Engineering Colleges: ర్యాంకర్లూ కోసం... ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల వెతుకులాట..
టీఎస్‌ఏపీఈ సెట్ ఇంకా జరగకముందే వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్లు బ్లాక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు జేఈఈ ర్యాంకర్ల తల్లిదండ్రులతో బేరసారాలు సాగిస్తున్నాయి. సదరు ర్యాంకర్లు చదివిన కాలేజీల ప్రిన్సిపల్స్‌ను సంప్రదిస్తూ, వారి చేత విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో వారి చేత దరఖాస్తులు చేయించడం, స్లైడింగ్ వరకూ వాళ్ళు కాలేజీల్లో చేరకుండా చూడటం, ఆఖరుకు ఆ సీటును స్పాట్‌లో రూ.లక్షల్లో అమ్ముకోవడం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల వ్యూహం. ఈ తంతు ప్రతీ ఏటా జరుగుతూనే ఉంది.
ఉన్నత విద్యా మండలి, ప్రభుత్వం ఈ దందాను అడ్డుకోలేకపోతున్న దరిమిలా ప్రతీ ఏటా దాదాపు 700 సీట్లను ఇలానే అమ్ముకుంటున్నారు. ఒక్కో సీటుకూ కాలేజీని బట్టి రూ.18 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
దందా ఎలా చేస్తారంటే..
జేఈఈలో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థుల చేత కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేయిస్తున్నాయి. సీటు రాగానే అడ్మిషన్ తీసుకునేలా చేస్తున్నాయి. దీంతో ఆ సీటుకు మళ్ళీ కౌన్సెలింగ్ చేపట్టరు. 4,5 దఫాల కౌన్సెలింగ్ వరకూ వీళ్ళు వచ్చిన సీటులో చేరతామనే చెబుతున్నారు.
చివరగా స్లైడింగ్ ప్రక్రియ (ఒక కోర్సులో వారు ఇంకో కోర్సులో చేరడం) వరకూ ఇలాగే ఉంటారు. ఇది పూర్తవ్వగానే తాము ఎన్‌ఐటీలో చేరుతున్నట్టు యాజమా న్యానికి లేఖ ఇస్తున్నారు. ప్రతీ ఏటా ఇలా 500 మంది వరకూ ఉంటున్నారు.
అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తవ్వడంతో ఎన్‌ఐటీలో చేరడం వల్ల మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ దశలో ఎవరు ముందొస్తే వారికి ర్యాంకును బట్టి సీటు ఇస్తున్నారు.
కంప్యూటర్ కోర్సులపైనే గురి
రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో 30 శాతం యాజమాన్య కోటా సీట్లు ఉంటాయి. మిగిలినవన్నీ కన్వీనర్ కోటా సీట్లు. గత కొన్నేళ్ళుగా కంప్యూటర్ సైన్స్ కోర్సుకు బాగా డిమాండ్ పెరిగింది. 58 శాతం సీట్లు ఈ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల్లో గరిష్టంగా 6 వేల ర్యాంకులోపే కంప్యూటర్ కోర్సులో సీట్లు భర్తీ అవుతున్నాయి.
జేఈఈలో వెయ్యిలోపు ర్యాంకు పొందిన విద్యార్థులు రాష్ట్ర ఏపీఈసెట్‌లోనూ వెయ్యి, 1,500 లోపు ర్యాంకు పొందుతున్నారు. ఈ కారణంగా వీళ్ళకు రాష్ట్రంలోని కాలేజీల్లో మొదటి కౌన్సెలింగ్‌లోనే సీఎస్‌ఈ బ్రాంచీలో సీటు లభించే వీలుంది. వాస్తవానికి వీళ్ళు అడ్వాన్స్‌డ్‌లో సీటు వస్తే ఐఐటీలు, లేదంటే జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతారు. అంతే తప్ప రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరడం అరుదు. ఇలాంటి వాళ్ళనే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఎంపిక చేసుకుంటున్నాయి.
అలాంటి విద్యార్థులకు రూ. 4 లక్షల వరకూ ఆఫర్..
తమకు సహకరించే విద్యార్థులకు రూ.4 లక్షల వరకూ కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇలా ప్రోత్సహించిన ఇంటర్ కాలేజీల ప్రిన్సిపల్స్‌కు గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ ముట్టజెబుతున్నాయి. దీనివల్ల ఏ ఇబ్బందీ ఉండదని తాము చదివిన ఇంటర్ కాలేజీల ప్రిన్సిపల్స్ చెప్పడంతో విద్యార్థులూ సహకరిస్తున్నారు.
ఏపీఈసెట్‌లో లక్షల్లో ర్యాంకు వచ్చిన వారికి కూడా కాలేజీలు కంప్యూటర్ సైన్స్ కోర్సులో సీట్లు ఇస్తున్నాయి. ఇలాంటి విద్యార్థులు ముందే కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడుకుంటున్నాయి.
ఒక్కో సీటుకు రూ. 12 నుంచి 18 లక్షల వరకూ అమ్ముకుంటున్నారు. ఈ మొత్తం ముందే చెల్లించేందుకు విద్యార్థులు ముందుకొస్తున్నారు. ఇలా కాలేజీలు రూ.కోట్ల వ్యాపారం అక్రమ మార్గంలో చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
ఆన్‌లైన్ విధానంతో ఇలాంటి అక్రమాలకు చెక్
వాస్తవానికి మిగిలిపోయిన సీట్లను ముందుగా జేఈఈ ర్యాంకర్లకు ఇవ్వాలి. వాళ్ళు లేకపోతే రాష్ట్ర ఏపీఈసెట్‌లో ర్యాంకుల ప్రాతిపదికగా, వాళ్ళూ లేకుంటే ఇంటర్ మార్కుల్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఈ ప్రక్రియకు ఎలాంటి పారదర్శకత ఉండటం లేదు.
విద్యార్థి తనకు ర్యాంకు వచ్చింది, దరఖాస్తు చేసినా తిరస్కరించారని చెప్పేందుకు ఆధారాలూ ఉండటం లేదు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగిస్తే ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.