Skip to main content

TS EAPCET 2024 Toppers Stories: తండ్రి ప్రైవేట్‌ ఉద్యోగి, తల్లిది కుట్టు పని

TS EAPCET 2024 Toppers Stories
TS EAPCET 2024 Toppers Stories

జ్యోతినగర్‌(రామగుండం): జిల్లా కు చెందిన పలువురు విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మ సీ ప్రవేశ పరీక్షలో మంచి ప్రతిభ చాటారు. శనివారం విడుదల చేసిన ఈఏపీ సెట్‌లో ర్యాంక్‌లు సాధించడంతో పలువురు అభినందించారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన తొడుపునూరి నరేందర్‌–స్రవంతి దంపతుల కుమారుడు శ్రీసాయిచంద్ర ఈఏపీసెట్‌లో 3,243 ర్యాంక్‌ సాధించాడు. శ్రీసాయిచంద్ర హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేశాడు.

రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్‌ గ్రామానికి చెందిన కమ్మల శశిధర్‌శర్మ–అనురాధ దంపతుల కూతురు మేఘన ఈఏపీసెట్‌లో 3,000 ర్యాంక్‌ సాధించింది. హైదరా బాద్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఆమె ఇంటర్‌ పూర్తిచేసింది. ప్రతిభ పాటిన మేఘనను పలువురు అభినందించారు.

జనగామ జిల్లా : స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్‌, లలిత కుమారుడు మణితేజ. 1 నుంచి ఆరో తరగతి వరకు స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియంలో చదివాడు. వేణుగోపాల్‌ పిల్లల చదువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు భార్యా పిల్లలతో వెళ్లాడు. అక్కడే ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య లలిత ఇంటి వద్ద మిషన్‌ కుడుతూ పిల్లలను చదివించారు. ఈక్రమంలో మణితేజ 6 నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ స్కూల్‌లో చదివాడు. మణితేజకు పదో తరగతిలో అనుకున్నన్ని మార్కులు రాలేదు. పదోతరగతిలో 8.2 జీపీఏ మార్కులు సాధించిన మణితేజ ఇంటర్‌ హైదరాబాద్‌లో ఎంపీసీ చదివాడు. ఇంటర్‌లో 715 మార్కులు సాధించాడు.  చదువు విలువను తెలిపి పిల్లలను మోటివేట్‌ చేశాం. ఐదేళ్లు కష్టపడి చదివితే భవిష్యత్‌ బాగుంటుందని చెప్పేవాళ్లం. ఈఏపీసెట్‌లో ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందాడు. స్టేట్‌ ర్యాంక్‌ సాధించిన మణితేజను శివునిపల్లి వాసులు, స్నేహితులు, బంధువులు అభినందించారు.

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందిన రావి సుహాస్‌ 1,670 ర్యాంక్‌ సాధించాడు. అతడి తండ్రి సురేశ్‌ కరీంనగర్‌లోని ఓ మెడికల్‌ షాపులో గుమస్తాగా పనిచేశాడు. పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి అరుణ ప్రైవేట్‌ టీచరుగా పనిచేస్తూ కుమారుడు సుహాస్‌, కూతురు సంజనను చదివిస్తోంది. తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని ఇద్దరు పిల్లలు శ్రద్ధతో చదువుతున్నారు. సుహాస్‌ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదివి 10 జీపీఏ సాధించాడు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదివి 976 మార్కులు పొందాడు. ఇటీవల ఇడుదలైన జేఈఈ మెయిన్‌లో 98.5 శాతం పర్సంటైల్‌ సాధించాడు. తను ఇస్రోలో సైంటిస్ట్‌ కావాలనేది లక్ష్యమని సుహాస్‌ తెలిపాడు.

గోదావరిఖనిటౌన్‌: స్థానిక చంద్రబాబుకాలనీకి చెంది న పెంచాల అనన్య 1,093 వ ర్యాంక్‌ సాధించింది. స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఆమె ఇంటర్‌ చదివింది. మా అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఈఏపీ సెట్‌లో 1,093 ర్యాంకు సాధించానని అనన్య తెలిపింది. జేఈఈ మెయిన్స్‌లో ఆల్‌ ఇండియా ఓబీసీ కేటగిరీలో 15వేల ర్యాంక్‌ సాధించినట్లు వివరించింది. తన తండ్రి రేడియం వర్క్‌షాపు నిర్వహిస్తూ తనను, తన తమ్ముడిని చదివిస్తున్నాడని తెలిపింది.

హనుమకొండలోని రెడ్డి కాలనీకి చెందిన గడ్డం శ్రీవర్షిణి , అగ్రికల్చర్‌, ఫార్మసీలో (హాల్‌టికెట్‌ నంబర్‌ 2411ఆర్‌09048, మార్కులు 145.255026) రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించింది.మధ్య తరగతి కుటుంబంలో విద్యా కుసుమాలు వికసించాయి. కఠోర శ్రమ, అంకుఠిత దీక్షతో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. అప్పటి వరకు ఇరుగుపొరుగు వారికి అంతంత మాత్రంగానే తెలిసిన శ్రీవర్షిణి సింగిల్‌ డిజిట్‌ ర్యాంకు సాధించడంతో కాలనీవాసుల అభినందనలతో తల్లిదండ్రులు మురిసిపోయారు. గడ్డం కన్నయ్య, లావణ్య దంపతుల కుమార్తె శ్రీవర్షిణి, కుమారుడు ఫణితేజ. ఫణితేజ కర్ణాటకలోని ధార్‌వాడలో ఐఐటీ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కన్నయ్య ప్రైవేట్‌ సంస్థలో మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తుండగా.. తల్లి లావణ్య గృహిణి. శ్రీవర్షిణి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదివి 10/10 మార్కులు సాధించింది. హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివి 987 మార్కులు తెచ్చుకుంది. శ్రీవర్షిణి ఇటీవల నీట్‌ రాసింది. అందులోనూ 200లోపు ర్యాంక్‌ వస్తుందని ఈ సందర్భంగా ఆమె ధీమా వ్యక్తం చేసింది.

 

Published date : 21 May 2024 11:25AM

Photo Stories