TS DSC Notification Released 2023: శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు, వయోపరిమితి, సిలబస్, పరీక్షావిధానం వివరాలు ఇవే..
ఈమేరకు 5089 టీచర్ల పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఖాళీల వివరాలు ఇలా..
☛ స్కూల్ అసిస్టెంట్ (SA) : 1739
☛ సెకండరీ గ్రేడ్ టీచర్లు : 2575
☛ భాష పండితులు : 621
☛ పీఈటీలు : 164
☛ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రాథమిక పాఠశాలలో : 796
☛ ప్రాథమికోన్నత పాఠశాలలు : 727
ముఖ్యమైన తేదీలు ఇవే..
- దరఖాస్తులు :సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.
- పరీక్ష తేదీ : నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
- దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
- వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి.
- పూర్తి వివరాలకు : https://schooledu.telangana.gov.in/ISMS/
వయో పరిమితి సడలింపు వీరికే..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో పదేళ్ల పాటు సడలింపు ఉంటుంది.
ప్రిపరేషన్ టీప్స్ ఇలా..
ఎస్‌జీటీ అభ్యర్థులు :
- ఎస్‌జీటీ పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. అవి.. విద్యా దృక్పథాలు, కంటెంట్, మెథడాలజీ.
- విద్యా దృక్పథాలకు సంబంధించి వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు; దేశంలో విద్యా చరిత్ర; ఉపాధ్యాయ సాధికారత, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, విద్యాహక్కు చట్టం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- సోషల్‌లో భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం కంటెంట్ కోసం పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదవాలి.
- మ్యాథ్స్‌లో సంఖ్యామానం, అంకగణితం, బీజగణితం, సమితులు-సంబంధాలు, క్షేత్రగణితం, రేఖాగణితం;
- తెలుగులో కవులు-కావ్యాలు, భాషా రూపాలు, పరుషాలు-సరళాలు;
- ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వొకాబ్యులరీ, ఆర్టికల్స్-ప్రిపొజిషన్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- మెథడాలజీని ప్రత్యేక దృష్టితో చదవాలి.
- బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనా ప్రణాళిక, మూల్యాంకనం తదితర అంశాలను కంటెంట్‌లోని టాపిక్స్‌తో అన్వయించుకుంటూ చదవాలి.
స్కూల్ అసిస్టెంట్.. ప్రతి సబ్జెక్ట్‌కు..
- స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అభ్యర్థులు తమకు అర్హత ఉన్న సబ్జెక్ట్ పరంగా ప్రత్యేక దృక్పథంతో చదవాలి.
- సోషల్ స్టడీస్ ఎస్‌ఏ పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. కంటెంట్ పరంగా.. భూగోళశాస్త్రం: సౌర కుటుంబం-భూమి; భూ ఉపరితల స్వరూపాలు-వర్గీకరణ; ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు; ఖండాలు; భారతదేశ ఉనికి-భౌతిక అమరిక; వాతావరణం; సముద్రాలు; తెలంగాణ భౌగోళిక అంశాల గురించి అవగాహన పొందాలి. చరిత్రకు సంబంధించి మధ్యయుగప్రపంచం; ప్రాచీన భారతీయ నాగరికతలు; ఢిల్లీ సుల్తానులు; మొఘలుల సామ్రాజ్యం; భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం; ఆధునిక ప్రపంచం; ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులపై ప్రత్యేక దృష్టితో చదవాలి. పౌరశాస్త్రంలో భారత రాజ్యాంగం; లౌకికత్వం-భారతదేశం; ప్రపంచ శాంతి-భారతదేశం పాత్ర; ఐక్యరాజ్య సమితి-విధి విధానాలపై అవగాహన పొందాలి. ఎకనామిక్స్ నుంచి ద్రవ్యోల్బణం; ఆర్థికాభివృద్ధి; భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు; జాతీయ ఆదాయం; ద్రవ్యం వంటి బేసిక్ కాన్సెప్ట్స్‌పై అవగాహన పొందాలి. సోషల్ స్టడీస్ మెథడాలజీలో సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశాలు; విలువలు; విద్యా ప్రణాళిక; ఉపాధ్యాయుడు; బోధ నోపకరణాలు; మూల్యాంకనం తదితర పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు.. కంటెంట్ పరంగా బీజ గణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం, రేఖా గణితం, త్రికోణమితి, శ్రేఢులు, సమితులు-సంబంధాలు వంటి అంశాలపై పట్టుసాధించాలి. మెథడాలజీలో.. గణితశాస్త్ర బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు, బోధనా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం వంటి పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
- బయాలజీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కంటెంట్ పరంగా.. జీవ శాస్త్రం-ఆధునిక పద్ధతులు, జీవ ప్రపంచం, సూక్ష్మ జీవుల ప్రపంచం, జంతు ప్రపంచం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్‌లో మెథడాలజీకి సంబంధించి జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు, విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక, జీవశాస్త్ర ఉపగమాలు-పద్ధతులు గురించి తెలుసుకోవాలి.
- ఫిజికల్ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు.. మెజర్‌మెంట్స్, యూనిట్స్, డైమెన్షన్స్, సహజ వనరులు, మన విశ్వం, కాంతి సిద్ధాంతం, ఉష్ణం, ధ్వని విభాగాలకు సంబంధించి ఉండే అన్ని అంశాలను అప్లికేషన్ విధానంలో నేర్చుకోవాలి. అదే విధంగా అయస్కాంతత్వం, విద్యుదయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఫిజికల్ సైన్సెస్‌లో మెథడాలజీకి సంబంధించి బోధన పరికరాలు, మూల్యాంకన పద్ధతులు, బోధనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాలపై పట్టు సాధించాలి.
పొంతన లేని టీచర్ ఉద్యోగాల లెక్కలు..
పాఠశాల విద్యలో 22 వేల ఖాళీలు ఉండే వీలుందని ఏడాది క్రితం విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులు 1,974, ప్రైమరీ హెచ్‌ఎం పోస్టులు 2,043, స్కూల్ అసిస్టెంట్లు 7,200, పీడీలు 25, ఎస్‌జీటీలు 6,775, లాంగ్వేజ్ పండిట్లు 688, పీఈటీలు 172, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు 1,733 ఖాళీలున్నాయని తేల్చింది. దీంతోపాటు ఎంఈవోలు 467, బాలికల పాఠశాలల హెచ్‌ఎంలు 15, డైట్ లెక్చర్లు 271, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు 58, డీఈవోలు 12 మందిని నియమించాలని సర్కార్‌కు నివేదించారు. ఇందులో 13 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ ఇప్పుడు 5,089 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది.
22 వేల ఖాళీలుంటే,.. 5,089 పోస్టులా..?
ఉపాధ్యాయ సంఘాలు కూడా 22 వేల ఖాళీలుంటే, 5 వేల పోస్టుల భర్తీ ఏంటని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం టీచర్లకు పదోన్నతులు ఇస్తే కొన్ని ఖాళీలు ఏర్పడతాయని చెబుతోంది. ఈ ప్రక్రియ ముందుకెళ్లే పరిస్థితి కన్పించడం లేదు.
కారణం ఇదేనా..?
టీచర్ నియామక ప్రకటన వెలువడేందుకు ముందు విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. రేషనలైజేషన్ ప్రకారం చూస్తే ఎన్ని ఖాళీలుంటాయని ఆరా తీశారు. టీచర్ పోస్టులు భారీగా కుదించుకుపోవడానికి డీఈవోల హేతుబద్దిణ నివేదికే కారణమని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ 30 మందికి ఒక టీచర్ చొప్పున అధికారులు లెక్క గట్టారు. దీన్ని కొలమానంగా తీసుకోవడం అశాస్త్రీయమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
రాష్ట్రంలో మూడోవంతు బడుల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 26,337 ఉన్నాయి. ఇందులో 8,782 (33.35 శాతం) చోట్ల 1–30 మంది విద్యార్థులున్నారు. ఈ తరహా హేతుబద్ధీకరణను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 30 మంది కన్నా తక్కువ ఉన్నా, అన్ని తరగతులకు టీచర్లు కావాలని, కానీ హేతుబద్దిణ పేరుతో ఒకే టీచర్‌ను ఇవ్వడం వల్ల అన్ని తరగతులు ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దీనివల్లే అసలైన ఖాళీలు బయటకు రాకుండా పోయాయని వాపోతున్నాయి.
మొత్తం 6,612 పోస్ట్‌లు
రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం-మొత్తం 6,612 టీచర్ పోస్ట్‌లకు త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్‌జీటీ)-2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్స్(ఎస్‌ఏ)-1,739 పోస్టులు;లాంగ్వేజ్ పండిట్స్(ఎల్‌పీ)-611పోస్టులు;ఫిజికల్ ఎడ్యు కేషన్ టీచర్స్ (పీఈటీ)-164 పోస్టులు; స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్-1,523 పోస్టులు ఉన్నాయి.
ఒక్కో పోస్ట్‌కు 61 మంది పోటీ..!
మొత్తం 6,612 పోస్ట్‌లకు నిర్వహించనున్న టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో ఒక్కో పోస్ట్‌కు దాదాపు 61 మంది పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణుల సంఖ్య దాదాపు 3.5 లక్షలు. వీరంతా దరఖాస్తు చేసుకోవడం ఖాయం. దీంతో.. ఒక్కో పోస్ట్‌కు 61 మంది పోటీ పడే పరిస్థితి ఉంది.
రాత పరీక్ష..:
ఉపాధ్యాయ పోస్ట్‌ల భర్తీకి సంబంధించి రాత పరీక్షను గతంలో మాదిరిగానే నిర్వహించే అవకాశముంది. 2017లో తొలిసారిగా టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో టీచర్ నియామకాలు చేపట్టారు. అందుకోసం టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సారి టీఎస్‌పీఎస్సీకి బదులుగా పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్ష ఆధారంగా జిల్లాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి.. ఆ తర్వాత డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ నేతృత్వంలో నియామకాలు ఖరారు చేయనున్నారు.
వెయిటేజీ విధానం :
టెట్‌కు వెయిటేజీ ఇచ్చే విధానాన్ని యథాతథంగా అమలు చేసే అవకాశం ఉంది. రాత పరీక్షకు 80 శాతం; టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇచ్చి.. తుది జాబితా రూపొందిస్తారు. గత రిక్రూట్‌మెంట్ విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సారి కూడా వెయిటేజీని అమలు చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అర్హతలు..
- సెకండరీ గ్రేడ్ టీచర్స్: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాసవ్వాలి. (లేదా) నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత (లేదా) ఎన్‌సీటీఈ నిబంధనలు-2002 ప్రకారం-45 శాతం మార్కులతో ఇంటర్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాసవ్వాలి. దీంతోపాటు టీఎస్ టెట్ లేదా ఏపీ టెట్ పేపర్-1లో లేదా సీటెట్‌లో అర్హత సాధించాలి.
- స్కూల్ అసిస్టెంట్స్: సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సబ్జెక్ట్ మెథడాలజీగా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి(లేదా) యాభై శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌తో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ పాసవ్వాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్ట్‌తో టెట్ పేపర్-2లో అర్హత సాధించాలి.
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి (లేదా) ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సులో 50 శాతం మార్కులతో పాసవ్వాలి (లేదా) ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(ప్రాథమిక పాఠశాలలు): తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌తోపాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉండాలి.
- లాంగ్వేజ్ పండిట్స్(భాష పండితులు): సంబంధిత భాష ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ లేదా సదరు భాష సాహిత్యంలో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ (లేదా) పీజీ ఉత్తీర్ణత (లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీఈడీలో సంబంధిత భాషను మెథడాలజీగా చదివి ఉత్తీర్ణత సాధించి ఉండాలి (లేదా) యాభై శాతం మార్కులతో తెలుగు మెథడాలజీలో నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్‌సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పాసవ్వాలి. దీంతోపాటు టీఎస్ టెట్ లేదా ఏపీ టెట్ పేపర్-2లో అర్హత సాధించాలి (లేదా) మ్యాథమెటిక్స్; సైన్స్ లేదా సోషల్ స్టడీస్ ఒక ఆప్షనల్‌గా సీటెట్‌లో అర్హత పొందాలి.
- పైన పేర్కొన్న పోస్ట్‌లకు సంబంధించిన గరిష్ట అర్హత మార్కులు జనరల్ కేటగిరీకి నిర్దేశించినవి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు ఉంటుంది.
80 మార్కులకు రాత పరీక్ష :
టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ పరీక్షను 80 మార్కులకు నిర్వహించే అవకాశముంది. ఎస్‌జీటీ పోస్ట్‌లకు 8 విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే వీలుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాల నుంచి 20 ప్రశ్నలు చొప్పున, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కో సబ్జెక్ట్‌లో 18 ప్రశ్నలు చొప్పున అడగనున్నారు.
అదే విధంగా టీచింగ్ మెథడాలజీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఇలా మొత్తం 8 విభాగాల్లో 160 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది.
ఎస్‌ఏ రాత పరీక్ష :
స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు కూడా 160 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష జరుగుతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్(20 ప్రశ్నలు-10 మార్కులు); విద్యా దృక్పథాలు (20 ప్రశ్నలు-10 మార్కులు); సంబంధిత సబ్జెక్ట్ కంటెంట్ (88 ప్రశ్నలు-44 మార్కులు); టీచింగ్ మెథడాలజీ (32 ప్రశ్నలు-16 ప్రశ్నలు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ సారి పరీక్షను ఆన్‌లైన్ టెస్ట్‌గా నిర్వహించే వీలుంది. పరీక్షకు లభించే సమయం రెండున్నర గంటలు.
Tags
- Teacher jobs
- ts dsc notification 2023 released
- TS DSC 2023 Syllabus
- ts dsc exam pattern
- ts dsc syllabus for sgt
- ts dsc syllabus for pet
- TS DSC 2023 Applications
- ts dsc notification released 2023
- TS DSC SGT
- TS DSC Notification 2023
- TS DSC 2023
- ts dsc notification 2023 telugu
- sakshi education jobs notification