UPSC Success Stories: వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు.. మేస్త్రీ కుమారుడికి 574వ ర్యాంక్
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ మానేసి సివిల్సే లక్ష్యంగా.. సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్ అయిన మెరుగు కౌశిక్.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసిన ఆయన.. ఢిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు 8–9 గంటలపాటు ప్రిపేర్ అయినట్లు చెప్పారు.
చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టానని, ఆ తర్వాత ఏడాది పాటు జాబ్ చేశానని తెలిపారు. ప్రిలిమ్స్ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి మెయిన్స్ రాసినట్లు పేర్కొన్నారు. ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యం అని చెప్పారు. తనకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదన్నారు. తన తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారని, తల్లి గృహిణి అని చెప్పారు.
విధి వంచించినా...
విధి వంచించినా.. విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా.. చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తి చేసి కుటుంబ సభ్యులు, గురువుల సహకారంతో విశాఖపట్టణానికి చెందిన హనిత వేములపాటి సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించి సత్తాచాటారు. తాను ఆత్మవిశ్వాసంతో చదువును కొనసాగించి సివిల్స్ ప్రిపేరయ్యానని ఆమె చెప్పారు. దేశంలోనే అత్యున్నత సివిల్స్ సర్విసెస్‌కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తాత జస్టిస్... మనవరాలు సివిల్స్ ర్యాంకర్
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి మనవరాలు ఐశ్వర్య నీలిశ్యామల సివిల్స్‌లో 649వ ర్యాంకు సాధించారు. బీటెక్ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రణాళికాబద్ధంగా ప్రిపేరై ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తాత జస్టిస్ రామస్వామి తనను ఎంతగానో ప్రేరేపించారని, అందుకే ప్రజాసేవ చేయాలనే లక్షంతో సివిల్స్ రాశానని అన్నారు. తండ్రి సివిల్ సర్వెంట్, తల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలు అని, తన మామ ఐఏఎస్ అధికారి అని పేర్కొన్నారు.
అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి : అలేఖ్య
ఖమ్మం జిల్లాలో సాధారణ కానిస్టేబుల్ కూతురు అలేఖ్య. పోలీసు వృత్తిలోనూ నిజాయితీని చాటుకున్న తండ్రిని ఆమె ఆదర్శంగా తీసుకుంది. పాఠశాల విద్య నుంచే సివిల్స్ లక్ష్యంగా ఎంచుకుంది. అనుక్షణం తండ్రి ప్రోత్సాహం ఆమెకు కలిసి వచ్చింది. తన కష్టాలే ఆమెను మానసికంగా బలపడేలా చేశాయి. ఐపీఎస్ కావాలన్న లక్ష్య సాధనలో ఆమె 938వ ర్యాంకు సాధించింది. నాలుగుసార్లు సివిల్స్ విజయానికి దగ్గరగా వెళ్లిన ఆమె ఎన్నడూ నిరుత్సాహ పడలేదు. ఐదోసారి అనుకున్నది సాధించారు. ప్రతీ తల్లీదండ్రీ పిల్లలను ప్రోత్సహించాలని ఆమె చెప్పార. ప్రజా జీవితానికి చేరువగా విధి నిర్వహణ చేయాలని ఆమె కోరుకుంటున్నారు.
వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు..
పూడూరు: వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్‌పల్లికి చెందిన దయ్యాల బాబయ్య, శశికళ దంపతుల కుమారుడు తరుణ్ (24) సివిల్స్‌లో 231వ ర్యాంక్ సాధించారు. 2017లో తరుణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 2023లో బీటెక్ పూర్తి చేశారు.
ఐఏఎస్‌కు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, పేదలకు సేవ చేసే అవకాశం వచ్చిందని తరుణ్ తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తరుణ్ ఇంటికి వెళ్లి అభినందించారు. మారుమూల గ్రామానికి చెందిన తరుణ్ ఐఏఎస్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు.
60 మంది తోటి కానిస్టేబుళ్ల ముందు సీఐ అవమానించారని..
చిక్కడపల్లి: ‘60 మంది పోలీసుల ముందు ఇన్‌స్పెక్టర్ అవమానించారు. నాపై వ్యక్తిగత కోపంతో తిట్టారు. 2013 నుంచి 2018 వరకు చేసిన కానిస్టేబుల్ జాబ్‌కు ఆరోజే రిజైన్ చేశాను. ఐఏఎస్ సా«ధించాలని ఆ రోజే కసితో దీక్ష తీసుకున్నాను. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్టారెడ్డి చెప్పారు. తనకు ఐఆర్‌ఎస్ వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఈ జాబ్‌లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు.
ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా గుడ్లూరు పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనకు సీఐ చేసిన అవమానమే ఈ రోజు సివిల్స్ సాధించేందుకు దోహదపడిందన్నారు. తనకు జంతువులంటే ఎంతో ప్రేమ అని, మనుషుల కోసం 108 వాహనం ఉన్నట్లే జంతువుల కోసం దేశవ్యాప్తంగా 109 అంబులెన్స్ వాహనం కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని నానమ్మ పెంపకంలో పెరిగానని వివరించారు.
ఢిల్లీ ఐఐటీ వదిలి.. దూర విద్య చదివి...
ముషీరాబాద్: నల్లగొండ జిల్లా అల్వాలకు చెందిన సత్యనారాయణరెడ్డి స్కూల్ ప్రిన్సిపల్, తల్లి హేమలత టీచర్. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నత విద్యావంతులు కావడంతో కుమారుడు పెంకేసు ధీరజ్‌రెడ్డిని ఐఐటీ చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఐఐటీ ఢిల్లీలో సీటు సాధించారు. మొదటి సంవత్సరంలో 9.3 సీజీపీఏ సాధించి ఐఐటీ ఢిల్లీలోనే టాప్ 7లో నిలిచాడు. ఇలా సాగిపోతున్న తరుణంలో ధీరజ్‌రెడ్డికి చదువు పరుగు పందెంలా అనిపించింది.
ఎప్పుడూ కంప్యూటర్‌తో కుస్తీ, మెకానికల్ లైఫ్ అనిపించి ఈ చదువు తనకు ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అయినప్పటికీ కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తల్లిదండ్రులు నీకు నచ్చకపోతే ఐఐటీ వదిలేయమని చెప్పారు. దీంతో ఐఐటీని మధ్యలోనే ఆపేసి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే డిగ్రీ అడ్మిషన్లు అయిపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్(దూర విద్య)లో బీఏ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు.
ఆ అడ్మిషన్ కేవలం డిగ్రీకి మాత్రమే.. వెంటనే సివిల్స్‌పై దృష్టి సారించాడు. తల్లిదండ్రుల్లో మాత్రం కుమారుడి భవిష్యత్తు మీద ఆందోళన మొదలైంది. 2019లో మొదటిసారి సివిల్స్ ఫలితాల్లో 0.6 మార్కులతో రాలేదు. రెండవ ప్రయత్నంలో 17 మార్కులతో, మూడవ ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో ఫెయిలయ్యాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిoచి నాలుగోసారి 173వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు దారులు వేసుకున్నాడు.
మేస్త్రీ కుమారుడికి 574వ ర్యాంక్
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ కాలనీకి చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్ ఆరో ప్రయత్నంలో 574వ ర్యాంకు సాధించారు. రజనీకాంత్ కుటుంబానిది రాజంపేట మండలం ఆర్గోండ గ్రామం. రామారెడ్డిపేట సిద్ధిరాములు, పద్మ దంపతుల రెండవ కుమారుడు. పేద కుటుంబమే.
తల్లి గృహిణి కాగా, తండ్రి భవన నిర్మాణ పనులతోపాటు డ్రైవర్‌గా చేస్తారు. చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడ్డామని, కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని రజనీకాంత్ చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తమ అబ్బాయి సివిల్స్ సాధించి తమ జన్మను సార్థకం చేశాడని తల్లిదండ్రులు ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు.
బీడీ కార్మికురాలి కొడుకు సివిల్స్ ర్యాంకర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ 27వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయికిరణ్ తండ్రి నందాల కాంతారావు మహారాష్ట్రలోని భివండిలో చేనేత కార్మికుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీ బీడీలు చుట్టేవారు. కాంతారావు కేన్సర్‌తో 2016లో మరణించారు. ఆ సమయంలో సాయికిరణ్ వరంగల్ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
2018లో క్యాంపస్ ఇంటరŠూయ్వలో క్వాల్‌కమ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. బాల్యం నుంచి ఐఏఎస్ కలగా ఉన్న సాయికిరణ్ అప్పటి నుంచి ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. క్రితంసారి విఫలమైనా.. ఈసారి మాత్రం విజయం సాధించి తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు.
పాలమూరు బిడ్డ... ప్రతిభకు అడ్డా
సివిల్స్ లక్ష్యంగా నిద్రాహారాలు మానేసి చదివిన పాలమూరు బిడ్డ అనుకున్నది సాధించింది. ఆలిండియా మూడో ర్యాంకు సాధించింది. మహబూబ్‌నగర్‌కు జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే విజయ శిఖరాలు అధిరోహించడం విశేషం. అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి, మంజులతకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనన్యరెడ్డి కాగా.. రెండో సంతానం చరణ్య.
పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైసూ్కల్లో చదివిన అనన్య.. ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎంతో కష్టపడి చదివి సివిల్స్‌లో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ మీద దృష్టి సారించానని చెప్పారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివానని పేర్కొన్నారు.
ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నానని, ఇందుకు హైదరాబాద్‌లోనే కోచింగ్ తీసుకుని పకడ్బందీగా ప్రిపేరయ్యానని చెప్పారు. అయితే ఈ ఫలితాల్లో మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. తమ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని తానేనని చెప్పారు. అనన్య తల్లి గృహిణి కాగా, తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి.