Skip to main content

DSC 2024: కొత్త గురువులకు సరికొత్త పాఠాలు

సాక్షి, హైదరాబాద్‌: మరికొన్ని నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లోకి కొత్త టీచర్లు రాబోతున్నారు. 11,062 మందిని డీఎస్సీ ద్వారా నియమించబోతున్నారు.
New lessons for new teachers news in telugu  New teachers joining government schools in Hyderabad  Appointment of 11,062 teachers through DSC  Short-term training for new government school teachers

వాస్తవానికి వీళ్లంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన వాళ్లే. బోధనకు అవసరమైన బీఈడీ, డీఎడ్‌ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులైన వాళ్లే. అంతిమంగా డీఎస్సీ పరీక్షలోనూ ర్యాంకు కొట్టినోళ్లే. ఇన్ని ఉండీ వీళ్ళకు మళ్లీ శిక్షణ ఏంటి? అనే అనుమానం రావొచ్చు. కొత్తగా అడుగుపెట్టే టీచర్లకు సామాజిక, నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ శిక్షణ ముగిసిన తర్వాతే బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖకు చెప్పింది. దీంతో కొత్త టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణ సిలబస్‌ను రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) తీసుకుంటోంది. అవసరమైన పాఠ్యాంశాలను రూపొందిస్తోంది. టీచర్ల శిక్షణ కోసం ప్రత్యేకంగా రిసోర్స్‌ పర్సన్స్‌ను కూడా ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 9న టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా, ఆ తర్వాత నెల రోజులపాటు స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నారు.  

చదవండి: Nukamalla Indira: ఎంపీటీసీ నుంచి స్కూల్‌ టీచర్‌గా

విలువలే ముఖ్యం 

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కొన్నేళ్లుగా వక్రమార్గం పడుతోందన్న ఆరోపణలున్నాయి. విలువల్లేని టీచర్లపై విమర్శలొస్తున్నాయి. అనేక చోట్ల ఉపాధ్యాయుడే కీచకుడైన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు వీటిపై పెద్దగా అవగాహన ఉండదని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బాలికల చట్టాలు, మహిళా చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో వచ్చిన కొత్త చట్టాలను ఇందులో చేరుస్తున్నారు.

అవసరమైతే మహిళా న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలతో క్లాసులు చెప్పించే యోచనలో ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు కృషి చేసేలా ప్రేరణపరమైన క్లాసులు ఇప్పించనున్నారు.  

టెక్నాలజీపై పట్టు 

విద్యా వ్యవస్థలో సాంకేతికత వేగంగా చొచ్చుకుపోతోంది. టీచర్‌ కన్నా విద్యార్థే ముందుగా గూగుల్‌ సెర్చ్‌ ద్వారా సవాలక్ష అంశాలను తెరమీదకు తెస్తున్నాడు. వీటి నివృత్తిలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త టీచర్లకు అవసరం. టెక్నాలజీపై పట్టున్న యువత టీచర్లుగా వస్తున్నారు.

ఈ నేపథ్యంలో అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా బోధన చేయడం వంటి మెళకువలను అందించేందుకు నిపుణుల చేత శిక్షణ ఇప్పించనున్నారు. బోధనలో త్రీడీ, వర్చువల్‌ రియాలిటీ, ఆగుమెంటేషన్‌ వంటి సరికొత్త విధానాలపైనా మెళకువలు నేర్పించనున్నారు.  

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

మార్పు దిశగా అడుగులు 

కొత్త టీచర్లలో చాలామంది కొన్నేళ్ల క్రితం బీఈడీ పూర్తి చేశారు. ఆ సమయంలో వారి బీఈడీ సిలబస్‌లో ఉన్న పాఠ్యాంశాలు వేరు. ఇప్పుడు బోధన విధానం, విద్యార్థి మానసిక ధోరణిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఊహించని ధోరణి కన్పిస్తోందనేది జాతీయ విద్యా సర్వే నివేదికల సారాంశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థి సైకాలజీ, టీచర్లకు విద్యార్థికి మధ్య సమన్వయం, సరికొత్త మెళకువలతో బోధన వంటి టెక్నిక్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 
  
శిక్షణ మంచిదే: పింగిళి శ్రీపాల్‌ రెడ్డి (పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు) 
నేటి విద్యావిధానంలో మార్పులను అందిపుచ్చుకునేందుకు కొత్త టీచర్లకు శిక్షణ అవసరం. చట్టాలను వారికి తెలియజెప్పాలి. ఎప్పుడో బీఈడీ చేసిన వారికి ఈ తరహా పునశ్చరణ మేలు చేస్తుంది. అయితే, వేగంగా మారుతున్న సమాజంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు తరచూ చేపట్టాల్సిన అవసరం ఉంది.  
 
అంకిత భావం పెరుగుతుంది : సయ్యద్‌ ఫౌకత్‌ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) 
పోటీ పరీక్షల్లో విజయం సాధించి, టీచర్‌గా వచ్చే వ్యక్తికి ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యత తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అంకిత భావం పెరుగుతుంది. కొత్త తరం ఉపాధ్యాయులకు సరైన మార్గనిర్దేశం ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు. బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తెస్తారు.  
 

Published date : 07 Oct 2024 11:52AM

Photo Stories