Group 1 Prelims Cut Off Marks : గ్రూప్-1 ప్రిలిమ్స్ 2022 కటాఫ్ మార్కులపై టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన క్లారిటీ ఇదే..
ప్రిలిమ్స్ పరీక్షలో కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష కేవలం వడబోత పరీక్ష మాత్రమేనని తెలిపింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 16వ తేదీ (ఆదివారం) నిర్వహించిన విషయం తెల్సిందే.
ఈ పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,86,051 మంది హాజరయ్యారు. పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 కేటగిరీలో ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఒక్కో పోస్టుకు..
అలాగే గ్రూప్-1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగాయని వివరించింది. గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం ఉండేదని పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
8 రోజుల్లో..
అభ్యర్థుల ఓఎంఆర్ జవాబుపత్రాలను స్కానింగ్ చేసి వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు 8 పనిదినాలు పడుతుందని భావిస్తోంది. ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాకే ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనుంది.