Job Fair: ఐటీ జాబ్‌మేళాకు విశేష స్పందన
గత నెల 25వ తేదీన ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరగా నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి 15,316 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పెద్దఎత్తున నిరుద్యోగులు జాబ్‌మేళాకు వచ్చారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా నల్లగొండ ఐటీ ఉద్యోగ అవకాశం రావడంతో జాబ్‌మేళాకు హాజరయ్యారు. వీరికి భోజనం, తదితర ఏర్పాట్లను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరిశీలించారు.
హాజరైన 14 కంపెనీలు..
జాబ్‌మేళాకు మొత్తం 14 కంపెనీలు వచ్చాయి. ఇన్‌ఫోక్స్ డేటా సొల్యూషన్ కంపెనీ, స్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కేబీకే బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్ లిమిటెడ్, స్ప్లాష్‌బీ, డిమాన్జ్ టెక్నాలజీ, డిజిక్స్‌ఫోమ్, ఇన్‌ఫో జంక్షన్, విన్‌ఫోటైన్‌మెంట్ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్, హిట్లోప్, న్యామెరిక్ టెక్నాలజీ, జీఎస్‌ఆర్ మీడియా, కోనం ఫౌండేషన్ కంపెనీలు ఇందులో ఉన్నాయి.
అభ్యర్థులకు ఆన్‌లైన్ టెస్టు..
ఐటీ హబ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టాస్క్ కంపెనీ మొదటగా ఆన్‌లైన్‌లో ప్రాథమిక టెస్టు నిర్వహించింది. అక్కడ స్క్రీనింగ్ చేసిన తర్వాత వారి బయోడేటా టెస్టు నిర్వహించిన ఫాం తీసుకొని ఫంక్షన్ హాల్‌లో కంపెనీ నిర్వాహకుల వద్దకు పంపించారు. అభ్యర్థులు మొదటగా ఆన్‌లైన్‌లో 14 కంపెనీలకు సంబంధించిన సమాచారం రావడంతో వారు ఏ కంపెనీ అయితే ఎంపిక చేసుకున్నారో ఆ కంపెనీ వద్దకు పంపించారు. అక్కడ కంపెనీ వారు ఆన్‌లైన్‌లో రిటెన్ టెస్ట్, అనంతరం గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. కాగా.. హాజరైన 15,316 మందిలో స్క్రూట్నీ చేసిన తరువాత 3,216 మంది మిగిలారు. వీరిని షార్ట్‌లిస్ట్ చేసి 370 మందిని ఎంపిక చేశారు. సోమవారం తర్వాత హైదరాబాద్‌లో టెక్నికల్ రౌండ్ నిర్వహించనున్నారు. వీటన్నింటిలో పాసైన వారికి ఫోన్‌ద్వారా సమాచారం అందిస్తారు. అనంతరం ప్లేస్‌మెంట్ ఇవ్వనున్నారు.
మంచి అవకాశం
స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు అనేవి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. దూరప్రాంతాలకు పోలేనివారికి ఇది మంచి అవకావం. వేలాది మంది యువత జాబ్‌మేళాకు హాజరయ్యారు. ఉద్యోగాలు కొన్నే ఉన్నాయి. కనుక ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు మరిన్ని కంపెనీలను పిలిచి మళ్లీ జాబ్‌మేళా నిర్వహించాలి.
– మంద కావేరి
ఐటీ ఉద్యోగం కావాలని వచ్చా
నాకు పెళ్లి కాకముందు బ్యాంకులో ఉద్యోగం చేశా. ప్రస్తుతం చేయడం లేదు. నల్లగొండలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం, ఉద్యోగాలకు ఇక్కడే అవకాశాలు రావడంతో ఐటీలో ఉద్యోగాలు చేయాలని వచ్చాను. దూర ప్రాంతాలకు వెళ్లలేక నల్లగొండలోనే ఐటీ ఉద్యోగం చేసేందుకు అవకాశం వచ్చింది కాబట్టి జాబ్‌మేళాకు హాజరయ్యా.
– చందన నల్లగొండ
పెద్ద ఎత్తున హాజరయ్యారు
జాబ్ మేళాకు యువత పెద్దఎత్తున హాజరయ్యారు. వారి ట్యాలెంట్‌ను బట్టి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు రూ.10లక్షల ప్యాకేజీ కూడా ఇస్తున్నాయి. ఈ జాబ్‌మేళా ద్వారా ఐటీ ఉద్యోగాలకు ఎంపికై న వారికి టాస్క్ ఆధ్వర్యంలో మంచి శిక్షణ ఇస్తాం. చాలా మంది టాస్క్ ఆధ్వర్యంలో యూఎస్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందారు. – శ్రీకాంత్ సిన్హా, టాస్క్ సీఈఓ
జాబ్‌మేళాకు వస్తున్న యువతి యువతకు మంచి అవకాశం
అమెరికాలో కోనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్‌మేళాలు నిర్వహిస్తాం. హైదరాబాద్‌లో కూడా నిర్వహించాం. మంత్రి కేటీఆర్ నల్ల గొండ ఐటీ హబ్‌లో కూడా జాబ్ మేళా నిర్వహించాలని చెప్పడంతో ఇక్కడికి వచ్చాం. నాది నల్ల గొండ జిల్లానే. సొంత గడ్డపై యువతకు నా కంపెనీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు కల్పించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఐటీహబ్‌తో ఇక్కడి ప్రాంత యువతకు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరికింది.
– సందీప్, కోనం ఫౌండేషన్ చైర్మన్
నల్లగొండ అభివృద్ధి చెందుతుంది
నల్లగొండ పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఐటీ హబ్ ఏర్పాటు కావడంతో ఇక్కడి ప్రాంత యువతకు దూరప్రాంతాలకు వెళ్లకుండానే స్థానికంగానే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. చిన్న ఉద్యోగం అయినా చేరి అందులో ట్రైన్ అయిన తర్వాత మంచి కంపెనీలో అవకాశం వస్తే వెళ్లొచ్చు. నల్లగొండలో ఐటీ హబ్ ఇక్కడి యువతకు ఎంతో మేలు.
– సంతోష్, చర్లపల్లి
గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతో మేలు
నేను ఎంటెక్ పూర్తి చేశాను. హైదరాబాద్‌లో జాబ్‌మేళాకు కూడా హాజరయ్యా. నల్లగొండ ఐటీ హబ్‌లో జాబ్‌మేళాకు చాలా కంపెనీలు వస్తున్నాయని తెలుసుకుని ఇక్కడకు వచ్చా. నల్లగొండలో ఐటీ హబ్ ఏర్పాటుతో ఇక్కడ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. చాలా మంది హైదరాబాద్ వెళ్లలేని వారికి ఇది మంచి అవకాశం.
– అనూష, మహబూబాబాద్