Skip to main content

DSC 2023: 586 పోస్టులతో టీఆర్టీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: నిరుద్యోగులు ఎదురుచూస్తున్న టీఆర్టీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌)కు ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
DSC 2023,Mahbubnagar TRT News ,586 posts, Education Alert
586 పోస్టులతో టీఆర్టీ

 చివరిసారి 2018లో టీఎస్‌పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే చేపట్టనుంది. ఇందులో భాగంగా టీఆర్టీ కంటే ముందే టెట్‌ నిర్వహించాలని భావించిన ప్రభుత్వం జూన్‌లో దరఖాస్తులు సైతం స్వీకరించగా.. సెప్టెంబ‌ర్ 15న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో టీఆర్‌టీ కోసం దరఖాస్తు తేదీ నుంచి కేవలం 60 రోజుల్లో అంటే నవంబర్‌ 20 నుంచి అదే నెల 30వ తేదీ మధ్యలో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు.

అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 2 వేలకుపైగా పోస్టులు ఖాళీ ఉండగా.. 586 పోస్టుల భర్తీకి అవకాశం కల్పించడం ఏమిటని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్టు, కేటగిరీల వారీగా చూసినా చాలా తక్కువ ఉంటాయని, అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉన్నారని పేర్కొంటున్నారు. పోస్టులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో టెట్‌కు రెండు పేపర్లు కలిపి దరఖాస్తు చేసుకున్న వారు 80 వేలకుపైగా ఉండటంతో ఒక్కో పోస్టుకు 140– 150 మంది పోటీపడే అవకాశం ఉంది.

చదవండి: TS DSC Notification: తెలంగాణలో 6,612 పోస్ట్‌ల భర్తీకి ఆమోదం.. అర్హతలు, పరీక్ష విధానం
ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్‌లో 415 పోస్టులు, నాగర్‌కర్నూల్‌లో 450, నారాయణపేటలో 470, గద్వాల, వనపర్తిలో కలిపి 316 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో 30 శాతం పోస్టులు పదోన్నతులకు కేటాయించినా దాదాపు 1,400 పోస్టులు నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వమే తక్కువ పోస్టులు భర్తీ చేస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. చాలామంది గతేడాది నుంచి టీఆర్‌టీ కోసం ఎదురుచూస్తున్నారు.

మధ్యలో గురుకుల పోస్టులు పడినప్పటికీ అందులో దాదాపు 80 శాతం కేవలం మహిళలకే కేటాయించడంతో పురుష అభ్యర్థులు ఆశలన్నీ టీఆర్టీ మీదనే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎన్ని పోస్టులకు పదోన్నతులు కల్పిస్తున్నారనే అంశంపై ప్రభుత్వానికి స్పష్టత ఉండగా.. మిగిలిన పోస్టులను పెంచాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: DSC : Current Affairs లో జాతీయం, అంతర్జాతీయం & రాష్ట్రీయంలో వచ్చే ప్రశ్నలు ఇవే #sakshieducation

Published date : 09 Sep 2023 02:58PM

Photo Stories