Skip to main content

Fee Reimbursement: జాతీయ విద్యా సంస్థల్లో చదివే ఈ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (ఆర్టీఎఫ్‌) పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Fee Reimbursement
జాతీయ విద్యా సంస్థల్లో చదివే ఈ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు వంటి 200కు పైగా ఇన్‌స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన రాష్ట్ర బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించనుంది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఈ పథకాన్ని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే బీసీలకు కూడా వర్తింపజేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు.

చదవండి: IIT Tirupati Job Notification 2023: ఐఐటీ తిరుపతిలో స్పోర్ట్స్‌ కోచ్, జిమ్‌ ట్రైనర్‌ పోస్టులు.. నెలకు రూ.25,000 జీతం..

ఏటా సుమారు 10 వేల మందికి..

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లను అందజేస్తోందని.. రాష్ట్రంలో చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని మంత్రి గంగుల గుర్తు చేశారు. ఇకపై దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఫీజు అందించనుందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని పేర్కొన్నారు.

చదవండి: National Education Policy: జాతీయ విద్యా విధానం వార్షికోత్సవం

ఈ నిర్ణయంతో ఏటా రాష్ట్రానికి చెందిన దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.150 కోట్ల భారం పడుతుందని గంగుల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతు బంధు, ఉచిత కరెంటు తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అని పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు రూ.లక్ష ఆర్థిక సాయం, ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.

ఈ నిర్ణయం విప్లవాత్మకం: జూలూరు గౌరీశంకర్‌
ఎక్కడా లేని విధంగా దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Published date : 26 Jul 2023 11:33AM

Photo Stories