APPSC Group 1 Ranker Siva Priya Reddy : ఈ టిప్స్ ఫాలో అయ్యా.. గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా..
APPSC Group 1 Ranker Siva Priya Reddy గారి కుటుంబ నేపథ్యం, ఎడ్యుకేషన్ వివరాలు, గ్రూప్-1కి ఎలా ప్రిపేరయ్యారు, ఈమె సక్సెస్ ఫార్ములా ఏమటి..? మొదలైన అంశాలపై సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈమె పూర్తి ఇంటర్య్వూ మీకోసం..
జయం అంచుల దాకా వెళ్లి.. చివరికి నిరాశతో..
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పదానికి సిసలైన నిదర్శంగా నిలిచింది ఆ యువతి. మొదటి ప్రయత్నంలో విజయం అంచుల దాకా వెళ్లి వెనుదిరిగినప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా రేయింబవళ్లు యజ్ఞంలా శ్రమించింది. మరోవైపు భర్త, తల్లిదండ్రులు, అత్తామామల సహకారం ఆమెను విజయతీరాలకు చేర్చింది. బద్వేలుకు చెందిన అంకిరెడ్డిపల్లె శివప్రియారెడ్డి డీఎస్పీగా ఎంపికైంది.
కుటుంబ నేపథ్యం :
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన అంకిరెడ్డిపల్లె రామశేఖర్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె శివప్రియారెడ్డి.
ఎడ్యుకేషన్ :
శివప్రియారెడ్డి.. పదో తరగతి వరకు ప్రొద్దుటూరులోని గోపికృష్ణ స్కూల్‌లో చదివింది. ప్రొద్దుటూరులోని షిరిడిసాయి కళాశాలలో ఇంటర్మీడియెట్, రాజంపేట సమీపంలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ.. గ్రూప్-1 వైపు..
ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ 2018లో గ్రూప్–1 పరీక్షకు హాజరైంది. తొలి ప్రయత్నంలో విజయం దక్కలేదు. 2021లో బద్వేలుకు చెందిన పెసల మణికాంత్‌రెడ్డితో వివాహం జరిగింది. భర్త, అత్తమామలు మల్లేశ్వర్‌రెడ్డి, సరస్వతిల ప్రోత్సాహంతో తిరిగి 2022లో గ్రూప్–1 పరీక్షకు హాజరై ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి సివిల్ డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. ఈమె ప్రముఖ కోచింగ్ సెంటర్ ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. అలాగే ఈమె గ్రూప్–1కు ఒక ప్రణాళిక ప్రకారం చదివి విజయం సాధించారు.
APPSC Group 1 Ranker 2022 Siva Priya Reddy పూర్తి ఇంటర్వ్యూ..
టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే..
ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే.
కేవలం 19 రోజుల్లోనే..
2022 సెప్టెంబర్ 30 న ఏపీపీఎస్సీ 110 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 8వ తేదీన నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 85 వేల మంది హాజరయ్యారు. పరీక్ష ముగిసన అనంతరం కేవలం 19 రోజుల్లోనే ఫలితాలను కమిషన్ వెల్లడించింది. జనవరి 27న విడుదల చేసిన ప్రిలిమ్స్ ఫలితాల్లో 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.
జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించింది. 110 పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన 220 మంది అభ్యర్థులకు ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఈరోజు తుది ఫలితాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. నోటిఫికేషన్ విడుదల నుంచి ఫలితాల వెల్లడి వరకు పూర్తి పారదర్శకత పాటించిన ఏపీపీఎస్సీ.. అతి తక్కువ సమయంలో వివాదాలకి దూరంగా ప్రక్రియను పూర్తి చేసింది.