Skip to main content

TS EAMCET: అందరి గురి..ఈ బ్రాంచ్ పైనే..ఎందుకంటే..?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌పై విద్యార్థులు ఈసారి పెద్దఎత్తున ఆశలు పెంచుకున్నారు.

మునుపెన్నడూ లేని రీతిలో పోటీ పడుతున్నారు. ఆప్షన్ల గడువు (న‌వంబ‌ర్ 10వ తేదీ) బుధవారంతో ముగుస్తుండగా.. మంగళవారం సాయంత్రానికి 34 వేల మంది.. దాదాపు 15 లక్షలకుపైగా ఆప్షన్స్‌ ఇచ్చినట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. గతంలో 25 వేల మందే రెండో కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా.. 46,322 మంది మాత్రమే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. వీరిలో 3 వేల మంది వచ్చిన సీటును గడువులోగా వదులుకున్నారు. వీళ్లంతా నచ్చిన కాలేజీ, బ్రాంచ్‌లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు పొందిన వారు లేదా జాతీయ కాలేజీల్లో కచి్చతంగా సీటొస్తుందని భావించే వారు. 

దీనికే ప్రాధాన్యత.. 
ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో హైకోర్టు ఆదేశంతో ఇంజనీరింగ్‌ సీట్లు పెరిగాయి. ఇవి కన్వీనర్‌ కోటా కింద 4,404 వరకూ ఉన్నాయి. ఇందులో సింహభాగం కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులే ఉన్నాయి. వీటిపైనే విద్యార్థులు ఎక్కువగా ఆశలు పెంచుకున్నారు. పెరిగిన సీట్లలో ఎక్కడో అక్కడ కన్వీనర్‌ కోటాలో సీటు వస్తుందని ఆశిస్తున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో పోటీ పెరగడానికి ఇదే ప్రధాన కారణమని ఉన్నత విద్యా మండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన‌ ఆప్షన్స్‌లో 89 శాతం కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే మొదటి దశలో సీటొచ్చిన అభ్యర్థులు పెరిగిన సీట్లను అంచనా వేసుకుని రెండో దశలో కంప్యూటర్‌ కోర్సుల కోసం పోటీ పడ్డారు. ఇందులోనూ మొదటి ప్రాధాన్యత ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌కే ఇవ్వడం విశేషం. 

ఎట్టకేలకు...
పెరిగిన సీట్లపై తొలుత పేచీ పెట్టిన జేఎన్‌టీయూహెచ్‌ ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసింది. విశ్వవిద్యాలయం గుర్తింపు ఉంటే తప్ప కౌన్సెలింగ్‌కు వెళ్లే అవకాశం లేదని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఒకదశలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ ద్వారా పెరిగే సీట్లను భర్తీ చేయాలనుకున్నారు. కానీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో వర్సిటీ కూడా మొత్తం సీట్లకు ఆమోదం తెలపకతప్పలేదు. అయితే, పెరిగిన సీట్లకు అనుకూలంగా వసతులు, ఫ్యాకల్టీని మెరుగుపరచాలని వర్సిటీ ప్రైవేటు కాలేజీలకు షరతు విధించింది.

పెరిగిన సీట్లు ఇవీ... 

బ్రాంచ్‌ సీట్లు
సీఎస్‌ఈ  ఆర్టీఫీషియల్‌  ఇంటెలిజెన్స్‌ మిషన్‌ లెర్నింగ్‌   1,533 
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటాసైన్స్‌ 840 
సీఎస్‌సీ (డేటాసైన్స్‌)  672 
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మిషన్‌ లెర్నింగ్‌   546 
సీఎస్‌ఈ (సైబర్‌ సెక్యూరిటీ)  231 
సీఎస్‌ఈ   168 
కంప్యూటర్‌ సైన్స్‌ డిజైన్‌ 168
ఎల్రక్టానిక్స్‌ కమ్యూనికేషన్‌  126 
సీఎస్‌ఈ (ఐవోటీ) 42 
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ  21
ఈఈఈ 21 
సివిల్‌ ఇంజనీరింగ్‌ 21
మైనింగ్‌ ఇంజనీరింగ్‌  15

 

Published date : 10 Nov 2021 05:20PM

Photo Stories