిష్ట విలువ కంటే అధికమని నివేదిక పేర్కొంది. భారత్‌లో వివిధ రాష్ట్రాల మానవాభివృద్ధి సూచీ స్కోరులను పరిశీలించినప్పుడు ఈ సూచీలో కేరళ, గోవా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లు మొదటి నాలుగు స్థానాలు పొందగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు చివరి స్థానాలు పొందాయి. 1990వ దశకంలో మానవాభివృద్ధి పరంగా వెనుకబడిన రాష్ట్రాలు ప్రస్తుతం ముందంజలో ఉన్నాయి. మానవాభివృద్ధి సూచీ స్కోరును ప్రాంతాల వారీగా పరిశీలించినప్పుడు తూర్పు ప్రాంత రాష్ట్రాలతో పోల్చినపుడు దక్షిణ, ఉత్తర ప్రాంతంలోని రాష్ట్రాలు మానవాభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ ప్రగతిని కొలవడానికి నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ‘SDG ఇండియా ఇండెక్స్’ను అభివృద్ధిపరచింది. ఈ సూచీలో భారత్ స్కోరు 57. ఈ సూచీ ప్రకారం రాష్ట్రాలను నాలుగు కేటగిరీలుగా విభజించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 12, 13, 14, 17 లక్ష్యాలను మినహాయించి మిగిలిన ప్రతి లక్ష్యానికి సంబంధించి రాష్ట్రాలను కింది కేటగిరీల మధ్య విభజించారు.

1. Achiever - ఎస్.డి.జి. ఇండియా సూచీ స్కోరు 100కు సమానమైన రాష్ట్రాలు ఈ కేటగిరీలో ఉంటాయి.
2. Front Runner - స్కోరు 65 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండి వందలోపు సాధించిన రాష్ట్రాలు ఈ కేటగిరీలో ఉంటాయి.
ఉదా: కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు
3. Performer - స్కోరు 50 కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉండి 65 కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఈ కేటగిరీలో ఉంటాయి.
ఉదా: ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ర్ట, తెలంగాణ
4. Aspirant - స్కోరు 50 కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఈ కేటగిరీలో ఉంటాయి.
ఉదా: ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాం
  • నేషనల్ శాంపుల్ సర్వే అంచనా ప్రకారం శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు సాధారణ స్థితి ఆధారంగా 2011-12లో 39.5 శాతం కాగా 2017-18లో 36.9 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో ఇదే కాలానికి సంబంధించి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో తగ్గుదల 3.6 శాతం కాగా పట్టణ ప్రాంతాలలో 0.1 శాతం.
  • ప్రతి వెయ్యిమంది వ్యక్తులకుగాను ఎంతమందికి ఉపాధి లభించింది అనే స్థితిని శ్రామిక జనాభా నిష్పత్తి (Worker Population Ratio) తెలుపుతుంది. నేషనల్ శాంపుల్ సర్వే అంచనా ప్రకారం శ్రామిక జనాభా నిష్పత్తి సాధారణ స్థితి ఆధారంగా 2011-12లో 38.6 శాతం కాగా 2017-18లో 34.7 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే కాలానికి సంబంధించి శ్రామిక-జనాభా నిష్పత్తిలో తగ్గుదల 4.9 శాతం కాగా పట్టణ ప్రాంతాలలో 1.6 శాతం.
  • సాధారణ స్థితి ఆధారంగా భారత్‌లో నిరుద్యోగిత రేటు 2017-18లో 6.1 శాతం కాగా గ్రామీణ ప్రాంతాలలో 5.3 శాతం, పట్టణ ప్రాంతాలలో 7.8 శాతంగా నమోదైంది.
  • వారం వారీ స్థితి ఆధారంగా భారత్‌లో నిరుద్యోగిత రేటు 2017-18లో 8.9 శాతం కాగా గ్రామీణ ప్రాంతాల్లో 8.5 శాతం, పట్టణ ప్రాంతాలలో 9.6 శాతంగా నమోదైంది.
మాదిరి ప్రశ్నలు:
Published date : 23 Aug 2019 02:29PM

Photo Stories