Skip to main content

TS Government Jobs: పోటీప‌రీక్ష‌ల‌కు తెలంగాణ చరిత్రే కీలకం.. ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

తెలంగాణ‌లో భారీగా ఉద్యోగ నోటిఫికేష‌న్లు రానున్న నేప‌థ్యంలో.. పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిప‌రేష‌న్ కొన‌సాగిస్తున్న అభ్య‌ర్థులు తెలంగాణ చరిత్ర‌పై ఒక స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. వివిధ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కువగా తెలంగాణ కోణంలోనే ఉండనున్నాయి.
telangana history and culture
Telangana History and Culture

గ్రూప్-1, గ్రూప్-2లో తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ఉద్య‌మం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు ప్రత్యేకంగా పెట్టిన పేపర్లలోనే కాదు వేరే పోటీ పరీక్షల జనరల్ స్టడీస్, ఇతర పేపర్లలోనూ తెలంగాణ కోణంలో ప్రశ్నలు ఉండనున్నాయి. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, గ్రూప్-3, గ్రూప్-4 వంటి పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష పేపర్లలోనూ తెలంగాణకు సంబంధించిన అంశాలకు పెద్దపీట వేసి ప్రశ్నపత్రాలు రూపొందించే అవకాశం ఉంది. వాటిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

వీటిని చ‌ద‌వాల్సిందే..
తెలంగాణ చరిత్ర, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, నైసర్గిక స్వరూపం, వివిధ పోరాటాలు, ఉద్యమాలు.. ఇలా అన్నింటిపై ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోవాల్సిందే. ఈ క్రమంలో ఏయే పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి.. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.. అన్న అంశాలను టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ మాజీ సభ్యుడు, హిస్టరీ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈ దిశగా అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావాలి..
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యే ఉద్యోగులకు తమ ప్రాంతంపై సంపూర్ణ అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగాల్లో చేరి.. వచ్చే 20-30 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించే వారికి రాష్ట్ర స్థితిగతులు, భవిష్యత్తు అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి ఉండాలి. గతాన్ని వదిలేయకుండా చరిత్రను తెలుసుకుంటేనే భవిష్యత్తుకు బాటలు వేయగలుగుతారు. అందుకే పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్ర, పోరాటాలు, ఉద్యమాలు, ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులపై ప్రశ్నలు ఉండబోతున్నాయి. ఈ దిశగా అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావాలి.

వీటికి ప్రాధాన్యం తగ్గించాం.. ఎందుకంటే..?
అకడమిక్, పోటీ పరీక్షల మధ్య మౌలికమైన తేడా ఉంటుంది. అక్కడ పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలే అడుగుతారు. కానీ పోటీ పరీక్షల్లో పాఠ్య పుస్తకాల్లోని అంశాలతో పాటు సామాజిక, చారిత్రకాంశాలపై అవగాహన ఉండాలి. అందుకే హిస్టరీ అనగానే బీఏలో (డిగ్రీ) హిస్టరీ చదువుకున్న వారికే సులభం అనే అపోహ అక్కర్లేదు. ఆర్ట్స్, సైన్స్, టెక్నికల్, వృత్తి విద్యా కోర్సులు.. ఇలా అన్ని రకాల కోర్సులు చేసినవారికీ తగ్గట్టుగా అందరూ చదువుకునేలా సిలబస్‌ను రూపొందించాం. ఇందులో ప్రధానంగా రాజకీయాలు, రాజ వంశాలు, యుద్ధాలు, వాటి తేదీల (కాలం) ప్రాధాన్యాన్ని చాలా వరకు తగ్గించాం. ఉదాహరణకు శాతవాహనుల కాలం తీసుకుంటే వారి పరిపాలన క్రమం (తేదీలు), రాజుల వంశ క్రమంపై చరిత్రకారుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి వాటికి ప్రాధాన్యం తగ్గించాం.

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

ఇలా విభజించుకోండి..
తెలంగాణకు సంబంధించిన సిలబస్‌ను అర్థం చేసుకునేందుకు నాలుగు భాగాలుగా విభజించుకొని సిద్ధమైతే ఉపయోగంగా ఉంటుంది.
☛ ప్రాచీన తెలంగాణ చరిత్ర-సంస్కృతి
☛ మధ్యయుగ తెలంగాణ చరిత్ర
☛ ఆధునిక తెలంగాణ చరిత్ర
☛ సమకాలీన తెలంగాణ చరిత్ర(1948-2014)గా సిలబస్‌ను విభజించుకోవాలి.

1. ప్రాచీన తెలంగాణ చరిత్ర:
ఇందులో శాతవాహనుల నుంచి చాళుక్య యుగం వరకు ఉంటుంది. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు శాతవాహనుల కాలానికి సంబంధించి తేదీలు, రాజ వంశీయుల క్రమంపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటిపై చరిత్రకారులు ఒకరకంగా రాస్తే శాసనాల్లో మరో రకంగా ఉంది. కానీ ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వర్తక వ్యాపారాలు, సాహిత్య వికాసం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తే ఉపయోగం.

2.తెలంగాణ మధ్యయుగ చరిత్ర: 
ఇందులో కాకతీయ, పద్మనాభ, కుతుబ్‌షాహీల వరకు చరిత్ర ఉంటుంది ఇందులో ఆనాటి సామాజిక, వర్తక, వాణిజ్య అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రజా సంక్షేమం, విద్యా రంగం వంటి అంశాలను చదువుకోవాలి. ముఖ్యంగా నాటి నీటిపారుదల వ్యవస్థ గురించి తెలుసుకోవాలి.

3.ఆధునిక తెలంగాణ చరిత్ర:
ఇందులో అసఫ్‌జాహీల కాలం నుంచి ఉంటుంది. 1724 నుంచి 1948 వరకు జరిగిన అన్ని చారిత్రక అంశాలు ఉంటాయి. ముఖ్యంగా నిజాం కాలం నాటి సంస్కరణలు, వ్యవసాయ రంగంలో భూమిశిస్తు విధానం, విద్యారంగం, రోడ్డు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అసఫ్‌జాహీల కాలంనాటి సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు.. ప్రధానంగా ఆర్య సమాజ్, ఆది హిందూ ఉద్యమాలు, ఆంధ్ర మహాసభ నిర్వహించిన రాజకీయ ఉద్యమాలు, వందేమాతరం ఉద్యమం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన రాజకీయ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటంపై దృష్టి పెట్టాలి. తెలంగాణ ఆదివాసీల సమస్యలు.. ఆదివాసీ ఉద్యమాలు, ఆంధ్ర మహిళా సభ నిర్వహించిన మహిళా ఉద్యమాలు కూడా కీలకాంశాలే.

4. సమకాలీన తెలంగాణ చరిత్ర:
తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు.. రాష్ట్ర అవతరణ క్రమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. గ్రూప్-1లో ఆరో పేపరు, గ్రూప్-2లో నాలుగో పేపరు దీనిపైనే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని చదువుకునే క్రమంలో అభ్యర్థులు అకడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అర్థం చేసుకోవాలి. ఉద్యమ క్రమాన్ని భావోద్వేగాలతో కూడిన ధోరణిలో చదవొద్దు. ఇందులో ఉద్యమానికి దోహదం చేసిన సామాజిక, ఆర్థిక కారణాలు, అస్తిత్వ పోరాటం, ఆకాంక్షల కోసం వివిధ సంస్థలు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాయన్న కోణంలో చదువుకోవాలి. 1952లో మొదటిసారిగా జరిగిన ముల్కీ ఉద్యమం.. 1969-70లో వచ్చిన జైఆంధ్ర ఉద్యమం, 1990వ దశకంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేసిన రాజకీయ, రాజకీయేతర , పౌరసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, మేధావి వర్గాలు స్థాపించిన సంస్థలు, సంఘాలు, వాటి పాత్రను పరిగణనలోకి తీసుకోవాలి.

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

మలిదశ ఉద్యమం..: 
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన తర్వాత జరిగిన వివిధ ఘట్టాలను మలిదశ ఉద్యమంలోకి తీసుకోవాలి. ఇందులో వివిధ పార్టీలు, సంఘాలు, ఉద్యోగులు, కళాకారులు తెలంగాణ ఉద్యమాన్ని సమష్టి ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లిన క్రమాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజా ఉద్యమంగా మారిన తీరు.. అందులో వివిధ పక్షాల పాత్ర తెలుసుకోవాలి. ఈ సిలబస్‌లో ఏ ఒక్క రాజకీయ పార్టీ, వాటి భావజాలం ప్రధానం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడిన అందరి పాత్ర గురించి ఉంటుంది. ఇందులో ఉద్యమం కొనసాగిన తీరు, వివిధ సంఘాలు, మేధావులు, ఉద్యోగులు, రాజకీయేతర సంఘాలు, సంస్థలపైనా ప్రశ్నలు ఉంటాయి.

ముఖ్య‌మైన అంశాలు..:
ప్రాచీన చరిత్ర నుంచి సమకాలీన చరిత్ర వరకు అన్నింటిలో సాంస్కృతిక వికాసం, సామాజిక ఆర్థిక వ్యవస్థ, వాస్తు శిల్పం, కళలు, సాహిత్య వికాసం వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. వివిధ కాలాల్లో విశిష్ట అంశాల గురించి ప్రత్యేకంగా చదువుకోవాలి.
➤ ఉదాహరణకు నీటిపారుదల వ్యవస్థ తీసుకుంటే కాకతీయుల కాలంలో ప్రారంభమై అసఫ్‌జాహీల కాలం వరకు వికాసం పొందిన తీరు తెన్నులు.
➤ శాతవాహనుల నుంచి కుతుబ్‌షాహీల వరకు జరిగిన సాహిత్య వికాసం. ప్రముఖ కవులు, రచయితలు, గ్రంథాలపై అవగాహన అవసరం. ఉదాహరణకు బమ్మెర పోతన, పండిత రాజ చరిత్రం వంటివి.
➤ కుతుబ్‌షాహీల కాలంలో సాహితీవేత్తలు, వారి రచనలపై అవగాహన పెంచుకోవాలి. కుతుబ్‌షాహీలతోపాటు అసఫ్‌జాహీల కాలంనాటి ప్రముఖ కట్టడాలు, వారు ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా సంస్కరణలు. ఉదాహర ణకు వర్తక, వ్యాపార అభివృద్ధి, గోల్కొండను సందర్శించిన విదేశీ వర్తకులు, వారి కాలంలో జరిగిన ఆర్థిక వికాసం, పారిశ్రామిక విధానం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

బీఎస్‌ఎల్ హనుమంతరావు రాసిన పుస్తకంలో..
పురావస్తు శాఖ ఇటీవల జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల రాజధాని కరీంనగర్ జిల్లా కోటి లింగాల అని వెల్లడైంది. కానీ బీఎస్‌ఎల్ హనుమంతరావు రాసిన పుస్తకంలో శాతవాహనుల తొలి రాజధాని కృష్ణా జిల్లా శ్రీకాకుళం అని ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ చరిత్రకారులు రాసిన అలాంటి అంశాలను మార్చుతున్నారు.

ప్రైవేటు పబ్లిషర్లు రూపొందించే ప్రశ్నల నిధిపైనే ఆధారపడవద్దు..
తెలంగాణలో తెలంగాణేతర అంశాలకు ప్రాధాన్యం తక్కువ. ఇందులో విజయనగర చరిత్ర ఉండదు. అయితే భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ఏపీ చరిత్ర, సంస్కృతి, అక్కడి సంఘ సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలు ఉంటాయి. అభ్యర్థులు ఈ విషయాలను గమనించాలి. పోటీ పరీక్షను బట్టి కొన్ని ఆబ్జెక్టివ్ విధానంలో, మరికొన్ని డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అందుకే ప్రైవేటు పబ్లిషర్లు రూపొందించే ప్రశ్నల నిధిపైనే ఆధారపడవద్దు. దానివల్ల సబ్జెక్టుపై అవగాహన రాదు. అందుకే అభ్యర్థులు ప్రామాణిక గ్రంథాల ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

ప్రామాణిక పుస్త‌కాలను వేటిని తీసుకోవాలి..?
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే క్రమంలో అభ్యర్థులు ప్రామాణిక గ్రంథాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలుగు అకాడమీ పుస్తకాలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు రాసినవి, బీఎన్ శాస్త్రి వంటి వారి రచనలు, ప్రభుత్వ సంస్థలు ప్రచురించినవి ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగనీ ప్రైవేటు రచనలను పట్టించుకోవద్దని కాదు. సాధ్యమైనంతవరకు ప్రభుత్వ పుస్తకాలను తీసుకుంటే మంచింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రచురించినవి ఉన్నాయి. తెలుగు అకాడమీ నుంచి తెలంగాణ చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం పుస్తకాలు రాబోతున్నాయి. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర-సంస్కృతి పుస్తకంలోని అంశాలను తీసుకోవచ్చు. అందులో తెలంగాణ చరిత్ర, సంస్కృతి అంశాలు ఉన్నాయి. ఏపీ కాంగ్రెస్ ప్రచురించిన సమగ్ర ఆంధ్ర దేశ చరిత్ర-సమస్యలు గ్రంథాన్ని చదువుకోవచ్చు. ఇలాంటి వాటి ఆధారంగానే నోట్స్ సిద్ధం చేసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ముద్రణలు, కొన్ని సందర్భాల్లో ప్రైవేటు ముద్రణలు ప్రామాణికం అవుతాయి. విషయ వాస్తవికతను బట్టి ఎంచుకోవాలి. హైదరాబాద్ బుక్ ట్రస్టు, విశాలాంధ్ర, ప్రజాశక్తి ప్రచురణల్లో తెలంగాణ అంశాలు బాగానే ఉన్నాయి.

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 18 Apr 2022 07:45PM

Photo Stories