JNTU-GV: ప్రగతిపథం.. ల్యాబ్ భవనాల విస్తరణ

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీనిని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత అందుకు తగ్గట్లుగా పలు అభివృద్ధి పనులకు నాంది పలికారు. బాలికలకు మూడో వసతిగృహం అందుబాటులోకి వచ్చింది. రెండు ల్యాబ్‌లకు భవనాలు సమకూరాయి.
తొలుత ఇంజినీరింగ్ కళాశాలగా ఉన్న జేఎన్‌టీయూ ప్రాంగణాన్ని జేఎన్‌టీయూ–జీవీ యూనివర్సిటీగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసిన తర్వాత ఏడాది కిందటే వైస్‌చాన్సలర్‌ను నియమించింది. మరోవైపు యూనివర్సిటీ విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాలకు సంబంధించిన అభివృద్ధికి ప్రణాళికలు రచించారు.
చదవండి: Railway Jobs: 2024లో రైల్వేలో భారీ ఉద్యోగాలు.. జాబ్ క్యాలెండర్ ఇదే..
అందులో భాగంగా నిర్మాణ పనులు పూర్తయిన బాలికల వసతిగృహం, మెటలర్జికల్ ఇంజినీరింగ్ ల్యాబ్, సివిల్ ఇంజినీరింగ్ ల్యాబ్ భవనాలను ఫిబ్రవరి 13న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. వీసీ లాంజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
రెండు విభాగాల ల్యాబ్ భవనాల విస్తరణ
ప్రధానమైన కోర్సుల వారికి ల్యాబ్‌లు ఉన్నా ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా లేవు. గత కొన్నేళ్లుగా పరిశోధన, బోధనలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకు పరిష్కారంగా మెటలర్జికల్ ఇంజినీరింగ్ ల్యాబ్ భవనానికి రూ.1.25 కోట్లు, సివిల్ ఇంజినీరింగ్ ల్యాబ్ భవనానికి రూ.1.25 కోట్లు జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీ యాజమాన్యం మంజూరు చేసింది.
నిర్మాణ పనులు పూర్తయిన ఈ భవనాలను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగానే మరో రూ.3.80 కోట్లతో ప్రతిపాదించిన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ లాంజ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.నాగలక్ష్మి, జేఎన్‌టీయూ జీవీ వీసీ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్, తదితరులు పాల్గొన్నారు.
రూ.17.99 కోట్లతో అకడమిక్ భవనాల విస్తరణ
యూనివర్సిటీ ప్రాంగణంలో ఇప్పటికే ఉన్న రెండు అకడమిక్ భవనాలు సరిపోవడం లేదు. విధుల నిర్వహణ పెద్ద సమస్యగా ఉందని యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపినా గత ప్రభుత్వంలో పాలకులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో బ్లాక్ నిర్మించడానికి అనుమతులు ఇచ్చింది. జేఎన్‌టీయూ–కాకినాడ యాజమాన్యం నుంచి ఈ మేరకు నిధులు రూ.17.99 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ భవనం నిర్మాణ దశలో ఉంది.
రూ.1.20 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంక్
యూనివర్సిటీకి అవసరమైన తాగు, వినియోగపు నీటి సౌకర్యాల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే ప్రాంగణంలో ఉన్న ఏర్పాట్లతో విభాగాల వారీగా మోటార్లతో తోడి అందిస్తున్నారు. దీనికి బదులుగా గ్రావిటీతో నీరు అందించేలా సమీపంలోని కొండ మీద ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకు రూ.1.20 కోట్ల నిధులు విడుదల చేసింది.
విద్యపై ఖర్చు భవితకు పెట్టుబడి...
ప్రభుత్వం విద్యారంగంపై ఖర్చుపెట్టే ప్రతీ పైసా భవిష్యత్ తరానికి పెట్టుబడిగా భావిస్తోంది. రాష్ట్ర చరిత్రలో గతమెన్నడూ లేనివిధంగా ఈ నాలుగున్నరేళ్లలో రికార్డు స్థాయిలో సుమారు రూ.73వేల కోట్లను ఖర్చు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ట్యాబ్‌ల పంపిణీ, సీబీఎస్‌సీ సిలబస్, ఐబీఎంతో ఒప్పందం అందులో భాగమే.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ విధానంలో అందుబాటులోకి రానున్నాయి. జేఎన్‌టీయూ–గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయాన్ని ప్రపంచస్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని వసతులను కల్పిస్తాం.
– బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి