రైతు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 2018లో అధికంగా మహారాష్ర్ట తర్వాత ఏ రాష్ర్టంలో నమోదైంది?
భారత సామాజిక - ఆర్థికాభివృద్ధ్దిలో గ్రామీణాభివృద్ధిని అంతర్భాగంగా భావించవచ్చు. నిరుద్యోగ నిర్మూలన, అల్ప ఉద్యోగిత తగ్గింపు, ప్రజల జీవన ప్రమాణం పెంపు, ఉత్పాదకత పెంపు ద్వారా గ్రామీణ పేద ప్రజల ఆదాయ స్థాయి పెంపు, గ్రామీణ ప్రజలకు మౌలిక సౌకర్యాల (శుభ్రమైన తాగునీరు, ఎలిమెంటరీ విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ రోడ్లు) కల్పన గ్రామీణాభివృద్ది లక్ష్యాలుగా పేర్కొనవచ్చు.
స్వాతంత్య్రానికి పూర్వం ‘మహాత్మాగాంధీ గ్రామీణ పునర్నిర్మాణ కార్యక్రమం’, శ్రీనికేతన్ ప్రాజెక్టు, ది మార్తండం ప్రాజెక్టు, ది గుర్గావ్ ప్రయోగం, బరోడాలో గ్రామీణ పునర్నిర్మాణ కార్యక్రమం, ది ఫిర్కా అభివృద్ధి పథకం ద్వారా గ్రామీణాభివృద్ధికి కృషి జరిగింది.
స్వాతంత్య్రానంతరం ది Etawah పైలట్ ప్రాజెక్టు, ది నీలోఖెరి ప్రయోగం, భూదాన ఉద్యమంలాంటి గ్రామీణ పునర్నిర్మాణ కార్యక్రమాలతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా యుగంలో అనేక పథకాలను ప్రవేశపెట్టి గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేసింది.
1. గ్రామీణాభివృద్ధిలో ఎదురవుతున్న సమస్యలు:
✪ గ్రామీణ శ్రామిక శక్తి వృత్తులవారీ పంపిణీలో మార్పు తక్కువగా ఉండటం
✪ స్థానిక సంస్థలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి లేకపోవడం
✪ గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ తక్కువగా ఉన్నందు వల్ల ప్రైవేటు పెట్టుబడులు తక్కువగా ఉండటం
✪ భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కొరత
✪ జనాభావృద్ధి రేటు అధికంగా ఉన్నందువల్ల భూమి అనేక ముక్కలుగా విడిపోవడం
✪ గ్రామీణ శ్రామిక శక్తిలో నైపుణ్యత కొరవడటం
✪ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించడానికి అనువైన ఆర్థిక వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో కొరవడటం
✪ వ్యవసాయరంగంలో సగటు కమత పరిమాణం తక్కువగా ఉన్నందువల్ల ఉత్పాదకత తగ్గి రైతుల ఆదాయాల్లో క్షీణత
✪ ప్రణాళికల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో ప్రజా భాగస్వామ్యం లేకపోవడం
✪ గ్రామీణ పేద మహిళలకు సంబంధించిన పథకాలు ఆచరణలో విజయవంతం కాకపోవడం వల్ల మహిళాసాధికారతకు అవరోధం
✪ స్థానిక పరిస్థితులు, అవసరాలకనుగుణంగా పథకాలు/కార్యక్రమాలను రూపొందించకపోవడం
✪ గ్రామీణ ప్రజలు కింది అంశాల విషయంలో పరిమిత నియంత్రణను కల్గి ఉండటం
1. ఉపాధి అభద్రత, అల్ప ఆదాయాలు
2. ఉమ్మడి వనరులపై పరిమిత నియంత్రణ
3. ఆస్తుల ఉత్పాదకత తక్కువగా ఉండటం
4. అధిక నిరక్షరాస్యత, ఆరోగ్య, పౌష్టికాహార ప్రమాణాలు తక్కువగా ఉండటం
5. పరపతి, మార్కెటింగ్, సమాచారం లభ్యత తక్కువగా ఉండటం
2. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు:
స్వాతంత్య్రానంతరం గ్రామీణాభివృద్ధి నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు, పథకాలను కింది విధంగా వర్గీకరించవచ్చు.
1. వేతన, స్వయం ఉపాధి పథకాలు
2. గ్రామీణ అవస్థాపన, మౌలిక సౌకర్యాల కల్పన పథకాలు:
ఎ. వాటర్ షెడ్ డెవలప్మెంట్, హరియాలీ
బి. భూమిసమీకరణ
సి. భూ సంస్కరణలు
డి. భూరికార్డుల కంప్యూటరీకరణ
3. సహజవనరుల యాజమాన్య పథకాలు
4. సాంఘిక భద్రతా పథకాలు
3. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ :
✪ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలోని భూవనరుల డిపార్టమెంటు భూసంస్కరణలకు బాధ్యత వహిస్తుంది. జాతీయ భూవనరుల ఆధునికీకరణ కార్యక్రమం కింద ఈ డిపార్టమెంటు తగిన మద్దతును రాష్ట్రాలకు అందిస్తుంది. సంఘటిత వాటర్‌షెడ్ యాజమాన్య ప్రక్రియలో భాగంగా భూమి ఉత్పాదకత పెంపు డిపార్టమెంటు లక్ష్యంగా ఉంటుంది.
✪ 2019-20 వివిధ మంత్రిత్వశాఖలకు జరిపిన కేటాయింపుల పరంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నాలుగో స్థానం పొందింది. సవరించిన అంచనాల ప్రకారం 2018-19లో గ్రామీణాభివృద్ధ్ది మంత్రిత్వశాఖకు రూ. 1,12,404 కోట్లు కేటాయించగా, 2019-20లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 1,17,647 కోట్ల కేటాయింపు జరిగింది.
4. రైతు ఆత్మహత్యలు- నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో:
✪ నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 1995-2013 మధ్య కాలంలో 2,96,438 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే కాలంలో మొత్తం రైతు ఆత్మహత్యల్లో మహారాష్ర్ట వాటా అధికంగా 23.50 శాతం కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 18.10 శాతం, ఉత్తరప్రదేశ్ 16.80 శాతం, కర్ణాటక 14.70 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
✪ నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో 2020 జనవరిలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2016లో రైతు ఆత్మహత్యలు 11,379 నుంచి 2018లో 10,349కు తగ్గాయి. 2018లో దేశంలో మొత్తం ఆత్మహత్యల్లో (1,34,516) రైతు ఆత్మహత్యల వాటా 7.7 శాతం. వ్యవసాయరంగానికి సంబంధించి 2018లో బలవన్మరణానికి పాల్పడినవారిలో 5,763 మంది రైతులు కాగా, 4,586 మంది వ్యవసాయ శ్రామికులు. పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్, ఉత్తరాఖండ్, మేఘాలయా, గోవా, చండీగఢ్, డామన్ - డయు, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు నమోదు కాలేదు.
✪ ఆంధ్రప్రదేశ్‌లో 2018లో సొంత భూమిని సాగు చేసుకొనే 199 మంది రైతులు, 166 కౌలు రైతులు, 299 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణలో సొంత భూమిని సాగు చేసుకొనే 720 మంది రైతులు, 180 కౌలు రైతులు, 8 మంది వ్యవసాయ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు అధికంగా మహారాష్ర్టలో నమోదు కాగా తర్వాత స్థానంలో కర్ణాటక నిలిచింది.
5. గ్రామీణ వ్యవసాయేతర ఉపాధి:
మైనింగ్ - క్వారియింగ్, తయారీ, ప్రాసెసింగ్, రిపేరు, నిర్మాణం, వాణిజ్యం - వర్తకం, రవాణా కార్యకలాపాల్లో ఉపాధిని వ్యవసాయేతర ఉపాధిగా భావిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉపాధి 1993-94లో 21.6 శాతం కాగా, 2004-05లో 27.4 శాతం, 2011-12లో 35.9 శాతానికి పెరిగింది. ఈ ఉపాధి కేరళలో అధికం కాగా మధ్యప్రదేశ్‌లో తక్కువ. గ్రామీణ వ్యవసాయేతర ఉపాధి కేరళ (68.6 శాతం) తర్వాత తమిళనాడు (48.8 శాతం), పంజాబ్ (47.6 శాతం), పశ్చిమబెంగాల్ (46.8 శాతం)లో అధికంగా నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ వ్యవసాయేతర ఉపాధి 2011-12లో 30.5 శాతం.
6. గ్రామీణ విద్యుదీకరణ :
ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2017 ప్రకారం 2016లో ఆంధ్రప్రదేశ్, హరియాణ, గుజరాత్, కేరళ, మహారాష్ర్ట, పంజాబ్‌లో 100 శాతం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. తెలంగాణలో 98 శాతం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. దేశంలోని మొత్తంగా 98.1 శాతం గ్రామాలు విద్యుత్ సౌకర్యానికి నోచుకున్నాయి, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, పంజాబ్, తమిళనాడులో 2018లో 100 శాతం కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. తెలంగాణలో 93.57 శాతం కుటుంబాలు, దేశవ్యాప్తంగా 78.24 శాతం కుటుంబాలు విద్యుదీకరణకు నోచుకున్నాయి. జాతీయ సగటు కంటే ఒడిశా, అసోం, జార్ఖంఢ్‌లో విద్యుదీకరణ పొందిన కుటుంబాలు జాతీయ సగటు కంటే తక్కువ.
7. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005:
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంపిక చేసిన ప్రాంతాల్లో 2006 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యత లేని వయోజనులకు 100 రోజుల వేతన ఉపాధి కల్పనకు ఈ చట్టం హామీనిస్తుంది. ఈ పథకం కింద 2006-07లో రూ. 8,824 కోట్ల వ్యయం చేయగా, 2017-18లో ఈ మొత్తం రూ.48,000 కోట్లకు పెరిగింది. ఈ పథకంపై జరిగిన వ్యయం ఇదే కాలంలో జి.డి.పి.లో 0.19 శాతం నుంచి 0.003 శాతానికి తగ్గింది. 2019-20 కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. 2018-19లో ఈ పథకం కింద రూ. 267.96 కోట్లు వ్యక్తి గత పనిదినాలు కల్పించారు. ఈ మొత్తం పనిదినాల్లో మహిళల వాటా 55.6 శాతం కాగా, షెడ్యూల్డ్ కులాల వాటా 20.7 శాతం, షెడ్యూల్డ్ తెగల వాటా 17.4 శాతం.
8. గ్రామీణ అవస్థాపనా అభివృద్ధి నిధి :
గ్రామీణ అవస్థాపనా అభివృద్ధి నిధిని నాబార్డ 1995-96లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వ్యవసాయ అనుబంధరంగం, సాంఘిక రంగం, గ్రామీణ కనెక్టివిటీలాంటి మూడు ముఖ్యకార్యకలాపాలు, 37 ఉపకార్యకలాపాలు ఈ నిధిలో భాగంగా ఉంటాయి. 1995-96లో ఈ నిధి కింద నాలుగు ఉపకార్యకలాపాలకు రూ. 2,000 కోట్లు కేటాయించగా 2018-19లో 37 ఉపకార్యకలాపాలకు రూ. 28,000 కోట్లు కేటాయించారు. ఈ నిధి 2018-19లో నీటిపారుదల, గ్రామీణ రోడ్లకు అధిక మొత్తం కేటాయించింది. నాబార్డ్ అవస్థాపనా అభివృద్ధి సహాయాన్ని 2010-11లో ప్రారంభించింది.
నాబార్డ్ అవస్థాపనా అభివృద్ధ్ది సహాయం 2018-19లో నీటిపారుదల, పునరుత్పాదక శక్తి, రోడ్లు, విద్యుత్ ట్రాన్సమిషన్కు రూ. 7,363.75 కోట్లు కేటాయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ)ను రూ. 21,975 కోట్ల కార్పస్‌తో మొదటి దశలో అందుబాటు గృహాలకు 2017-18లో నాబార్డ్ ప్రారంభించింది. నాబార్డ్ కింద ‘గిడ్డంగుల అవస్థాపనా నిధి’ని 2013-14లో ప్రారంభించారు.
మాదిరి ప్రశ్నలు :
1. కింది వాటిలో గ్రామీణ వేతన ఉపాధి పథకం ఏది?
1) చిన్న రైతుల అభివృద్ధ్ది ఏజెన్సీ
2) జవహర్ గ్రామ సమృద్ధ్ది యోజన
3) కమాండ్ ఏరియా అభివృద్ధి కార్యక్రమం
4) స్వర్ణ జయంతి గ్రామస్వరోజ్గార్ యోజన
- View Answer
- సమాధానం: 2
2. 2011 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం గ్రామీణ జనాభాలో కింది ఏ రాష్ర్టం వాటా ఎక్కువ?
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) బిహార్
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 1
3. 2011 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో అధిక వాటా కలిగిన మహారాష్ర్ట వాటా?
1) 10.48 శాతం
2) 12.48 శాతం
3) 13.48 శాతం
4) 15.65 శాతం
- View Answer
- సమాధానం: 3
4. స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజనలో విలీనమైన కార్యక్రమం ఏది?
ఎ) ట్రైసం
బి) డ్వాక్రా
సి) జాతీయ విస్తరణ సేవలు
డి) మిలియన్ బావుల పథకం
1) ఎ, సి
2) బి, సి
3) సి, డి
4) ఎ, బి, డి
- View Answer
- సమాధానం: 4
5. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం 2018లో దేశంలో మొత్తం రైతుల ఆత్మహత్యలు?
1) 10,149
2) 10,349
3) 11,379
4) 12,379
- View Answer
- సమాధానం: 2
6. గ్రామీణ వ్యవసాయేతర ఉపాధి 2011-12లో కింది ఏ రాష్ర్టంలో ఎక్కువ?
1) మధ్యప్రదేశ్
2) పంజాబ్
3) కేరళ
4) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
7. గ్రామీణ కుటుంబాల్లో 2018లో వంద శాతం విద్యుదీకరణకు నోచుకోని రాష్ర్టం ఏది?
1) ఒడిశా
2) గుజరాత్
3) ఆంధ్రప్రదేశ్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 1
8. రైతు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 2018లో అధికంగా మహారాష్ర్ట తర్వాత కింది ఏ రాష్ర్టంలో నమోదైంది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధంలేని కార్యక్రమం ఏది?
1) నెహ్రూ రోజ్‌గార్ యోజన
2) పి.ఎం. గ్రామసడక్ యోజన
3) దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన
4) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
- View Answer
- సమాధానం: 1
10. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను కింది ఏ విధంగా వర్గీకరించవచ్చు?
ఎ) వేతన, స్వయం ఉపాధి పథకాలు
బి) సహజవనరుల యాజమాన్య పథకాలు
సి) సాంఘిక భద్రతా పథకాలు
డి) గ్రామీణ అవస్థాపనా పథకాలు
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
11. కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, ఎడారుల అభివృద్ది నిమిత్తం 1966లో ప్రారంభమైన పథకం ఏది?
1) ప్రాంతాల అభివృద్ధ్ది కార్యక్రమం
2) ఉపాంత రైతుల, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ
3) సమీకృత గ్రామీణాభివృద్ధి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
12. సంవత్సరంలో పదినెలల కాలంలో ప్రతి జిల్లాలో వెయ్యి మందికి ఉపాధి కల్పనకు సంబంధించి 1971లో ప్రారంభమైన పథకం?
1) పనికి ఆహార పథకం
2) క్రాష్ స్కీం ఫర్ రూరల్ ఎంప్లాయిమెంట్
3) ఉపాధి హామీ పథకం
4) జాతీయ విస్తరణ సేవలు
- View Answer
- సమాధానం: 2
13. స్వాతంత్య్రానంతరం గ్రామీణాభివృద్ధ్దికి సంబంధించిన కార్యక్రమం?
1) శ్రీనికేతన్ ప్రాజెక్ట్
2) భూదాన ఉద్యమం
3) మార్తాండం ప్రాజెక్ట్
4) గుర్గావ్ ప్రాజెక్ట్
- View Answer
- సమాధానం: 2
14. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (1995), కింద అమలు అయిన పథకాల్లో లేనిది ఏది?
1) జాతీయ ఆహార భద్రతా మిషన్
2) ఇందిరా గాంధీ జాతీయ వృద్దాప్య పెన్షన్ పథకం
3) ఇందిరా గాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం
4) ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం
- View Answer
- సమాధానం: 1
15. సేవాగ్రాం (1920) ప్రాజెక్ట్ కింది వారిలో ఎవరి కృషి ఫలితంగా ప్రారంభమైంది?
1) రవీంద్రనాథ్ ఠాగూర్
2) మహాత్మాగాంధీ
3) బి.ఎన్. గుప్తా
4) F.L. Bryne
- View Answer
- సమాధానం: 2
16. వ్యవసాయేతర ఉపాధి 2011-12లో కింది ఏ రాష్ర్టంలో తక్కువ?
1) మధ్యప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) తమిళనాడు
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 1