Skip to main content

KS Bharath: కేఎస్‌ భరత్‌ది మన వైజాగే... తొలిసారిగా అరంగేట్రం... జగన్‌ శుభాకాంక్షలు

భారత క్రికెట్‌ జట్టులో కోన శ్రీకర్‌ భరత్‌ అరంగేట్రం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ట్విటర్‌ వేదికగా భరత్‌ ఫొటో షేర్‌ చేస్తూ అభినందనలు తెలియజేశారు. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో గురువారం ఆరంభమైన తొలి టెస్టుతో ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. భరత్‌తో పాటు టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భారత్‌ తరఫున తొలి టెస్టు ఆడుతున్నాడు.
శ్రీకర్‌ భరత్‌  గురించి ఆసక్తికర విషయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన శ్రీకర్‌ భరత్‌ 1993, అక్టోబరు 3న జన్మించాడు.
2012లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతడు అరంగేట్రం చేశాడు.
29 ఏళ్ల శ్రీకర్‌ భరత్‌ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉంటున్నాడు.
2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో భరత్‌ 308 పరుగులు చేసి రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించి.. రంజీల్లో ఈ ఘనత సాధించిన తొలి కీపర్‌గా నిలిచాడు.
ఐపీఎల్‌లో..
దూకుడైన బ్యాటర్‌గా పేరొందిన శ్రీకర్‌ భరత్‌ను ఐపీఎల్‌ మినీ వేలం2021లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది. 20 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అంతకుముందు అతడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌)కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మ్యాచ్‌ ఆడే అవకాశం మాత్రం రాలేదు. 
ఐపీఎల్‌2021 సీజన్‌లో కోహ్లి కెప్టెన్సీలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భరత్‌ 191 పరుగులు సాధించాడు.
ఐపీఎల్‌2023 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ భరత్‌ను కొనుగోలు చేసింది. 1.2 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.
అప్పుడు ఎంపికైనా....
2021లో న్యూజిలాండ్‌తో  టెస్టు సిరీస్‌ నేపథ్యంలో భరత్‌కు మొదటిసారి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. రెండో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన భరత్‌.. తన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. అలాగే ఇటీవల బంగ్లాదేశ్‌తో పర్యటన సందర్భంగా టెస్టు జట్టుకు ఎంపికైనా.. రెండు మ్యాచ్‌లలోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

Published date : 09 Feb 2023 05:31PM

Photo Stories