Skip to main content

కొలువుల వేట‌లో ముందుండేలా.. బీటెక్ వినూత్న కోర్సుల ప్రారంభం

బీటెక్‌.. లక్షల మంది విద్యార్థుల స్వప్నం! అందులోనూ.. కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత బ్రాంచ్‌ల్లో చేరితే...భవిష్యత్తు బంగారుమయం అవుతుందనే ఆశ! కాని ఇండస్ట్రీ పరంగా మారుతున్న సాంకేతిక నైపుణ్యాలు.. అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీల కారణంగా.. బీటెక్‌ సర్టిఫికెట్‌ చేతిలో ఉన్నా.. కొలువుల పోటీలో నిరాశ తప్పట్లేదు! ఇకపై ఇలాంటి సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పడనుంది. కారణం.. బీటెక్‌లో... ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి కొత్త ప్రోగ్రామ్‌లను పూర్తి స్థాయి బ్రాంచ్‌లుగా బోధించేందుకు ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సెల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) చర్యలు తీసుకోవడమే! ఫలితంగా బీటెక్‌లో అడుగుపెట్టిన తొలిరోజు నుంచే.. కొత్త టెక్నాలజీ నేర్చుకోవచ్చు! ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించొచ్చు!! సర్టిఫికెట్‌ చేతికందుతూనే.. జాబ్‌ ఆఫర్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. బీటెక్‌లో కొత్త బ్రాంచ్‌ల ప్రాధాన్యం, తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్న సీట్లు, అకడమిక్‌గా శిక్షణ తదితర అంశాలపై విశ్లేషణ..

ఈ విద్యా సంవత్సరం (2020–21) నుంచే బీటెక్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), డేటా సైన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ బ్రాంచ్‌లు బోధించేందుకు జాతీయ స్థాయిలో పలు కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక ఇంజనీరింగ్‌ కళాశాలలు ఈ ఏడాది నుంచి సదరు కోర్సులు ప్రారంభించడానికి అనుమతులు పొందాయి.

ఆధునిక నైపుణ్యాలు..
బీటెక్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించడానికి ప్రధాన కారణం.. విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఆధునిక నైపుణ్యాలు సొంతం చేసుకునే అవకాశం కల్పించడం కోసమే. ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో ఏ జాబ్‌కు దరఖాస్తు చేసుకున్నా.. ఏఐ, డేటాసైన్స్, ఎంఎల్‌ విభాగాల్లో నైపుణ్యాలకే సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌ విద్యార్థులు అత్యున్నత శ్రేణి గ్రేడ్‌ పాయింట్లు సొంతం చేసుకున్నా.. ఏఐ, డేటాసైన్స్, ఎంఎల్‌ నైపుణ్యం లేకుంటే ఆఫర్‌ అందుకునే విషయంలో నిరాశే ఎదురవుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏఐసీటీఈ బీటెక్‌కు ఆధునిక రూపు ఇవ్వాలని నిర్ణయించింది.

రెండేళ్ల క్రితం నుంచే..
వాస్తవానికి బీటెక్‌లో కొత్త బ్రాంచ్‌లు ప్రవేశపెట్టే దిశగా రెండేళ్ల క్రితం నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇండస్ట్రీ అవసరాలకు సరితూగే విధంగా కరిక్యులంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. పలు ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన నిపుణులతో కమిటీని నియమించారు. సదరు కమిటీ సిఫార్సుల ప్రకారం–2018లో ఏఐసీటీఈ మోడల్‌ కరిక్యులంను రూపొందించింది. దానికి సంబంధించి అభిప్రాయ సేకరణ చేసి.. బీటెక్‌ ఏఐ, డేటా సైన్స్, ఎంఎల్‌ బ్రాంచ్‌లను ప్రారంభించాలని గత ఏడాది చివర్లో నిర్ణయించింది. దీనికి అనుగుణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలలు కొత్త కోర్సుల ప్రారంభానికి దరఖాస్తు చేసుకోవాలని ఏఐసీటీఈ సూచించింది. దీంతో జాతీయ స్థాయిలో వందల సంఖ్యలో కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 150 పైగా కళాశాలలు..
బీటెక్‌లో ఏఐ, డేటా సైన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి 150 పైగా కళాశాలలకు అనుమతి లభించింది. ఇవన్నీ ఈ ఏడాది ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆధారంగా ఈ బ్రాంచ్‌లలో సీట్లు భర్తీ చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి వందకుపైగా కళాశాలల్లో 15,690 సీట్లకు, ఆంధ్రప్రదేశ్‌లో 53 కళాశాలల్లో 3,200 సీట్లకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సెలింగ్‌ సమయానికి మరికొన్ని కళాశాలలకు బీటెక్‌లో ఈ కొత్త బ్రాంచ్‌ల ప్రారంభానికి అనుమతి లభించే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
బ్రాంచ్‌ల వారీగా సీట్ల వివరాలు

తెలంగాణ:
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజె¯Œన్స్‌ మెషీన్‌ లెర్నింగ్‌ 6,240
కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌–సైబర్‌ సెక్యూరిటీ 2,520
కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌–డేటా సైన్స్‌ 4,320
ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) 1,710
కంప్యూటర్‌ సై¯Œన్స్‌– నెట్‌వర్క్స్‌ 120
కంప్యూటర్‌ సై¯Œన్స్‌– ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 780

ఆంధ్రప్రదేశ్‌:
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 420
డేటా సైన్స్‌ 540
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ 2220

కొలువు ఖాయమేనా!
బీటెక్‌లో ప్రారంభంకానున్న కొత్త కోర్సులను పూర్తిచేస్తే భవిష్యత్‌లో ఉద్యో గావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు గణాంకాల ప్రకారం–వచ్చే రెండేళ్లలో ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ వంటి విభాగాల్లో దేశంలో ఎనిమిది లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడుతుందని అంచనా. కానీ ప్రస్తుతం వీటికి సంబంధించి అకడమిక్‌గా పూర్తి స్థాయి నైపుణ్యాలు పొందే వారి సంఖ్య 20 శాతం కూడా లేదు. కొన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలు ఈ కోర్సులను సీఎస్‌ఈలోనే ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నప్పటికీ.. విద్యార్థులకు పూర్తి స్థాయి పరిజ్ఞానం లభించడంలేదు. దీంతో బీటెక్‌ పూర్తయ్యాక పలు సంస్థలు అందిస్తున్న సర్టిఫికేషన్‌ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. ఇవి కూడా అధిక శాతం ఆన్‌లైన్‌ విధానంలో ఉంటున్నాయి. దాంతో నైపుణ్యాలు సొంతం చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా బీటెక్‌లో పూర్తి స్థాయి బ్రాంచ్‌లుగా నాలుగేళ్ల పాటు బోధించనుండటంతో.. విద్యార్థులు ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్‌పై పూర్తిస్థాయి పట్టు సా«ధించి.. కొత్త కొలువులు సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

పూర్తి స్థాయి బోధన శిక్షణ..
బీటెక్‌లో కొత్త బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నప్పటికీ... వాటికి అనుమతులు పొందిన కళాశాలల్లో పూర్తి స్థాయిలో బోధన, శిక్షణ, నైపుణ్యాలు లభిస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బ్రాంచ్‌లన్నీ కంప్యూటర్‌ సైన్స్‌కు అనుబంధ బ్రాంచ్‌లే. కాబట్టి మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫ్యాకల్టీకి శిక్షణ..
కొత్త బ్రాంచ్‌ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఫ్యాకల్టీకి శిక్షణనివ్వడం అత్యంత ప్రధానమైన అంశమనేది అకడమిక్‌ వర్గాల అభిప్రాయం. అనుమతులు పొందిన కళాశాలలు తమ ఫ్యాకల్టీకి ఏఐ,ఎంఎల్,డేటాసైన్స్‌పై ముందుగా శిక్షణనిప్పించాల్సిన అవసరముందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఏఐసీటీఈ కూడా ఫ్యాకల్టీ ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించాలని సూచించిందని గుర్తు చేస్తున్నారు. ఏఐసీటీఈ నిర్వహించే వర్క్‌షాప్స్‌కు ఫ్యాకల్టీ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు.

కొరతను అధిగమించాలి..
కొత్త బ్రాంచ్‌లు, బోధన విషయంలో ఎదురవనున్న సమస్య.. ఆయా కళాశాలల్లో నెలకొన్న ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాల కొరత. ఈ ఏడాది నుంచే కొత్త బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నందున ఆయా కళాశాలలు ఫ్యాకల్టీ కొరత లేకుండా నియామకాలు చేపట్టాల్సిన అవసరముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏఐసీటీఈ సైతం ఈ విషయంపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ అవసరమని, అప్పుడే టీచింగ్, లెర్నింగ్‌ రెండూ ఫలప్రదంగా ఉంటాయని అంటున్నారు. కొత్త బ్రాంచ్‌లు బోధన పరంగా మౌలిక సదుపాయాల కొరత కూడా సమస్యగా మారనుంది. అధిక శాతం ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు(లేబొరేటరీస్, కంప్యూటర్స్‌ తదితర) అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటికి పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది.

ప్రాక్టికల్స్‌కు పెద్ద పీట..
బీటెక్‌ కొత్త బ్రాంచ్‌లలో చేరిన విద్యార్థులు పుస్తకాలు, ల్యాబ్స్‌కే పరిమితం కాకుండా.. ప్రాక్టికల్స్‌పై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీలు.. ఇండస్ట్రీ వర్గాలను సంప్రదించి ఇంటర్న్‌షిప్స్, రియల్‌ టైం ప్రాజెక్ట్‌ వర్క్‌లకు విద్యార్థులకు అవకాశం కల్పించేలా చూడాలంటున్నారు. వాస్తవానికి ఏఐసీటీఈ గతేడాది విడుదల చేసిన కరిక్యులం మార్గదర్శకాల్లో బీటెక్‌లో కనీసం రెండు ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరి అని స్పష్టం చేసింది. విద్యార్థులు దీన్ని పరిగణనలోకి తీసుకొని ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పొందేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటున్నారు.

కళాశాల ఎంపిక..
కొత్త బ్రాంచ్‌ల విద్యార్థులు కళాశాలల్లో చేరే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది చాలా పరిమిత స్థాయిలో సీట్లు ఉన్నందున సదరు కళాశాలలను ప్రత్యక్షంగా పరిశీలించి.. అక్కడి సదుపాయాలు, బోధన తదితర అంశాలపై అవగాహన పొంది.. కళాశాల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలంటున్నారు.

ఫ్యాకల్టీదే కీలక పాత్ర..
బీటెక్‌లో కొత్త బ్రాంచ్‌ల విద్యార్థులకు నైపుణ్యాలు అందించే విషయంలో ఫ్యాకల్టీది కీలక పాత్ర. వారు ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్‌ వంటి అంశాల్లో పొందిన నైపుణ్యాన్ని విద్యార్థులకు సమర్థవంతంగా బోధిస్తేనే ఈ కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటు ఉద్దేశం నెరవేరుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో కలిసి ఇప్పటికే పలు వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటికి దాదాపు మూడు వేల మందికి పైగా ఫ్యాకల్టీ హాజరై శిక్షణ తీసుకున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సులువుగానే వీటిని ఆకళింపు చేసుకోగలుగుతారు.
– ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఏపీఎస్‌సీహెచ్‌ఈ

విద్యార్థులకు మేలు చేసే నిర్ణయం..
ఏఐసీటీఈ ఈ ఏడాది నుంచి బీటెక్‌లో కొత్త బ్రాంచ్‌లకు అనుమతి ఇవ్వడం ఆహ్వానించదగ్గ నిర్ణయం. దీనివల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు అందుకునే విషయంలో ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికే జాబ్‌ మార్కెట్‌లో ఏఐ, డేటాసైన్స్‌ వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం నెలకొంది. వీటిలో పూర్తిస్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకున్న విద్యార్థులు సులువుగా ఉద్యోగాలు పొందగలరు. కొన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఇప్పటికే వీటిని పూర్తి స్థాయి ప్రోగ్రామ్‌లుగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఏఐసీటీఈ తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కోర్సుల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
– ప్రొఫెసర్‌ సి.కృష్ణ మోహన్, ఐఐటీ–హైదరాబాద్‌

Published date : 31 Jul 2020 02:39PM

Photo Stories