Skip to main content

ఉన్నత విద్యతోనే..మహిళా సాధికారత

‘దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు రాణించేలా చర్యలు చేపడుతుండటం అభినందనీయం. ఈ ప్రయత్నాలు ఫలప్రదం కావాలంటే.. ముందుగా అమ్మాయిల్లో, వారి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలి. మహిళలకు చదువు ఆవశ్యకతను తెలియజేయాలి’ అంటున్నారు.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్)- ముంబై ప్రొఫెసర్ లక్ష్మీ లింగం. ఉమెన్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి టిస్‌లో ప్రస్థానం ప్రారంభించిన ఆమె.. మహిళా సాధికారత, విద్యా రంగంలో మహిళలకు ప్రాధాన్యంపై చేసిన పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. గతంలో టిస్ హైదరాబాద్ డిప్యూటీ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి.. ప్రస్తుతం ఆ సంస్థ ముంబై క్యాంపస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ లింగంతో ఈ వారం గెస్ట్ కాలమ్..
ఎన్‌రోల్‌మెంట్ పెరగాలి..
మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు మార్గం.. చదువు. ముఖ్యంగా ఉన్నత విద్యలో అన్ని విభాగాల్లో మహిళల సంఖ్య పెరిగేలా చూడాలి. తాజాగా ఏఐఎస్‌హెచ్‌ఈ సర్వే గణాంకాల ప్రకారం- ఉన్నత విద్యలో మహిళల సంఖ్య దాదాపు యాభై శాతానికి చేరింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. అధిక శాతం మంది సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లోనే చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి ఇంజనీరింగ్, టెక్నికల్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ అమ్మాయిల సంఖ్య మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలి.

సూపర్ న్యూమరరీ :
ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో మహిళా విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఐఐటీలు సూపర్ న్యూమరరీ కోటా పేరుతో ప్రత్యేకంగా సీట్లు అందుబాటులోకి తెస్తున్నారు. అయితే దీన్ని శాశ్వత విధానంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా మహిళా యూనివర్సిటీల సంఖ్యను కూడా పెంచాలి. తద్వారా ఉన్నత విద్యలో మహిళా విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

టెన్త్ తర్వాత డ్రాప్-అవుట్స్ :
ప్రస్తుతం మహిళా విద్యార్థుల సంఖ్య పదో తరగతి వరకు బాగానే ఉంటోంది. కానీ.. ఇంటర్‌కు వచ్చేటప్పటికి డ్రాప్-అవుట్స్ సమస్య ఎదురవుతోంది. దీనికి సామాజిక పరిస్థితులే కారణంగా చెప్పొచ్చు. సొంత ఊర్లో కాలేజీ లేకపోవడంతో దూర ప్రాంతంలోని కళాశాలలకు పంపించాలంటే.. తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు తమ ఆడ పిల్లలను కో-ఎడ్యుకేషన్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చేర్పించే విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆందోళన పోగొట్టే విధంగా అన్ని వర్గాలు కృషి చేయాలి.

ముందు నుంచే అవగాహన :
అమ్మాయిలకు ఉన్నత విద్య, దాని ద్వారా లభించే ప్రయోజనాలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. దీనికి ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలి. ఎందుకంటే.. గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రుల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ. ‘ఆడ పిల్లలకు అంత చదువులు ఎందుకు. ఎంత చదివినా పెళ్లి చేసి పంపడమే కదా’ అనే అభిప్రాయం నేటికీ కొంతమందిలో ఉంది. ఇలాంటి అభిప్రాయం పోగొట్టాలి. ఆడ పిల్లలకు విద్యతో లభించే ప్రయోజనాలు తెలియజేయాలి. ప్రస్తుతం పలు రంగాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్న మహిళల్లో చాలామంది మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే. వీరినే స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ముందడుగు వేయాలి.

నర్సింగ్, టీచింగ్ మాత్రమే కాదు :
చాలా మంది మహిళా విద్యార్థులు కెరీర్‌లో స్థిరపడాలని కోరుకుంటున్నారు. అయితే వారి లక్ష్యాలు, ఆలోచనల పరిధి పరిమితంగా ఉంటోంది. నర్సింగ్, టీచింగ్ వంటి ఎలాంటి ఒత్తిడిలేని ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వీటితో తమ స్వస్థలాలకు సమీపంలోనే పని చేయొచ్చనే అభిప్రాయం కూడా నెలకొంది. అలాకాకుండా అమ్మాయిలు ఉన్నతమైన కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వీరు గతంలో వివిధ రంగాల్లో అద్భుతాలు సృష్టించిన మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలి.

సాధికారతతో ప్రయోజనాలెన్నో..
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించేలా ప్రోత్సహించి సాధికారత సాధించేలా చేస్తే ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది. మహిళలకు సాధికారత లభిస్తే వారు సంస్థతోపాటు కుటుంబాన్ని నడిపించడంలోనూ ముందంజలో ఉంటారు. విధుల నిర్వహణలో మహిళల ప్రతిభ, పనితీరు పురుషులకు దీటుగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి మహిళలకు ఉన్నత విద్య అనే అంశాన్ని అన్ని వర్గాలు సామాజిక బాధ్యతగా భావించాలి. అందుకోసం ఇప్పటికే పలు ఎన్‌జీఓలు కృషి చేస్తున్నప్పటికీ.. వాటి పరిధి పరిమితంగా ఉంటోంది.

ఉద్యోగాలకు స్వస్తి సరికాదు :
నేటికీ మన సామాజిక పరిస్థితుల్లో అమ్మాయిలకు వివాహం చేయడమే తమ తొలి ప్రాధాన్యంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత పలు కారణాల వల్ల కొలువులకు స్వస్తి పలుకుతున్నారు. ఇది సరికాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం మానేయాల్సి వచ్చినా.. దాన్ని కొద్ది కాలానికే పరిమితం చేసి మళ్లీ కెరీర్‌ను రీస్టార్ట్ చేయాలి. ఇటీవల కాలంలో పలు కార్పొరేట్ సంస్థలు మహిళా ఉద్యోగుల పునర్ నియామకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇలాంటి అవకాశాన్ని డ్రాప్-అవుట్ మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.
Published date : 30 Sep 2019 12:51PM

Photo Stories