‘ఆరోగ్య’ సూచికల విషయంలో అధిక ప్రగతి కనిపించే రాష్ట్రాలు ఏవి?
‘ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్’ 2005 నుంచి ప్రతి సంవత్సరం నేషనల్ హెల్త్ ప్రొఫైల్‌ను విడుదల చేస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, దేశంలోని జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి గణాంకాలను సేకరించింది.
ఆరోగ్య వ్యయం:
- భారత్‌లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రాచుర్యం పొందింది. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం 2009–10, 2018–19 మధ్య కాలంలో జి.డి.పి.లో 1.12 శాతం నుంచి 1.28 శాతానికి పెరిగిందని ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్–2019’ పేర్కొంది. గత కొంత కాలంగా ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయ లక్ష్యం జి.డి.పి.లో 2.5 శాతంగా ఉన్నప్పటికీ లక్ష్య సాధనలో ప్రభుత్వం వెనుకబడింది.
- భారత్‌లో ఆరోగ్య ట్రీట్‌మెంట్ వ్యయంలో పెరుగుదల కారణంగా ఆరోగ్య సంరక్షణ సేవల అందుబాటులో వివిధ వర్గాల ప్రజల మధ్య అసమానతలు పెరిగాయి. ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయం 2009–10లోరూ. 621 కాగా, 2017–18లో రూ. 1,657కు పెరిగింది. ఒక్కో శిశు జననానికి సగటు ఆరోగ్యంపై వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,587, పట్టణ ప్రాంతాల్లో రూ. 2,117గా నేషనల్ హెల్త్ ప్రొఫైల్ పేర్కొంది. నేషనల్ శాంపిల్ సర్వే 71వ రౌండ్ ప్రకారం ఆసుపత్రుల్లో ఉన్న కాలంలో సగటు ఆరోగ్య వ్యయం జనవరి 2013 నుంచి జూన్ 2014 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ. 14,935, పట్టణ ప్రాంతాల్లో రూ. 24,436గా నమోదైంది.
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2011లో స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగం సందర్భంగా పన్నెండో పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యంపై సగటు వ్యయం జి.డి.పి.లో 2.5 శాతం ఉండగలదని ప్రకటించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 2018లో ‘పార్టనర్స్ ఫోరం’ సమావేశంలో ప్రసంగిస్తూ 2025 నాటికి భారత ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని జి.డి.పి.లో 2.5 శాతానికి పెంచడానికి కృషి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత వ్యయంతో పోల్చినపుడు ఆరోగ్య వ్యయం 2025లో 100 బిలియన్ డాలర్లకుపైగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.
- ఆరోగ్య వ్యయం పరంగా రాష్ట్రాల మధ్య అసమానతలను ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019’ పేర్కొంది. 2015–16లో సగటు తలసరి ప్రభుత్వ వ్యయం ఈశాన్య రాష్ట్రాల్లో అధికం కాగా, Empowered action group రాష్ట్రాలు, అస్సాంలో తక్కువ. సాంఘిక–ఆర్థికాభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాలు బిహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లు Empowered action group రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరం ఆరోగ్యంపై అధికంగా జి.ఎస్.డి.పి.లో 4.20 శాతం, అరుణాచల్‌ప్రదేశ్ 3.29 శాతం వ్యయం చేస్తున్నాయి. ఆరోగ్యంపై జమ్మూ,కశ్మీర్ రాష్ట్ర వ్యయం జి.ఎస్.డి.పి.లో 2.46 శాతంగా నమోదైంది. ఆరోగ్య సూచికల విషయంలో అధిక ప్రగతి కనపర్చిన తమిళనాడు, కేరళలు ‘హెల్త్ ఫైనాన్స్ సూచీ’ లో వెనుకబడటాన్ని గమనించవచ్చు. ఆరోగ్యంపై తమిళనాడు జి.ఎస్.డి.పి.లో 0.74 శాతాన్ని, కేరళ 0.93 శాతాన్ని వ్యయం చేస్తున్నాయి.
- 2016లో భారత్ తలసరి ప్రభుత్వ ఆరోగ్య వ్యయం 16 డాలర్లు కాగా, నార్వే, కెనడా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రూనే దారుసలాంతో పోల్చినప్పుడు భారత్‌లో తలసరి ప్రభుత్వ ఆరోగ్య వ్యయం తక్కువ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ అభిప్రాయంలో గణాంకాలు సేకరించిన 23 దేశాల్లో అమెరికాలో తలసరి ప్రభుత్వ ఆరోగ్య వ్యయం ఎక్కువ.
కింది ముఖ్య సూచికలకు సంబంధించిన సమాచారాన్ని నేషనల్ హెల్త్ ప్రొఫైల్–2019 వెల్లడించింది.
1. జనాభా సూచికలు, జనాభా, ముఖ్య గణాంకాలు.
2. సాంఘిక–ఆర్థికాభివృద్ధి సూచికలు: విద్య, ఉపాధి, గృహ, తాగునీరు, పారిశుధ్యం
3. ఆరోగ్య స్థితి సూచికలు: సంక్రమణ, సంక్రమణ కాని వ్యాధులు
4. ఆరోగ్య ఫైనాన్స్ సూచికలు: ఆరోగ్యరంగంలో బీమా, వ్యయం
5. మానవ వనరులు ఆరోగ్యం: ఆరోగ్య రంగంలో పనిచేసే Manpower లభ్యత
6. ఆరోగ్య అవస్థాపన: మెడికల్, డెంటల్ కాలేజీల వివరాలు,ఆయుష్ సంస్థలు, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు.
- జనన రేటు, మరణ రేటు, సహజవృద్ధి రేటులో 1991 నుంచి 2017 మధ్య కాలంలో గణనీయమైన తగ్గుదల ఏర్పడింది.
- భారత్‌లో ఆయుఃప్రమాణం 1970–75 మధ్య కాలంలో 49.7 సంవత్సరాలు కాగా, 2012–16 మధ్యకాలంలో 68.7 సంవత్సరాలకు పెరిగింది.
- 2012–16 మధ్య కాలంలో ఆయుఃప్రమాణం పురుషుల్లో 67.4 సంవత్సరాలు, మహిళల్లో 70.2 సంవత్సరాలుగా నమోదైంది.
- అధిక జనసాంద్రత ప్రతి చ.కి..మీ.కు అధికంగా NCT of ఢిల్లీ(11,320)లో నమోదు కాగా, అల్పంగా అరుణాచల్‌ప్రదేశ్ లో (17) నమోదైంది.
- యువత, ఆర్థిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే జనాభాలో పెరుగుదలను సర్వే పేర్కొంది. 14 సంవత్సరాల వయోవర్గం మొత్తం జనాభాలో 27 శాతం కాగా, 15–59 వయోవర్గం (ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే వారు) 64.7 శాతం.
- జననరేటు, మరణరేటు, సహజవృద్ధిరేటు, పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ.
- గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ విద్య అవస్థాపనలో వృద్ధి వేగవంతమైంది. దేశంలో 529 మెడికల్, బి.డి.ఎస్.కు సంబంధించి 313 డెంటల్ కళాశాలలు, ఎం.డి.ఎస్. విద్యకు 253 డెంటల్ కళాశాలలు ఉన్నాయి. 2018–19లో మెడికల్ కళాశాలల్లో 58,756, డెంటల్ కళాశాలల్లో బి.డి.ఎస్. (26,960) ఎం.డి.ఎస్. (6288) కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్ పొందారు.
- నైపుణ్యత ఉన్న డాక్టర్లను సంప్రదించే విషయంలోను, ఆస్పత్రుల్లో చేరి వైద్య సౌకర్యం పొందే విషయంలోను మహిళలు నిర్లక్ష్యానికి గురయ్యారని నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పురుష పేషెంట్ల ఆసుపత్రి సగటు వ్యయం (రూ.19,727) కంటే మహిళల వ్యయం 28 శాతం తక్కువ. పట్టణ ప్రాంతాల్లో పురుష పేషెంట్ల ఆసుపత్రి సగటు వ్యయం (రూ.30,450) కంటే మహిళల వ్యయం 25 శాతం తక్కువ.
- దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు సహజవృద్ధి రేటు 13.9.
- ఆరోగ్య సూచికలకు సంబంధించి 2018లో సంక్రమణ వ్యాధుల కారణంగా అధిక సంఖ్యలో మలేరియా కేసులు, మరణాలుఛత్తీస్‌గఢ్‌లో సంభవించాయి.
- చికెన్ గున్యా కేసులు 2017లో 67,769 కాగా, 2018లో 57,813కు తగ్గాయి.
- 2012, 2013తో పోల్చినప్పుడు 2014లో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాలలో తగ్గుదల సంభవించింది. తిరిగి 2015లో పెరిగి 2016లో తగ్గి తర్వాత రెండు సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయి.
- యువతలో ఆత్మహత్య మరణాలు (30–45 వయోవర్గం) 44,593 నమోదయ్యాయి.
- దేశంలో దివ్యాంగుల సంఖ్య 2.68 కోట్లు
- సంక్రమణ కాని వ్యాధులకు సంబంధించి 6.51 కోట్లు పేషెంట్స్ NCD క్లినిక్‌లలో పరీక్షలు చేయించుకోగా, వీరిలో 4.75 శాతం డయాబిటిస్, 6.19 శాతం హైపర్ టెన్షన్, 0.30 శాతం కార్డియోవాస్కులర్, 0.10 శాతం stroke, 0.26 శాతం సాధారణ కేన్సర్ వ్యాధులకు గురయ్యారని గుర్తించినట్లు నివేదిక పేర్కొంది.
- 60 సంవత్సరాలు, అంతకు మించిన వయోవర్గ జనాభా 2017లో భారత్ మొత్తం జనాభాలో 8.2 శాతం కాగా, ఈ వయోవర్గ జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభాలో 9.5 శాతం, తెలంగాణ జనాభాలో 8.2 శాతం.
- భారత్‌లో జనన రేటు ప్రతి వెయ్యి జనాభాకు 2017లో 20.2 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 21.8, పట్టణ ప్రాంతాల్లో 16.8గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ జనన రేటు ప్రతి వెయ్యి జనాభాకు 16.2 కాగా గ్రామీణ ప్రాంతాలలో 16.5, పట్టణ ప్రాంతాలలో 15.5. తెలంగాణలో జనన రేటు ప్రతి వెయ్యి జనాభాకు సంవత్సరంలో 17.2 కాగా గ్రామీణ ప్రాంతాలలో 17.5, పట్టణ ప్రాంతాల్లో 16.8గా నమోదైంది. జననరేటు అధికంగా బిహార్‌లో (26.4) నమోదైంది.
- మరణరేటు ప్రతి వెయ్యి జనాభాకు 2017లో భారత్‌లో 6.3, ఆంధ్రప్రదేశ్‌లో 7.2 , తెలంగాణలో 6.6గా నమోదైంది.
- 2011 లెక్కల ప్రకారం దేశంలో జిల్లాల సంఖ్య 640, సబ్–జిల్లాల సంఖ్య 5988, పట్టణాల సంఖ్య 7933 కాగా మొత్తం గ్రామాల సంఖ్య 6,40,932. తెలంగాణ కలుపుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 లెక్కల ప్రకారం జిల్లాల సంఖ్య 23, సబ్–జిల్లాలు 1128, పట్టణాలు 353, గ్రామాలు 27,800.
- శిశు మరణాలు 2017లో భారత్‌లో ప్రతి వెయ్యి జననాలకు 33 (బాలురు 32, బాలికలు 34) కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 32 (బాలురు 31, బాలికలు 33), తెలంగాణలో 29 (బాలురు 28, బాలికలు 29)గా నమోదయ్యాయి. శిశు మరణాలు అధికంగా మధ్యప్రదేశ్‌లో, అల్పంగా నాగాలాండ్‌లో నమోదైంది.
- సంతాన సాఫల్యతా రేటు 2016లో దేశంలో 2.3 (గ్రామీణ 2.5, పట్టణ 1.8) కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 1.7 (గ్రామీణ 1.7, పట్టణ 1.5). తెలంగాణలో 1.7 (గ్రామీణ 1.8, పట్టణ 1.6)గా నమోదైంది. సంతానసాఫల్యతా రేటు అధికంగా బిహార్‌లోను (3.3) అల్పంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ (1.6) గా నమోదైంది.
- ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష జననాలకు 2014–16 మధ్య కాలంలో దేశంలో 130 కాగా ఆంధ్రప్రదేశ్‌లో 74. ప్రసూతి మరణాల రేటు అధికంగా అసోం, అల్పంగా కేరళలో నమోదైంది.
1. నేషనల్ హెల్త్ ప్రొఫైల్–2019 రూపొందించిన సంస్థ ఏది?
1) ప్రపంచ ఆరోగ్య సంస్థ
2) ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్
3) యునెస్కో
4) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 2
2. 2009–10 నుంచి 2018–19 మధ్య కాలంలో ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం జి.డి.పి.లో 1.12 శాతం నుంచి ఎంతకు పెరిగిందని నేషనల్ హెల్త్ ప్రొఫైల్ అంచనా వేసింది?
1) 1.28 శాతం
2) 1.5 శాతం
3) 1.8 శాతం
4) 1.9 శాతం
- View Answer
- సమాధానం: 1
3. 2018లో అధికంగా మలేరియా కేసులు, మరణాలు కింది ఏ రాష్ట్రంలో సంభవించాయి?
1) కేరళ
2) కర్ణాటక
3) ఛత్తీస్‌గఢ్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 3
4. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం 2025 నాటికి ఎంతకు చేరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు?
1) 80 బిలియన్ డాలర్లు
2) 100 బిలియన్ డాలర్లు
3) 110 బిలియన్ డాలర్లు
4) 150 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
5.ఈశాన్య రాష్ట్రాల్లో కింది ఏ రాష్ట్రం జి.ఎస్.డి.పి.లో అధికంగా ఆరోగ్యంపై వ్యయం చేసింది?
1) మిజోరాం
2) అరుణాచల్‌ప్రదేశ్
3) సిక్కిం
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 1
6. ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయాన్ని 2017–18లో నేషనల్ హెల్త్ ప్రొఫైల్–2019 ఎంతగా అంచనా వేసింది?
1) రూ. 1,117
2) రూ.1,217
3) రూ.1,557
4) రూ. 1,657
- View Answer
- సమాధానం: 4
7. ఆరోగ్య సూచికల విషయంలో అధిక ప్రగతి కనిపించే రాష్ట్రాలు ఏవి?
1) కర్ణాటక, తెలంగాణ
2) కేరళ, తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్, జార్ఖండ్
4) బిహార్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
8. శిశు మరణాలు 2017లో దేశంలో ఎంతగా నమోదయ్యాయి?
1) 31
2) 32
3) 33
4) 35
- View Answer
- సమాధానం: 3
9. ప్రసూతి మరణాల రేటు అధికంగా కింది ఏ రాష్ట్రంలో నమోదైంది?
1) అసోం
2) కర్ణాటక
3) తెలంగాణ
4) బిహార్
- View Answer
- సమాధానం: 1
10. 2011 జనాభా గణాంకాల ప్రకారం దేశంలోని జిల్లాల సంఖ్య ?
1) 580
2) 610
3) 640
4) 670
- View Answer
- సమాధానం: 3
11. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు తక్కువగా కింది ఏ రాష్ట్రంలో నమోదైంది?
1) జార్ఖండ్
2) అరుణాచల్‌ప్రదేశ్
3) సిక్కిం
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
12. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ –2019 ప్రకారం శిశు మరణాలు అధికంగా కింది ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి?
1) మధ్యప్రదేశ్
2) బిహార్
3) సిక్కిం
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
13. ప్రసూతి మరణాలు 2014–16 మధ్య ప్రతి లక్ష జననాలకు దేశంలో ఎంతగా నమోదయ్యాయి?
1) 110
2) 120
3) 130
4) 145
- View Answer
- సమాధానం: 3
14. నేషనల్ హెల్త్ ప్రొఫైల్–2019 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు సహజవృద్ది రేటు ఎంత?
1) 10.9
2) 13.9
3) 14.5
4) 15.2
- View Answer
- సమాధానం: 2
15. సంతాన సాఫల్యతా రేటు అధికంగా కింది ఏ రాష్ట్రంలో నమోదైంది?
1) బిహార్
2) కర్ణాటక
3) ఉత్తరాఖండ్
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 1