Skip to main content

Engineering: ఒక్కో విద్యార్థిపై సగటున ఏటా ఇన్ని వేల అదనపు భారం

తెలంగాణ రాష్ట్రంలోని Engineering కళాశాలల్లో పెరిగిన ఫీజులు.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు గుదిబండగా మారనున్నాయి.
Engineering
ఒక్కో విద్యార్థిపై సగటున ఏటా ఇన్ని వేల అదనపు భారం

సగటున ఒక్కో విద్యార్థిపై ఏటా అదనంగా రూ.20 వేల భారం పడుతుందని.. నాలుగేళ్లకు కలిపి రూ.80వేలు భరించాల్సి వస్తుందని విద్యా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ ఫీజులు పెంచిన కళాశాలల్లో చేరే దాదాపు 45వేల మంది విద్యార్థులపై ఈ భారం పడనుంది. వీరంతా కన్వీనర్‌ కోటా కింద చేరే విద్యార్థులే కానుండటం గమనార్హం. ఇక అదనపు ఫీజు భారానికితోడు ట్రాన్స్‌పోర్టు/హాస్టల్‌/ల్యాబ్‌ ఖర్చులపేరిట ప్రతినెలా మరో రూ.ఐదు వేల వరకు భారం పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ ఫీజులో అదనంగా రూ.లక్షకుపైనే ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

చదవండి: Career Opportunities in Mobile App Development... నైపుణ్యాలు, కొలువులకు మార్గాలు..

రూ.45 వేల దాకా అదనపు భారం 

కోర్టు అనుమతి మేరకు కాలేజీలను బట్టి వార్షిక ఫీజు కనీసం రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.45 వేల వరకు పెరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 10వేలలోపు ర్యాంకు వచ్చి కాలేజీల్లో చేరే దాదాపు ఆరు వేల మంది బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు పూర్తిఫీజును ప్రభుత్వం ఇస్తుంది. గతేడాది కనీస ఫీజు రూ.35 వేలు, గరిష్ట ఫీజు రూ.1.38 లక్షలు ఉండేది. అదిప్పుడు రూ.45 వేల నుంచి రూ1.73 లక్షలకు పెరిగింది. ఈ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మరోవైపు పదివేలకన్నా పైన ర్యాంకు వచ్చినవారికి ప్రభుత్వం కనీస ఫీజును మాత్రమే చెల్లిస్తుంది. ఆపై మొత్తాన్ని విద్యార్థులే కట్టాలి. దీంతో పదివేలపైన ర్యాంకు వచ్చిన బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులందరిపై పెరిగిన ఫీజు మోత మోగనుంది. 
ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పరిధిలోకి రానివారికీ భారం పడుతోంది. సగటున చూస్తే ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.20వేల చొప్పున నాలుగేళ్లకు రూ.80 వేలకుపైగా అదనపు భారం పడనుంది. 

చదవండి: Coding and Programming Jobs: కోడింగ్‌తో కొలువులు.. నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలు..

పెంచిన ఫీజులను తగ్గించాల్సిందే.. 

ఏఎఫ్‌ఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష సహకారంతోనే ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఫీజులు పెంచుకున్నాయి. దీనిని వెంటనే వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనా ప్రభావం నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్‌ ఫీజులు పెంచవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. పేద విద్యార్థులపై ఫీజుల భారం మోపారు. 
– ప్రవీణ్, ఏబీవీపీ నేత 

చదవండి: Social Sector Jobs: కార్పొరేట్‌ జాబ్స్‌ వదిలి.. సోషల్‌ సెక్టార్‌ వైపు అడుగులు వేస్తున్న యువత!

కోర్టుకెళ్లి పెంచుకున్న కాలేజీలు 

Admission and Fee Regulatory Committee, Telangana(TSAFRC)’ ఈసారి ఇంజనీరింగ్‌ కళాశాల ల్లో ఫీజుల పెంపు ప్రక్రియ చేపట్టింది. కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి, యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి.. 20 నుంచి 25% ఫీజుల పెంపును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలపై ఏమీ తేల్చలేదు. దీనితో 81 ఇంజనీరింగ్‌ కాలేజీలు కోర్టును ఆశ్రయించి ఈ విద్యా సంవత్సరంలోనే ఫీజుల పెంపునకు అనుమతి తెచ్చుకున్నాయి. అయితే కోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటివరకు అప్పీలు చేయలేదని.. అంటే పరోక్షంగా పెంపును అంగీకరించనట్లేనన్న విమర్శలు వస్తున్నాయి.

చదవండి: Technology Jobs: బ్లాక్‌చైన్‌ డెవలపర్‌.. ఐబీఎం, అసెంచర్ వంటి కంపెనీల్లో ఉద్యోగం.. ల‌క్షల్లో వేత‌నం..

Published date : 07 Sep 2022 01:46PM

Photo Stories