Revanth Reddy: నైపుణ్య శిక్షణకు స్కిల్స్ వర్సిటీ.. తొలిసారిగా ఇన్ని కోర్సులు ప్రారంభం
నైపుణ్యం లేక గల్ఫ్ దేశాలకు వెళ్లడం వల్ల కష్టాలపాలు అవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో వర్సిటీకి ఈ పేరు పెట్టామని చెప్పారు. లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించడమే ఈ వర్సిటీ లక్ష్యమని పేర్కొన్నారు.
నైపుణ్య యూనివర్సిటీలో మొత్తం 17 కోర్సులుంటాయని, తొలి ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభిస్తున్నామని, 2 వేల మందికి ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు. గురువారం శాసనసభలో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ’ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. తర్వాత జరిగిన చర్చలో సీఎంతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
చదవండి: 2 Lakh Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్
57 ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో..
‘ముచ్చర్లలో 57 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి అక్కడ తరగతులు ప్రారంభిస్తాం. అప్పటివరకు సమయం వృథా కాకుండా ఈ ఏడాదే గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఆరు కోర్సులు ప్రారంభిస్తాం. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, ఇ–కామర్స్ అండ్ లాజిస్టిక్స్, స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్.. ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, స్కూల్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, స్కూల్ ఆఫ్ రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ అండ్ కామిక్స్ కోర్సులు ప్రారంభిస్తాం.
పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు ఆయా పరిశ్రమల ప్రతినిధులే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. ఈ మేరకు దేశంలోని ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మాస్యూ టికల్ వైపు, బ్యాంకింగ్ విషయంలో ఎస్‌బీఐ, కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వీఎఫ్‌ఎక్స్ అసోసియేషన్ వారు ముందుకొచ్చారు..’ అని సీఎం వివరించారు.
ఏడాదికి రూ.50 వేలు ఫీజు
‘ఏడాదికి రూ.50 వేలు నామమాత్రపు ఫీజుతో శిక్షణ అందిస్తాం. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తాం. హాస్టల్ వసతి కల్పిస్తాం. భవిష్యత్తులో జిల్లాల్లోనూ వర్సిటీ పరిధిలో కాలేజీలు ఏర్పాటు చేస్తాం. యూనివర్సిటీలో 3 నెలల నుంచి 6 నెలలు శిక్షణ ఇచ్చి సర్టిపికెట్లు ఇస్తారు. అలాగే రెండు మూడేళ్ల డిప్లొమా కోర్సులు కూడా అందిస్తాం. డిగ్రీ పట్టాలు కూడా ఇస్తారు. తర్వాత వాళ్లు పీజీ, పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు.
యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో ప్రముఖ వ్యాపారవేత్తను చైర్మన్‌గా, చాన్స్‌లర్‌గా, ప్రసిద్ధిగాంచిన వారిని వైస్ చాన్స్‌లర్లుగా నియమించాలని భావిస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ వచ్చి సూచనలు ఇస్తే సంతోషించేవాళ్లం. కానీ ఆయన సభకు రాలేదు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వచ్చిన వారు వాకౌట్ చేసి వెళ్లిపోయారు..’ అని రేవంత్ విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాందీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు దేశ పురోభివృద్ధికి చేసిన కృషిని ముఖ్యమంత్రి వివరించారు.
నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి పునాదులు వేశారని, ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు ప్రస్తుతం మనవారే సీఈవోలుగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు సైతం డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్నారని, వారిని వాటి నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
వర్గీకరణపై నిర్ణయానికి ప్రత్యేకంగా అసెంబ్లీ
ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి రిజర్వేషన్ల వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. వర్గీకరణ కోసం తరాలకు తరాలు నిరీక్షించాయని చెప్పారు. వారికీరోజు శుభదినమని పేర్కొన్నారు. దళిత బిడ్డలు ఓట్లేస్తేనే మా అక్కలు గెలిచారన్నారు.
సెట్విన్, ఐటీఐలను మూసేస్తారా: ఒవైసీ
‘స్కిల్స్ వర్సిటీ రావడం వల్ల ఇప్పటికే ఉన్న సెట్విన్, ఐటీఐ, యూత్ సర్వీసెస్ వంటి వాటికి ఇబ్బందులు రావా..? వాటిని మూసేస్తారా?’ అని మజ్లిస్ పక్ష నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. తాము స్కిల్స్ యూనివర్సిటీకి వ్యతిరేకం కాదని, కానీ ఇప్పటికే ఉన్న వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వర్సిటీ సెలెక్ట్ కమిటీలో మైనారిటీలకు కూడా అవకాశం ఉండాలన్నారు. కాగా సీఎం బదులిస్తూ.. ఐటీఐ, సెట్విన్ వంటి వాటిని మూసివేయబోమని చెప్పారు.
జిల్లాలకు విస్తరించాలి
నైపుణ్య విశ్వవిద్యాలయ సేవలను జిల్లా కేంద్రాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నైపుణ్య శిక్షణ కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిపారు.
నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు నిదర్శనమని కాంగ్రెస్ సభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ వర్సిటీకి గవర్నర్ వైస్ చాన్స్‌లర్‌గా ఉండేలా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ కోరారు.
నైపుణ్య అంతరాన్ని తగ్గించేందుకే: శ్రీధర్‌బాబు
విద్య, ఉపాధి మధ్య ఉన్న నైపుణ్య అంతరాన్ని భర్తీ చేయడానికి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి, ఉపాధిలో అంతర్జాతీయంగా పోటీ పడేలా చేయడమే దీని ముఖ్యోద్దేశమన్నారు.
దేశంలోని పలు యూనివర్సిటీల ఏర్పాటును అధ్యయనం చేసిన తర్వాతే బిల్లును రూపొందించినట్లు తెలిపారు. జర్మనీ, దక్షిణ కొరియా, చైనా, సింగపూర్ వంటి దేశాలు తమ విద్యా వ్యవస్థతో వృత్తి విద్యలను ఎలా అనుసంధానం చేశాయో పరిశీలించినట్టు చెప్పారు.
Tags
- Skill Training
- Skill University
- Revanth Reddy
- Young India Skills University
- Young India Skills University of Telangana
- Mahatma Gandhi
- Telangana News
- Unemployment
- ProfessionalSkills
- RevanthReddy
- YoungIndiaSkillsUniversity
- skilltrainings
- GovernmentInitiative
- SkillDevelopment
- EmploymentOpportunities
- HyderabadNews
- sakshieducation latest news